ఫేస్‌యాప్ వాడుతున్నారా..? మీ డేటా గోవిందా..!


Thu,July 18, 2019 11:29 AM

స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ముఖాలను వృద్ధులుగా లేదా యవ్వనంగా.. ఎలా కావాలనుకుంటే అలా మార్చుకునేందుకు వీలు కల్పిస్తున్న ఫేస్‌యాప్ ఇప్పుడు ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. పలువురు సెలబ్రిటీలు ఈ యాప్ ద్వారా వృద్ధాప్యంలో తమ ముఖాలు ఎలా ఉంటాయో ఫిల్టర్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ యాప్ కాస్తా వైరల్ అయింది. దీంతో ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను ఫోన్‌లో వేసుకుని తాము వృద్ధాప్యంలో ఎలా ఉంటామోనని చెక్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్యంతా ఉంది. అదేమిటంటే...

ఫేస్‌యాప్ వాడే ప్రతి ఒక్కరూ ఆ యాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌కు ఒప్పుకుని యాప్‌ను వాడాల్సి ఉంటుంది. అయితే ఆ నియమ నిబంధనల్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేమిటంటే.. యూజర్లు ఈ యాప్‌లో స్టోర్ చేసే తమ సమాచారంతోపాటు ప్రాసెసింగ్ కోసం ఈ యాప్ సర్వర్లలోకి అప్‌లోడ్ చేసే ఫోటోలు, ఇతర డేటాను ఫేస్‌యాప్ కంపెనీ ఎలా కావాలంటే అలా వాడుకుంటుంది. అంటే.. మీరు ఉదాహరణకు ఇండియాలో ఈ యాప్‌ను వాడితే మీకు చెందిన ఫొటోలు, సమాచారాన్ని ఈ యాప్ వేరే ఇతర ఏ దేశంలోనైనా.. తమకు కావల్సినట్లు ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. తమ యాప్ లేదా తమ కంపెనీకి చెందిన ఇతర ప్రొడక్ట్స్‌ను యూజర్ల డేటాతో పబ్లిసిటీ చేసుకోవచ్చు. లేదా ఆ డేటాను ఇతరులకు అమ్ముకోవచ్చు. అందుకు గాను మనం అనుమతిని తెలుపుతూ యాప్‌ను వాడేందుకు ముందుగానే టర్మ్స్ అండ్ కండిషన్స్‌కు అనుమతి తెలుపుతాం. అంటే.. మన ఫొటోలు, డేటాను మొత్తం పుణ్యానికి వాళ్లకు ఎలాగైనా వాడుకోవచ్చని చెప్పి మనమే అనుమతినిస్తున్నామన్నమాట. ఇది తెలియని చాలా మంది యాప్‌ను వాడుతూ తమ డేటా, ఫొటోలను ఈ యాప్ సర్వర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. అయితే యూజర్లు ఈ యాప్‌ను వాడేముందు ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆలోచించాలని పలువురు ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు..!

2717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles