యూసీ బ్రౌజర్.. మళ్లీ వచ్చేసింది..!


Wed,November 22, 2017 03:20 PM

గత వారం రోజుల కిందటే అలీబాబా గ్రూప్‌నకు చెందిన యూసీ బ్రౌజర్ ఆండ్రాయిడ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాయమైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ఆ యాప్ మళ్లీ యూజర్లకు లభిస్తున్నది. గతంలో యూసీ బ్రౌజర్ నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల ఫోన్లలో డేటాను తస్కరిస్తున్నదని తెలిసినందునే గూగుల్ సంస్థ ఆ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన యూసీ వెబ్ గూగుల్ ప్లే స్టోర్ పాలసీలకు అనుగుణంగా తమ యాప్ లేదని, ఆ వివరాలను మార్చడం కోసమే తమ యాప్‌ను తామే ప్లే స్టోర్ నుంచి తీసేశామని వివరణ ఇచ్చింది. ఈ క్రమంలోనే యూసీ బ్రౌజర్ యాప్‌ను ప్లే స్టోర్ పాలసీలకు అనుగుణంగా మార్పులు చేశామని, సదరు అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇప్పుడు మళ్లీ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తెచ్చామని యూసీ వెబ్ స్పష్టం చేసింది.

గత కొద్ది నెలల కిందట కూడా యూసీ బ్రౌజర్ ఆండ్రాయిడ్ యాప్‌పై అనేక వివాదాలు చెలరేగాయి. ఆ యాప్ చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్‌ది కనుక సదరు యాప్ వినియోగదారుల ఫోన్ల నుంచి డేటాను తస్కరించి చైనా సర్వర్లకు చేరవేస్తుందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా యూసీ బ్రౌజర్‌ను ఇండియాలో బ్యాన్ చేస్తామని తెలియజేసింది. దీంతో ఆ సంస్థ అప్పట్లో వివరణ ఇచ్చింది. తాజాగా ఈ వివాదంతో మరోసారి యూసీ వెబ్ చిక్కుల్లో పడింది. అయితే ఈ యాప్‌ను భారత్‌లో స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం మన దేశంలో ఆండ్రాయిడ్ ఫోన్లలో అధికంగా వాడబడుతున్న ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్‌గా యూసీ బ్రౌజర్ నిలవగా, తరువాతి స్థానంలో గూగుల్ క్రోమ్ ఉండడం విశేషం.

4316

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles