టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఆ రంగంలో ఎన్ని సంచనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు జియో కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎప్పటికప్పుడు నూతన ప్లాన్లు, ఆఫర్లను ప్రవేశపెడుతూ కస్టమర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. దీంతో ఇతర టెలికాం కంపెనీలు కూడా ధరలను తగ్గించక తప్పలేదు. ఇక త్వరలో బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ కంపెనీలకు కూడా షాకిచ్చేందుకు జియో సిద్ధమవుతున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ ఆ సంస్థ వార్షిక సమావేశంలో జియో గిగాఫైబర్‌పై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సేవలకు గాను ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు వచ్చిన నగరంలో ముందుగా జియో గిగాఫైబర్ సేవలను ప్రారంభించనున్నారు. ఇక సేవలకు గాను కనీస ప్లాన్ రూ.500 గా నిర్ణయించినట్లు తెలిసింది. జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్లను కేవలం ఆన్లైన్లోనే తీసుకోనున్నారట. అది కూడా జియో వెబ్సైట్ లేదా మై జియో యాప్‌లోనే ఈ రిజిస్ట్రేషన్లను చేసుకునేందుకు వీలు కల్పిస్తారని తెలిసింది. జియో ప్రారంభించనున్న గిగాఫైబర్ సేవల ప్లాన్లు ప్రస్తుతం లీకయ్యాయి. ఈ సేవలను పొందేందుకు వినియోగదారులు ముందుగా రూ.4500 డిపాజిట్ చెల్లించాలి. సేవలను వద్దు అనుకున్నప్పుడు ఈ డిపాజిట్‌ను తిరిగిచ్చేస్తారు. ఇక ఈ సేవలకు గాను కనీస ప్లాన్ రూ.500తో ఆరంభం కానున్నట్లు తెలిసింది. అలాగే గరిష్టంగా నెలకు రూ.5500 వరకు ప్లాన్‌ను అందివ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ ప్లాన్లలో కనీస ఇంటర్నెట్ స్పీడ్ 100 ఎంబీపీఎస్ ఉండనున్నట్లు తెలుస్తుండగా, గరిష్టంగ 1జీబీపీఎస్ వరకు స్పీడ్‌ను ఇస్తారని సమాచారం. గిగాఫైబర్ సేవలలో రూ.500, రూ.800, రూ.1000 ప్లాన్లలో నెలవారీ డేటా లిమిట్ కాకుండా రోజువారీ డేటా లిమిట్ ఉంటుందని తెలిసింది. రోజుకు 5జీబీ నుంచి 60 జీబీ డేటా లిమిట్‌తో బ్రాడ్‌బ్యాండ్‌ను ఇస్తారని సమాచారం. జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నప్పటికీ సేవలు మాత్రం నవంబర్లోనే అందుబాటులోకి రానున్నాయట. దీపావళి వరకు ఈ సేవలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక గిగాఫైబర్ ద్వారా లభించే రూటర్‌తో కస్టమర్లు ఓ వైపు ఇంటర్నెట్ను వాడుకుంటూనే మరోవైపు దాంతోపాటే లభించే సెట్ టాప్ బాక్స్ ద్వారా డీటీహెచ్ ప్రసారాలను వీక్షించేందుకు వీలు కలుగుతుంది.