యూట్యూబ్‌లో డబ్బు సంపాదన, ఇకపై అంత ఈజీ కాదు..!


Sun,April 9, 2017 04:23 PM

ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది యూట్యూబ్. వీక్షకులందరినీ ఆకట్టుకునేలా సొంతంగా ఓ వీడియో రికార్డ్ చేసి అందులో పెడితే చాలు, ఆ వీడియోకు వచ్చిన వ్యూస్, వాటిలో కనిపించే యాడ్స్‌ను బట్టి ఆ వీడియో పెట్టిన వారికి డబ్బులు వస్తాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన యాడ్ సెన్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఈ అవకాశాన్ని ఔత్సాహికులకు కల్పిస్తుందని అందరికీ తెలిసిందే. దీంతో చాలా మంది సొంతంగా యూట్యూబ్‌లో ఏకంగా చానల్స్ పెట్టి వీడియోలను షూట్ చేసి వాటిలోకి అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధిక శాతం మందికి చక్కని ఆదాయం కూడా లభిస్తోంది. అయితే ఇకపై యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించడం చాలా కష్టతరమవుతుందని తెలిసింది. అందుకు కారణం యూట్యూబ్‌లో త్వరలో రానున్న రూల్సే..!

ప్రస్తుతం యూట్యూబ్‌లో యూజర్లు అప్‌లోడ్ చేసే వీడియోలకు 1000 వ్యూస్ కి ఇంత, లేదంటే వీడియో మధ్య మధ్యలో వచ్చే యాడ్స్‌ను వీక్షిస్తే, వాటిని క్లిక్ చేస్తే ఇంత అని యూట్యూబ్ డబ్బులు చెల్లిస్తోంది. అయితే ఇకపై అలా కాదు. ఏ వీడియోకైనా యాడ్ డిస్‌ప్లే కావాలంటే కనీసం 10వేల వ్యూస్ ఉండాల్సిందేనని తెలిసింది. దీంతోపాటు వీడియోలో వచ్చే యాడ్స్‌ను వీక్షకులు క్లిక్ చేస్తేనే అప్‌లోడర్‌కు డబ్బులు అందించేలా యూట్యూబ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ ఇవే రూల్స్‌ను యూట్యూబ్ త్వరలో అమలులోకి తెస్తున్నట్టు తెలిసింది.

తన ప్రత్యర్థి సంస్థలైన ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకే గూగుల్ తన యూట్యూబ్ సైట్‌లో ఇలాంటి మార్పులు తెస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు యూట్యూబ్‌లో కుప్పలు కుప్పలుగా నకిలీ చానల్స్ వస్తున్నాయి. వాటిలో పెడుతున్న వీడియోలు నాసిరకంగా ఉంటున్నాయని, అన్నీ కాపీ కొట్టినవేనని, కాపీ రైట్‌కు అందకుండా పలు జిమ్మిక్కులకు పాల్పడి కొందరు అలా డూప్లికేట్ వీడియోలను పెడుతున్నట్టు తెలిసింది. అందుకే యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకోనున్నదట. ఏది ఏమైనా యూట్యూబ్‌లో చానల్స్‌ను నిర్వహిస్తున్న వారికి మాత్రం ఇకపై అంత ఈజీగా డబ్బులు రావని విశ్లేషకులు భావిస్తున్నారు.

5576

More News

VIRAL NEWS