జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్.. నెలకు 100 జీబీ డేటాతో 3 నెలలు ఫ్రీ..?


Wed,July 12, 2017 03:18 PM

రిలయన్స్ జియో తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నదనే విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, జామ్‌నగర్, సూరత్, వడోదరలలో ఇప్పటికే జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కాగా తాజాగా తెలిసిన సమాచారం ఏమిటంటే.. ఈ నెల 21వ తేదీన జరగనున్న రిలయన్స్ వార్షిక సమావేశంలో జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిసింది.

ఈ నెల 21న జరగనున్న రిలయన్స్ సమావేశంలో రూ.500 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసేందుకు అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం అదే రోజున జియో తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌కు చెందిన ఆఫర్ ప్లాన్ వివరాలు లీకయ్యాయి. దాని ప్రకారం జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ మొదటి 3 నెలలు ఉచితంగా అందుబాటులోకి రానుంది. నెలకు 100జీబీ చొప్పున యూజర్లకు డేటా ఉచితంగా లభిస్తుంది. 100 జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో వాడుకోవచ్చు. డేటా లిమిట్ దాటితే స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. ఇక ఇందుకోసం రూ.4500 వరకు సెక్యూరిటీ డిపాజిట్‌ను జియో వసూలు చేయవచ్చని తెలిసింది.
jio-fiber-broadband
కాగా ఇప్పటికే అహ్మదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, ముంబై, సూరత్, వడోదర, విశాఖపట్నం ప్రాంతాల్లో జియో అనధికారికంగా యూజర్ల నుంచి జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కోసం రిజిస్ట్రేషన్లను ఆహ్వానిస్తున్నట్టు కూడా తెలిసింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు తెలియాలంటే ఈ నెల 21వ తేదీన జరగనున్న రిలయన్స్ వార్షిక సమావేశం వరకు ఆగాల్సిందే..!

4334

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles