రెస్టారెంట్లకు జొమాటో గోల్డ్ కష్టాలు.. ప్లీజ్.. వెళ్లొద్దని జొమాటో వేడుకోలు..!


Thu,August 22, 2019 01:18 PM

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వల్ల రెస్టారెంట్లకు కష్టాలు మొదలయ్యాయి. జొమాటో అందిస్తున్న గోల్డ్ మెంబర్‌షిప్ వల్ల తమకు ఎంతో నష్టం వస్తుందని రెస్టారెంట్ల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక రెస్టారెంట్లు ఇప్పటికే జొమాటో నుంచి తప్పుకోగా.. జొమాటో మాత్రం ప్లీజ్.. వెళ్లొద్దని, తమ గోల్డ్ లిస్ట్‌లోనే ఉండాలని రెస్టారెంట్లను కోరుతోంది.

జొమాటోలో ఉన్న గోల్డ్ మెంబర్‌షిప్‌ను పొందిన వారు రెస్టారెంట్లలో ఉచితంగా డ్రింక్స్, మెయిన్ కోర్స్ డిషెస్, డిజర్ట్స్‌ను పొందవచ్చు. దీంతో చాలా మంది ఒక రెస్టారెంట్‌లో 1+1 పద్ధతిలో డ్రింక్స్ తాగి, మరొక రెస్టారెంట్‌లో అదే పద్ధతిలో మెయిన్‌కోర్స్ ఆరగిస్తున్నారు. ఇక భోజనం అయ్యాక ఇంకో రెస్టారెంట్‌లో తిరిగి అదేవిధంగా 1+1 పద్ధతిలో డిజర్ట్‌లను ఆరగిస్తున్నారు. దీంతో తమకు భారీగా నష్టం వస్తున్నదని రెస్టారెంట్ యాజమాన్యాలు వాపోతున్నాయి. అందులో భాగంగానే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా #Logout పేరిట ఓ సోషల్ మీడియా క్యాంపెయిన్ నడుస్తోంది. దీంతో ఎన్‌ఆర్‌ఏఐలో సభ్యులుగా ఉన్న అనేక రెస్టారెంట్‌లు ఇప్పటికే జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ డైనర్స్ లిస్ట్ నుంచి తప్పుకున్నాయి. దేశవ్యాప్తంగా ఈ జాబితాలో మొత్తం 6500కు పైగా రెస్టారెంట్లు ఉండగా, వాటిలో 2వేల రెస్టారెంట్లు జొమాటో లిస్ట్ నుంచి తప్పుకున్నాయి. దీంతో జొమాటో స్పందించక తప్పలేదు.

దేశ వ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు జొమాటో గోల్డ్ నుంచి తప్పుకోవడంతో ఆ కంపెనీ గోల్డ్ మెంబర్‌షిప్‌కు పలు మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త మెంబర్‌షిప్ రూల్స్ ప్రకారం.. ఇకపై ఈ సభ్యత్వం ఉన్న యూజర్లు రోజుకు ఒక్కసారే కాంప్లిమెంటరీ ఆఫర్‌ను ఏదైనా ఒక్క రెస్టారెంట్‌లోనే వాడుకోవాల్సి ఉంటుంది. ఇతర రెస్టారెంట్లకు వెళ్లినా ఆ ఆఫర్‌ను వాడుకోలేరు. అలాగే ఒక రెస్టారెంట్‌లో రోజుకు ఒక టేబుల్‌కు గాను కేవలం రెండు సార్లు మాత్రం జొమాటో గోల్డ్ బెనిఫిట్స్ అన్‌లాక్ అవుతాయి. అంటే.. ఏదైనా రెస్టారెంట్‌లో ఒక రోజులో ఒక టేబుల్‌కు కేవలం ఇద్దరు జొమాటో గోల్డ్ యూజర్లకు మాత్రమే కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ అన్‌లాక్ అవుతాయి. ఆ తరువాత వచ్చే వారికి ఆ బెనిఫిట్స్‌ను వాడుకునేందుకు వీలుండదు.

దీంతోపాటు జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ వాడకంపై కూడా జొమాటో నియంత్రణ విధించనుంది. దీని వల్ల జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ ఉన్నవారు దాన్ని ఇతరులతో షేర్ చేసుకునేందుకు వీలుండదు. ఒక మెంబర్‌షిప్‌ను ఒక ఫోన్‌లో మాత్రమే వాడుకునేలా కొత్త నిబంధనను తెచ్చారు. దీని వల్ల ఆ మెంబర్‌షిప్ ఉన్న యూజర్లు తమ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇతరులకు షేర్ చేయడం ఇకపై కుదదరు. కేవలం తమ ఫోన్‌లోనే ఆ మెంబర్‌షిప్‌ను వాడుకోవాల్సి ఉంటుంది. వేరే ఫోన్‌లో ఆ సభ్యత్వం అందుబాటులో ఉండదు.

కాగా కొత్త నిబంధనలను సెప్టెంబర్ 15 నుంచి అమలు చేస్తామని, కనుక ఆ లోపు తమ గోల్డ్ మెంబర్‌షిప్ జాబితా నుంచి వైదొలగిన రెస్టారెంట్లు ఎలాంటి అదనపు ఫీజు లేకుండా ఉచితంగా మళ్లీ జాబితాలో చేరవచ్చని జొమాటో ఆ రెస్టారెంట్లకు తెలిపింది. అయితే జొమాటో త్వరలో అమలు చేస్తామని ప్రతిపాదించిన కొత్త నియమాలు కూడా తాము ఆశించిన విధంగా లేవని ఎన్‌ఆర్‌ఏఐ పేర్కొనడం విశేషం. మరి ఈ విషయంలో జొమాటో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి..!

3699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles