'న్యూయార్క్ చీజ్‌కేక్‌'గా ఆండ్రాయిడ్ ఎన్..?


Wed,March 16, 2016 05:19 PM

కప్‌కేక్, డోనట్, ఎక్లెయిర్, ఫ్రోయో, జింజర్ బ్రెడ్, హనీకోంబ్, ఐస్‌క్రీం శాండ్‌విచ్, జెల్లీబీన్, కిట్‌క్యాట్, లాలిపాప్, మార్ష్‌మాలో... ఇలా ఆకట్టుకునే తినుబండారాల పేరిట ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందిన వెర్షన్లు ఇప్పటి వరకు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. కాగా ప్రస్తుతం అధిక శాతం డివైస్‌లలో కిట్‌క్యాట్, లాలిపాప్ ఓఎస్‌లు నడుస్తుండగా, మార్ష్‌మాలో ఇంకా పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రాలేదు. అయితే ఇదిలా ఉండగానే గూగుల్ 'ఆండ్రాయిడ్ ఎన్' పేరిట తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను త్వరలో అందుబాటులోకి తేనుంది.

కాగా ఈ 'ఆండ్రాయిడ్ ఎన్' ఆపరేటింగ్ సిస్టమ్‌కు 'న్యూయార్క్ చీజ్‌కేక్' అనే పేరును పెట్టాలని ఎక్కువగా వినిపిస్తోంది. గూగుల్‌కు చెందిన ఉద్యోగులు కూడా ఈ పేరునే కావాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. అయితే ఈ సారి గూగుల్ మాత్రం కొన్ని పేర్లను యూజర్లకు అందుబాటులోకి ఉంచి వాటికి పోల్ నిర్వహించడం ద్వారా అధిక శాతం ఓట్లు వచ్చిన పేరును ఆండ్రాయిడ్ ఎన్‌కు పెట్టాలని నిశ్చయించింది. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ పేరిట ఓ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ప్రస్తుతం మనకు లభ్యం కావడం లేదు. కొన్ని ఎంపిక చేసిన దేశాల యూజర్లకు మాత్రమే ఇది లభిస్తోంది. కాగా ఇందులో ఇప్పటికే ఆండ్రాయిడ్ ఎన్ కోసం కొన్ని పేర్లను ఏర్పాటు చేశారు. వాటి నుంచి ఆయా దేశాల యూజర్ల ద్వారా పోల్స్‌ను స్వీకరిస్తున్నారు. త్వరలో మనకు కూడా ఈ యాప్ అందుబాటులోకి రానుంది.

అయితే ఇటీవల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఢిల్లీ యూనివర్సిటీ సందర్శన నేపథ్యంలో అక్కడి విద్యార్థులు ఆండ్రాయిడ్ ఎన్‌కు భారత్‌లోని ఏదైనా ప్రముఖ స్వీట్ పేరు పెట్టాలని కోరారు. కాగా అందుకు స్పందించిన పిచాయ్ తన తల్లి సలహా ప్రకారం ఏదైనా ఒక పేరును అడిగి తెలుసుకుని దాన్ని భారత్ వాసుల కోసం యూజర్ పోల్‌లో పెట్టేలా చేస్తానని, దానికి ఎక్కువగా ఓట్లు వస్తే ఆ పేరునే ఆండ్రాయిడ్ ఎన్‌కు ఖరారు చేస్తామని తెలియజేశారు. ఈ క్రమంలో 'ఆండ్రాయిడ్ ఎన్' పేరుకు తీవ్రమైన పోటీ నెలకొనగా మరో 3, 4 నెలల్లో దీన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఆ అదృష్టం ఏ స్వీట్‌ను వరిస్తుందో వేచి చూడాలి.

8693
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles