ఫోన్ పోయిందా..? ఇకపై బెంగ పడాల్సిన అవసరం లేదు..!


Mon,September 16, 2019 07:09 PM

ఎంతో డబ్బు పెట్టి కొనుగోలు చేసిన ఫోన్ పోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనమే మన అజాగ్రత్త కారణంగా ఫోన్లను పారేసుకుంటాం. ఇక కొన్ని సమయాల్లో దొంగలు తమ చేతి వాటం ప్రదర్శిస్తారు. అయితే ఎలా పోయినా.. ఫోన్‌ను కోల్పోతే దాన్ని వెదికి పట్టుకోవడం చాలా కష్టమైన పని. దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ.. ఇకపై అలా కాదు. ఫోన్ పోయినా వెంటనే వెదికి పట్టుకోవచ్చు. అప్పటి వరకు ఆ ఫోన్‌ను ఇతరులు వాడకుండా ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చు కూడా. త్వరలోనే ఈ సదుపాయం దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.

ఫోన్లను పోగొట్టుకుంటున్న వారికి వాటిని వెదికిచ్చేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ (డాట్) ఓ నూతన ప్రాజెక్టును త్వరలో అందుబాటులోకి తేనుంది. ఇందులో భాగంగా.. ఎవరి ఫోన్ అయినా పోతే.. వారు ముందుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లెయింట్ ఇచ్చి ఎఫ్‌ఐఆర్ కాపీ తీసుకోవాలి. ఆ తరువాత 14422 (డాట్) నంబర్‌కు ఫోన్ చేసి తమ ఫోన్ పోయిన విషయాన్ని, పోలీసులకు కంప్లెయింట్ చేసిన విషయాన్ని చెప్పాలి. వారు వెరిఫై చేసి ఆ ఫోన్‌కు చెందిన ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెండిటీ) నంబర్ తెలుసుకుని దాని సహాయంతో ఆ ఫోన్‌ను బ్లాక్ లిస్టులో పెడతారు. ఇక ఆ వివరాలను టెలికాం ఆపరేటర్లకు ఇస్తారు. దాంతో ఆపరేటర్లు ఆ బ్లాక్‌లిస్టులో ఉన్న ఐఎంఈఐ నంబర్ ప్రకారం ఆ ఫోన్‌ను ఎవరైనా వేరే సిమ్‌తో వాడుతుంటే ఆ ఫోన్‌ను బ్లాక్ చేస్తారు. అంతేకాదు, ఆ సమయంలో ఆ ఫోన్ ఎక్కడ ఉందో దాన్ని ఆపరేటర్లు ట్రేస్ చేసి పోలీసులకు ఇన్‌ఫాం చేస్తే వారు ఫోన్‌ను రికవరీ చేస్తారు. ఇలా ఈ ప్రక్రియ సాగుతుంది.

అయితే ప్రస్తుతానికి కేవలం మహారాష్ట్రలోనే ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. త్వరలోనే దేశ వ్యాప్తంగా ఈ సౌకర్యం సెల్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. కాగా 2017 నుంచి డాట్ దేశంలోని వినియోగదారులకు చెందిన ఫోన్ల ఐఎంఈఐ నంబర్లను సేకరించి తన డేటాబేస్‌లో భద్ర పరుస్తోంది. దాని స‌హాయంతోనే ఈ ప్రాజెక్టును చేప‌ట్టారు. అయితే ఈ సౌకర్యం ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందో డాట్ వెల్లడించలేదు.

20676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles