'ఫోన్' పోయిందా..? ఆ ఇంటికి వెళ్లండి..!


Wed,January 27, 2016 03:49 PM

అట్లాంటా (అమెరికా): 'నా స్మార్ట్‌ఫోన్‌ని మీరు దొంగిలించారు, మర్యాదగా ఇచ్చేయండి' అంటూ అమెరికాలోని అట్లాంటా శివారు ప్రాంతంలో ఉండే ఓ ఇంటి తలుపు తడుతున్నారు అక్కడి పలువురు స్మార్ట్‌ఫోన్ యూజర్లు. దొంగతనం లేదా ఇతర కారణాల వల్ల కోల్పోయిన తమ ఆండ్రాయిడ్, ఐఫోన్ స్మార్ట్‌ఫోన్లను తిరిగిచ్చేయాలంటూ ఆ ఇంటి వద్దకు ఇప్పుడు యూజర్లు ఎక్కువగా చేరుకుంటున్నారు. కానీ సదరు ఇంటి యజమానులు మాత్రం తాము ఏ ఫోన్‌ను దొంగిలించలేదని ఎంతగానో మొర పెట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే పలువురు స్మార్ట్‌ఫోన్ల యూజర్లు ఇచ్చిన కంప్లెయింట్లతో స్థానిక పోలీసులు కూడా వారి ఇంటిని నిత్యం సోదా చేస్తున్నారు. అయినప్పటికీ వారికి ఏ ఫోన్ అక్కడ దొరకడం లేదు. దీంతో అవాక్కవడం పోలీసుల వంతవుతోంది. సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే...

క్రిస్టినా లీ, మైకేల్ సాబాలు అమెరికాలోని అట్లాంటా శివారులో ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. సాబా ఇంజనీర్‌గా, లీ జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో అక్కడ ఆండ్రాయిడ్, ఐఫోన్ స్మార్ట్‌ఫోన్లను పోగొట్టుకున్న కొంతమంది బాధితులు ఫోన్ ట్రాకింగ్ చేయగా తమ డివైస్ లీ, సాబాల ఇంట్లో ఉందని తెలిసింది.

దీంతో వారు వేర్వేరు సమయాల్లో ఆ ఇంటికి వచ్చి 'మీరు మా ఫోన్లను దొంగిలించారు, వెంటనే ఇచ్చేయండి' అంటూ లీ, సాబాలను బెదిరించారు. తాము ఏ ఫోన్‌ను దొంగిలించలేదని చెప్పినా సదరు బాధితులు వినలేదు, సరికదా కొంత మంది పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి లీ, సాబాల ఇంటిని సోదాలు చేశారు. అయినప్పటికీ వారికి ఏ ఫోన్లు దొరకలేదు. దీంతో వారు చేసేది లేక వెనుదిరిగారు.
lost-phone-tracker
అయితే ఇది ఇంకా ముగియలేదని, ఇప్పటికీ కొంత మంది వారి ఫోన్ పోయిందంటూ తమ ఇంటికి వస్తున్నారని లీ, సాబాలు మీడియాకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయంపై పలువురు ఐటీ సెక్యూరిటీ నిపుణులను సంప్రదించగా 'ఫోన్ ట్రాకింగ్ అందులో ఉండే జీపీఎస్ టెక్నాలజీ, సెల్‌ఫోన్ నెట్‌వర్క్ టవర్‌ల ఆధారంగా పనిచేస్తుందని, ఒక వేళ ఇవి కచ్చితంగా పనిచేయకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయ'ని వారు చెప్పారు.

'ఒక్కోసారి దొంగిలించబడిన, హ్యాక్ చేయబడిన వైఫై రూటర్లను వాడినా ఇలాంటి సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంద'ని వారు సెలవిచ్చారు. ఏది ఏమైనా ఇప్పుడు లీ, సాబాలు మాత్రం తమకు ఎదురవుతున్న ఈ కొత్తరకం టెక్నాలజీ సమస్య ఎప్పుడు తొలగిపోతుందోనని ఆవేదన చెందుతున్నారు.

11485
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles