ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్లలో సిగ్నల్ సమస్యలు..?


Tue,September 25, 2018 07:02 PM

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ తన నూతన ఐఫోన్లు ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్‌లను ఇటీవలే విడుదల చేయగా, ప్రస్తుతం అవి పలు దేశాలకు చెందిన మార్కెట్లలో లభిస్తున్నాయి. ఇక భారత్‌లో ఈ ఫోన్లను ఈ నెల 28వ తేదీ నుంచి విక్రయించనున్నారు. అయితే ఈ ఫోన్లను వాడుతున్న పలువురు యూజర్లకు సిగ్నల్ సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది.

వెరిజాన్ నెట్‌వర్క్ యూజర్లు తమ ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్లలో సిగ్నల్ తక్కువగా చూపిస్తుందని ఫిర్యాదు చేస్తున్నారు. అయితే అదే నెట్‌వర్క్‌కు చెందిన ఐఫోన్ 8 ప్లస్, X యూజర్లకు ఫోన్లలో సిగ్నల్ బాగానే చూపిస్తుందని సమాచారం. ఈ క్రమంలో ఈ సిగ్నల్ సమస్య ఫోన్లలోనే ఉండి ఉంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతుండగా, మరికొందరు.. యాపిల్ ఐఫోన్లలో ఈసారి క్వాల్‌కామ్ కాకుండా ఇంటెల్ మోడమ్‌లను అమర్చారని, అందువల్లే సమస్యలు వచ్చి ఉంటాయని చెబుతున్నారు.

కాగా ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్లలో కేవలం 4జీని వాడేటప్పుడే సిగ్నల్ తక్కువగా వస్తుందని, 3జీ వాడితే ఎలాంటి సమస్య ఉండడం లేదని ఓ యూజర్ తెలిపాడు. దీంతోపాటు ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్లలో వైఫై ద్వారా వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంటుందని కూడా పలువురు యూజర్లు ఆరోపిస్తున్నారు. రూటర్‌లో 5 గిగాహెడ్జ్ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని కాకుండా ఐఫోన్లు 2.4 గిగాహెడ్జ్ నెట్‌వర్క్‌నే తీసుకుంటున్నాయని, అందుకే వైఫై ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుందని వారు చెబుతున్నారు. అయితే దీనిపై యాపిల్ ఇంకా స్పందించలేదు. ఒక వేళ సమస్యలు నిజమే అయితే యాపిల్ వెంటనే వీటికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను విడుదల చేస్తుంది..!

2057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles