వాహ్..! శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచర్స్.. అదుర్స్..!


Fri,August 10, 2018 08:25 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9 ను విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 8.30 గంటలకు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జరిగిన ఈవెంట్‌లో శాంసంగ్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు.

డిస్‌ప్లే, డిజైన్...


శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచుల భారీ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. క్వాడ్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ (2960 x 1440 పిక్సల్స్)ను ఈ ఫోన్ కలిగి ఉంది. దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేశారు. ముందు, వెనుక భాగాల్లో ఉన్న బాడీకి ఈ ప్రొటెక్షన్ ఉంది. ఇక ఈ ఫోన్ చక్కని మ్యాట్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. గెలాక్సీ నోట్ 5 మాదిరిగా ఫోన్ ఎడ్జ్‌లను చూడచక్కని రీతిలో తీర్చిదిద్దారు. దీని వల్ల ఫోన్‌కు అద్భుతమైన ప్రీమియం లుక్ వచ్చింది. ఇక ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, లావెండర్ పర్పుల్, మెటాలిక్ కాపర్, ఓషియన్ బ్లూ కలర్ వేరియెంట్లలో వినియోగదారులకు లభ్యం కానుంది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్...


గెలాక్సీ నోట్9 స్మార్ట్‌ఫోన్‌లో అధునాతన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఇండియన్ వేరియెంట్‌లో శాంసంగ్ సొంత చిప్‌సెట్ అయిన ఎగ్జినోస్ 9810 ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు 6/8 జీబీ ర్యామ్ ఆప్షన్లను అందిస్తున్నారు. దీని వల్ల ఫోన్ అద్భుతమైన వేగంతో పనిచేస్తుంది. మంచి ప్రదర్శనను ఇస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. దీనికితోడు ఫోన్ మెమొరీని ఎక్స్‌పాండబుల్ స్లాట్ ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. దీంతో ఫోన్‌లో ఏకంగా 1టీబీ స్టోరేజ్ యూజర్లకు లభిస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నారు.

కెమెరా...


గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక భాగంలో ఉన్న కెమెరాలకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌ను ఇచ్చారు. అందువల్ల ఫోన్ షేక్ అవుతున్నా ఫొటోలు మాత్రం బ్లర్ అవకుండా వస్తాయి. ఇక రెండు కెమెరాల్లో ఒక కెమెరా టెలిఫోటో కెమెరాగా పనిచేస్తుంది. అంటే ఒక కెమెరా ద్వారా యూజర్లకు 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లేదా 10ఎక్స్ డిజిటల్ జూమ్ లభిస్తుంది. ఇవే కాకుండా గతంలో వచ్చిన గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్‌లలో కెమెరాలకు ఉన్న ఫీచర్లు ఈ ఫోన్‌లోనూ లభిస్తున్నాయి.

డెక్స్ ఫీచర్...


శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేకు కనెక్ట్ చేసుకుని ఫోన్‌ను పీసీలా ఉపయోగించుకోవచ్చు. అందుకు గాను హెచ్‌డీఎంఐ కేబుల్ ద్వారా డివైస్‌లను కనెక్ట్ చేయాలి. అనంతరం డెక్స్ సాఫ్ట్‌వేర్ సహాయంతో ఫోన్‌ను కంప్యూటర్ తరహాలో ఉపయోగించుకోవచ్చు. స్క్రీన్‌పై వర్చువల్ కీబోర్డ్ ఫీచర్ కూడా లభిస్తుంది.

ఇతర ఫీచర్లు...


గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌లో ఐరిస్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వెనుక భాగంలో ఉంది. అలాగే ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో బిక్స్‌బీ డిజిటల్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు దీనికి ప్రత్యేకంగా ఫోన్‌పై డెడికేటెడ్ బటన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో గతంలో వచ్చిన నోట్ ఫోన్లకు ఇచ్చినట్లుగానే ఎస్ పెన్ స్టైలస్‌ను అందిస్తున్నారు. దీనికి బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో సెల్ఫీలు తీసుకోవచ్చు. స్లైడ్స్‌ను ప్రజెంటేషన్ ఇవ్వవచ్చు. వీడియోలను పాజ్, ప్లే చేసుకోవచ్చు. ఇంకా ఇతర పనులకు ఎస్ పెన్ పనికొస్తుంది.

గెలాక్సీ నోట్ 9 లో ఎస్9 సిరీస్ తరహాలోనే డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. ఈ ఫోన్‌లో ఏఆర్ ఎమోజీ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. దీంతో ఫోన్‌లో ఉన్న ముందు కెమెరా యూజర్ ముఖాన్ని స్కాన్ చేసి 100 ఫేషియల్ పాయింట్లను గుర్తించి సేవ్ చేసుకుంటుంది. దాంతో ఓ 3డీ మోడల్‌ను రూపొందించుకుంటుంది. ఆ మోడల్ యూజర్ అంతకు ముందు ఇచ్చిన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌కు అనుగుణంగా ఎమోజీలా మారుతుంది. దాన్ని యూజర్ ఉపయోగించుకోవచ్చు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా గెలాక్సీ నోట్ 9 ఫోన్‌లో బ్యాటరీ కెపాసిటీని అమాంతం పెంచారు. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. అందువల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుందనే దిగులు యూజర్లకు ఇక ఏ మాత్రం ఉండదు. ఇక ఈ బ్యాటరీ అడాప్టివ్ ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ అనే ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో బారో మీటర్, హార్ట్ రేట్ సెన్సార్, ప్రెషర్ సెన్సార్‌లను కూడా ఏర్పాటు చేశారు.

ధర, లభ్యత...


గెలాక్సీ నోట్ 9 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ.68,750)గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1249 డాలర్లు (దాదాపుగా రూ.85,940)గా ఉంది. అమెరికా మార్కెట్‌లో ఈ ఫోన్‌ను ఈ నెల 24వ తేదీ నుంచి విక్రయించనున్నారు. నేటి నుంచి అక్కడ ఈ ఫోన్‌కు గాను ప్రీ ఆర్డర్లను ప్రారంభించనున్నారు. అయితే ఈ ఫోన్‌ను భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారు, ధర తదితర వివరాలను మాత్రం శాంసంగ్ వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే గెలాక్సీ నోట్ 9 ను భారత మార్కెట్‌లోనూ లాంచ్ చేయనున్నారు.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచ‌ర్లు...


6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌/ఆక‌్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెస‌ర్, 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్, ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

3690

More News

VIRAL NEWS

Featured Articles