వన్ ప్లస్ 6 ఫోన్‌ను ఫొటోతోనూ అన్‌లాక్ చేయవచ్చు..!


Thu,May 31, 2018 02:33 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ దశాబ్ది కానుకగా విడుదల చేసిన తన ఐఫోన్ X స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్ ఐడీ ఫీచర్‌ను ఎంత పకడ్బందీగా అందిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇదే ఫీచర్‌ను పలు ఆండ్రాయిడ్ మొబైల్ తయారీ కంపెనీలు కూడా తమ తమ స్మార్ట్‌ఫోన్లలో యూజర్లకు అందిస్తున్నాయి. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో లభిస్తున్న ఫేస్ అన్‌లాక్ ఫీచర్ మాత్రం ఐఫోన్ X అంత సమర్థవంతంగా పనిచేయడం లేదు. ముఖ్యంగా యూజర్ ముఖాన్ని స్కాన్ చేసి లాక్‌గా సెట్ చేశాక, అదే యూజర్‌కు చెందిన ఫొటోతోనూ ఫోన్లను అన్‌లాక్ చేయడం సాధ్యమవుతున్నది. దీంతో ఈ విషయంలో ఆండ్రాయిడ్ ఫోన్ల సెక్యూరిటీ గురించిన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన వన్ ప్లస్ 6 ఫోన్‌లో ఇచ్చిన ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా పకడ్బందీగా లేదని తెలిసింది.

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్ ఇటీవలే వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ మధ్యే ఈ ఫోన్‌ను కొన్న ఓ వినియోగదారుడు తన ఫేస్‌తో ఫోన్‌కు లాక్ సెట్ చేశాక దాన్ని తన ఫొటోతోనూ అన్‌లాక్ చేశాడు. దీంతో ఇప్పుడీ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే మరోవైపు వన్ ప్లస్ 6 ఫోన్‌లో ఇలా ఫేస్ అన్‌లాక్ సెట్ చేసుకునేటప్పుడు సదరు ఫీచర్ అంత సురక్షితంగా ఉండదని కూడా వన్ ప్లస్ ఓ మెసేజ్ చూపిస్తుండడం గమనార్హం. మరి ఈ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌లో మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతారా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.


2021

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles