మొబైల్ కాల్స్, డేటా రేట్లను పెంచబోతున్న జియో


Tue,November 19, 2019 10:05 PM

న్యూఢిల్లీ : మొబైల్ సేవల ధరలను పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ఫోన్ కాల్స్, డేటా చార్జీలను రాబోయే కొద్ది వారాల్లో పెంచుతామని స్పష్టం చేసింది. అయితే ఎంత మేరకు పెంపు ఉంటుందన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. వొడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ చార్జీల పెంపును ప్రకటించిన నేపథ్యంలో జియో కూడా పెంపు నిర్ణయానికి రావడం గమనార్హం.

ఉచిత వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యంతో దేశీయ టెలికం పరిశ్రమలోకి అడుగుపెట్టిన జియో.. మొత్తం టెలికం రంగ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఆ తర్వాత చౌక డేటాతో వినియోగదారులకు దగ్గరైంది. అయితే నిబంధనలకు అనుగుణంగా తామూ ధరలను పెంచాల్సి వస్తున్నదని ఇప్పుడు జియో అంటున్నది. గత నెల తమ కస్టమర్లపై ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీ (ఐయూసీ)లను జియో వేసిన విషయం తెలిసిందే.

జియో నెట్‌వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేస్తున్న సంగతీ విదితమే. ఇందుకోసం రెగ్యులర్ ప్యాకేజీలకు అదనంగా ఈ రూ.10 నుంచి వెయ్యి రూపాయల వరకు టాప్‌అప్‌లనూ ప్రవేశపెట్టింది.

కాగా, టెలికం రెగ్యులేటర్ ట్రాయ్.. టెలికం టారీఫ్‌ల్లో సవరణల కోసం సంప్రదింపుల ప్రక్రియను చేపట్టే వీలుందని జియో తెలిపింది. తమ వినియోగదారులకు అత్యుత్తమ, నాణ్యమైన సేవలను అందించడంలో ఎప్పటికీ రాజీపడబోమని ఈ సందర్భంగా జియో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి జియో కస్టమర్ల సంఖ్య 35.52 కోట్లుగా ఉన్నది.

2328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles