అద్భుతం.. అతిశ‌యం.. గెలాక్సీ ఎస్10 ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్‌..!


Thu,February 21, 2019 10:43 AM

శాంసంగ్ కంపెనీ త‌న గెలాక్సీ ఎస్ సిరీస్‌లో నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు అయిన గెలాక్సీ ఎస్‌10, ఎస్‌10 ప్ల‌స్‌, ఎస్‌10ఇ ల‌ను విడుద‌ల చేసింది. నిన్న అర్ధ‌రాత్రి శాన్ ఫ్రాన్సిస్కోలో జ‌రిగిన ఈవెంట్‌లో శాంసంగ్ ఈ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. ఈ మూడు ఫోన్ల‌లోనూ ముందు భాగంలో హోల్‌-పంచ్ సెల్ఫీ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. వీట‌న్నింటిలోనూ ప‌లు ఫీచ‌ర్లను కామ‌న్‌గా అందిస్తున్నారు. ప్రాసెస‌ర్‌, డైన‌మిక్ అమోలెడ్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్‌10 ప్ల‌స్ స‌ర్టిఫికేష‌న్‌, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్ 2.0, వైర్‌లెస్ ప‌వ‌ర్‌షేర్ తదిత‌ర ఫీచ‌ర్ల‌ను ఈ మూడు ఫోన్ల‌లోనూ అందిస్తున్నారు. ఇక హువావే మేట్ 20 ప్రొ లో ఉన్న‌ట్లుగానే వీటిలో రివ‌ర్స్ వైర్‌లైస్ చార్జింగ్ ఫీచ‌ర్ ను అందిస్తున్నారు. కాగా గెలాక్సీ ఎస్10, ఎస్‌10 ప్ల‌స్ ఫోన్ల క‌న్నా త‌క్కువ ధ‌రకే గెలాక్సీ ఎస్‌10ఇ ఫోన్‌ను అందిస్తున్నారు.

డిస్‌ప్లే...


గెలాక్సీ ఎస్10 ఫోన్‌లో 6.1 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా, గెలాక్సీ ఎస్10 ప్ల‌స్ ఫోన్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, గెలాక్సీ ఎస్10ఇ ఫోన్‌లో 5.8 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇక గెలాక్సీ ఎస్10, ఎస్10 ప్ల‌స్ ఫోన్ల డిస్‌ప్లేలు క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను క‌లిగి ఉండ‌గా, గెలాక్సీ ఎస్10 ఇ ఫోన్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను క‌లిగి ఉంది. ఈ మూడింటిలోనూ డైన‌మిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఒ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల ముందు భాగంలో ఫోన్ డిస్‌ప్లేలు ఎడ్జ్ టు ఎడ్జ్ వ‌స్తాయి. అలాగే ఈ ఫోన్ల డిస్‌ప్లేల‌కు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ 6 ను కూడా అందిస్తున్నారు.

ప్రాసెస‌ర్‌, ర్యామ్‌, స్టోరేజ్‌...


గెలాక్సీ ఎస్10, ఎస్‌10 ప్ల‌స్‌, ఎస్10ఇ ఫోన్ల‌లో కామ‌న్ గా ఒకే త‌ర‌హా ప్రాసెస‌ర్‌ను అందిస్తున్నారు. కాక‌పోతే ప్రాంతాల‌ను బట్టి ఫోన్ల‌లో యూజ‌ర్ల‌కు ల‌భించే ప్రాసెస‌ర్ మారుతుంది. ఈ ఫోన్ల‌లో స్నాప్‌డ్రాగ‌న్ 855 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్, శాంసంగ్ ఎగ్జినోస్ 9820 ప్రాసెస‌ర్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఆయా దేశాల్లో ఉండే యూజ‌ర్లకు గెలాక్సీ ఎస్‌10 ఫోన్ల‌లో ఈ రెండింటిలో ఏదో ఒక ప్రాసెస‌ర్ ఉన్న ఫోన్‌ ల‌భిస్తుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో ఉండే యూజ‌ర్ల‌కు స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్ ఉన్న గెలాక్సీ ఎస్10 ఫోన్లు ల‌భిస్తే, మ‌రికొన్ని ప్రాంతాల్లో ఉన్న యూజ‌ర్ల‌కు శాంసంగ్ ఎగ్జినోస్ 9820 ప్రాసెస‌ర్ ఉన్న గెలాక్సీ ఎస్10 ఫోన్లు ల‌భిస్తాయి. ఇక గెలాక్సీ ఎస్10లో 8జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌ను అందిస్తుండ‌గా, గెలాక్సీ ఎస్‌10 ప్ల‌స్‌లో 8/12 జీబీ ర్యామ్‌, 128/512జీబీ/1 టీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌ను అందిస్తున్నారు. అలాగే గెలాక్సీ ఎస్‌10ఇ లో 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌ను అందిస్తున్నారు. మూడు ఫోన్ల‌లోనూ 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు.

కెమెరా...


గెలాక్సీ ఎస్10 ఫోన్‌లో వెనుక భాగంలో 12, 12, 16 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉన్నాయి. వీటిలో 12 మెగాపిక్స‌ల్ కెమెరా ఒక‌దాన్ని టెలిఫోటో కెమెరాగా వాడుకోవ‌చ్చు. దీనికి 10ఎక్స్ డిజిట‌ల్ జూమ్ ల‌భిస్తుంది. ఈ ఫోన్‌లో ముందు భాగంలో 10 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే గెలాక్సీ ఎస్10 ప్ల‌స్ లో వెనుక భాగంలో ఎస్10 లాగే కెమెరాల‌ను అందిస్తున్నారు. ముందు భాగంలో మాత్రం 10 మెగాపిక్సల్ కెమెరాకు తోడు మ‌రో 8 మెగాపిక్స‌ల్ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా గెలాక్సీ ఎస్‌10ఇ ఫోన్‌లో వెనుక భాగంలో 12, 16 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండింటిని ఏర్పాటు చేశారు. ముందు భాగంలో మాత్రం గెలాక్సీ ఎస్10 లాగే 10 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. కాగా గెలాక్సీ ఎస్‌10, ఎస్10 ప్ల‌స్ ఫోన్ల‌లో వెనుక భాగంలో ఉన్న కెమెరాల‌కు కొత్త‌గా డ్యుయ‌ల్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

ఇత‌ర ఫీచ‌ర్లు...


గెలాక్సీ ఎస్‌10, ఎస్‌10 ప్ల‌స్ ఫోన్ల‌లో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఈ త‌ర‌హా ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌తో వ‌చ్చిన శాంసంగ్ ఫోన్లు ఇవే కావ‌డం విశేషం. అలాగే గెలాక్సీ ఎస్10 సిరీస్ ఫోన్ల‌లో కొత్త‌గా వైఫై 802.11 ఏఎక్స్ కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. గేమింగ్ కోసం డాల్బీ అట్మోస్‌, వేప‌ర్ చాంబ‌ర్ కూలింగ్ (గెలాక్సీ ఎస్10 ప్ల‌స్‌), క్విక్ చార్జ్ 2.0, అడాప్టివ్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్ల‌లో అందిస్తున్నారు. ఈ ఫోన్ల‌కు ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్ల‌న్నీ డ్యుయ‌ల్ సిమ్ వేరియెంట్ల‌లోనూ రీజియ‌న్‌ను బ‌ట్టి ల‌భ్యం కానున్నాయి.

ధ‌ర‌...


గెలాక్సీ ఎస్10 సిరీస్ ఫోన్లు భార‌త్ లో ఎప్పుడు ల‌భ్య‌మ‌య్యేది శాంసంగ్ వెల్ల‌డించ‌లేదు. కానీ గెలాక్సీ ఎస్‌10 ప్రారంభ ధ‌ర మాత్రం రూ.63,900 గా ఉండ‌నుంద‌ని స‌మాచారం. అలాగే గెలాక్సీ ఎస్10 ప్ల‌స్ రూ.71వేల ప్రారంభ ధ‌ర‌కు, గెలాక్సీ ఎస్10ఇ రూ.53,300 ప్రారంభ ధ‌ర‌కు ల‌భ్యం కానున్న‌ట్లు తెలిసింది. ఇక గెలాక్సీ ఎస్10 ప్రిజం బ్లాక్‌, ప్రిజం బ్లూ, ప్రిజం గ్రీన్‌, ప్రిజం వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భ్యం కానుండ‌గా, గెలాక్సీ ఎస్10 ప్ల‌స్ ఫోన్ మాత్రం ఈ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌తో క‌లిపి సెరామిక్ బ్లాక్‌, సెరామిక్ వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో కూడా ల‌భ్యం కానుంది. అలాగే గెలాక్సీ ఎస్10ఇ ప్రిజం బ్లాక్‌, ప్రిజం బ్లూ, ప్రిజం గ్రీన్‌, ప్రిజం వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌తోపాటు కాన‌రీ ఎల్లో క‌ల‌ర్ ఆప్ష‌న్‌లోనూ ల‌భ్యం కానుంది. కాగా ఈ మూడు ఫోన్లు అమెరికా మార్కెట్‌లో మార్చి 8వ తేదీ నుంచి ల‌భ్యం కానున్నాయి. ఇందుకు గాను ఇవాళ్టి నుంచి అక్క‌డ ప్రీ ఆర్డ‌ర్ల‌ను కూడా ఇప్ప‌టికే ప్రారంభించారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌10 5జీ వేరియెంట్ విడుద‌ల‌...


శాంసంగ్ త‌న ఈవెంట్ లో గెలాక్సీ ఎస్10 స్మార్ట్‌ఫోన్‌కు గాను 5జీ వేరియెంట్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ ఫోన్ రానున్న వేస‌విలో అమెరికా మార్కెట్ లో ల‌భ్యం కానుంది. ఇందులో సింగిల్ సిమ్‌ను మాత్ర‌మే అందిస్తున్నారు. ఇక మిగిలిన ఫీచ‌ర్ల‌న్నీ గెలాక్సీ ఎస్10ను పోలి ఉన్నాయి. కాక‌పోతే ఇందులో 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్, వెనుక భాగంలో నాలుగు కెమెరాలు, ముందు భాగంలో 10 మెగాపిక్స‌ల్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను మాత్రం శాంసంగ్ ఇంకా వెల్ల‌డించ‌లేదు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్10, ఎస్10 ప్ల‌స్ ఫీచ‌ర్లు...


* ఎస్‌10- 6.1 ఇంచ్ డిస్‌ప్లే
* ఎస్‌10 ప్ల‌స్ - 6.4 ఇంచ్ డిస్‌ప్లే
* గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌/శాంసంగ్ ఎగ్జినోస్ 9820 ప్రాసెస‌ర్‌
* ఎస్10 - 8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్,
* ఎస్10 ప్ల‌స్ - 8/12 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ/1 టీబీ స్టోరేజ్‌
* 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, సింగిల్‌, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* 12, 12, 16 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
* ఎస్10 - 10 మెగాపిక్స‌ల్ సెల్పీ కెమెరా
* ఎస్10 ప్ల‌స్ - 10, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు
* ఐపీ 68 వాటర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్‌, అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* బారో మీట‌ర్, కెపాసిటివ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, జియో మాగ్నెటిక్ సెన్సార్‌,
హాల్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏఎక్స్‌, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ 3.1, ఎన్ఎఫ్‌సీ, ఎంఎస్టీ
* ఎస్‌10 - 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లైస్ చార్జింగ్
* ఎస్‌10 ప్ల‌స్ - 4100 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌, వైర్‌లెస్ ప‌వ‌ర్‌షేర్

శాంసంగ్ గెలాక్సీ ఎస్10ఇ ఫీచ‌ర్లు...


* 5.8 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 / శాంసంగ్ ఎగ్జినోస్ 9820 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌
* 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 9.0 పై, సింగిల్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌
* 12, 16 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
* ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్‌, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* బారో మీట‌ర్‌, కెపాసిటివ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, హాల్ సెన్సార్‌
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏఎక్స్, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ 3.1, ఎన్ఎఫ్‌సీ, ఎంఎస్టీ
* 3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్ లెస్ చార్జింగ్‌, వైర్‌లెస్ ప‌వ‌ర్ షేర్

4194

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles