వ‌చ్చేసింది.. ఐఫోన్ X..! ఫుల్ ఫీచర్లివే..!


Wed,September 13, 2017 10:28 AM

ఐఫోన్ ప్రియులంతా ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నూతన మోడల్ ఐఫోన్ 10 (X) తాజాగా విడుదలైంది. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 10.30 గంటలకు యూఎస్‌ఏలోని కాలిఫోర్నియాలో యాపిల్ ప్రధాన కార్యాలయంలో స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో అట్టహాసంగా నిర్వహించిన ఈవెంట్‌లో ఐఫోన్ X ను ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ లాంఛనంగా ఆవిష్కరించారు. గతంలో వచ్చిన ఎన్నో మోడల్స్‌కు భిన్నంగా, అనేక మార్పులు చేర్పులతో యాపిల్ తన నూతన ఐఫోన్ X ను తీర్చిదిద్దింది. మొదటి ఐఫోన్ విడుదల చేసి 10 సంవత్సరాలు పూర్తయినందున అందుకు గుర్తుగా రోమన్ అంకె X (X అంటే 10) పేరిట ఐఫోన్ X ను యాపిల్ విడుదల చేసింది. కాగా ఇప్పటికే ఐఫోన్ X గురించిన అనేక విషయాలు, ముఖ్యంగా స్పెసిఫికేషన్లు, ఇమేజ్‌లు ఆన్‌లైన్‌లో లీకవ్వగా వాటన్నింటికీ చెక్ పెడుతూ యాపిల్ ఐఫోన్ Xను విడుదల చేసింది. ఈ క్రమంలోనే కొత్తగా వచ్చిన ఈ ఐఫోన్‌లో నూతనంగా చేసిన మార్పులు ఏమిటి..? ఈ ఫోన్‌లో ఇచ్చిన ఫీచర్లు ఎలా ఉన్నాయి..? అవి యూజర్లను ఏ విధంగా ఆకట్టుకుంటున్నాయి..? అనే విషయాలపై 'నమస్తే తెలంగాణ' ప్రత్యేక కథనం.

iphone-x

డిస్‌ప్లే...


నేటి తరుణంలో వస్తున్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్లలో బెజెల్ లెస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను మొబైల్ తయారీ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయి. శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్, నోట్ 8తోపాటు ఎల్‌జీ వంటి పలు ఇతర మొబైల్ తయారీ సంస్థలు కూడా ఇన్ఫినిటీ డిస్‌ప్లేను తమ తమ ఫోన్లలో ఏర్పాటు చేస్తున్నాయి. దీని వల్ల వీడియోలు, ఫొటోలను పెద్ద స్క్రీన్‌లో చూసిన భావన కలుగుతుంది. ఫోన్ ముందు భాగంలో బాడీ తక్కువగా, డిస్‌ప్లే ఎక్కువగా ఉండడం వల్ల ఫుల్ స్క్రీన్ మోడ్‌లో ఫోన్‌ను ఆపరేట్ చేసిన భావన కలుగుతుంది. ఈ క్రమంలోనే యాపిల్ కూడా ఇదే కోవలో తన ఐఫోన్ X లో బెజెల్ లెస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను ఏర్పాటు చేసింది. దీని సైజ్ 5.8 ఇంచ్ డిస్‌ప్లేగా ఉంది. ఇక స్క్రీన్ రిజల్యూషన్ 2436 x 1125 గా ఉంది. కాగా ఈ ఫోన్లో డిస్‌ప్లే టైప్‌ను కూడా మార్చారు. గతంలో వచ్చిన ఐఫోన్ మోడల్స్‌లో రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే ఇవ్వగా ఇప్పుడు అధునాతన ఓలెడ్ డిస్‌ప్లే టైప్‌ను ఐఫోన్ Xలో ఏర్పాటు చేశారు. దీంతో ఫోన్ తెర క్వాలిటీ చాలా పెరుగుతుంది. స్పష్టమైన క్రిస్టల్ క్లియర్ దృశ్యాలను వీక్షించేందుకు వీలు కలుగుతుంది. ఈ తరహా డిస్‌ప్లేలు శాంసంగ్‌కు చెందిన ఫోన్లతోపాటు పలు ఇతర ఫోన్లలోనూ లభిస్తున్నాయి. కాగా ఇప్పుడిదే డిస్‌ప్లే టైప్ ఐఫోన్ Xలో లభిస్తోంది. అదేవిధంగా ఈ ఫోన్ డిస్‌ప్లేకు స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్‌ను ఏర్పాటు చేవారు. దీంతో ఫోన్ తెరపై అంత సులభంగా గీతలు పడవు. అదేవిధంగా ఐఫోన్ Xలో గతంలో వచ్చిన ఐఫోన్ మోడల్స్‌లా 3డీ టచ్ డిస్‌ప్లే ఫీచర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

డిజైన్...


ఫోన్ ముందు భాగంలో పైన ఫ్రంట్ కెమెరా, స్పీకర్, మైక్‌లు ఉంటాయి. కింది భాగంలో హోమ్ బటన్‌ను పూర్తిగా తీసేశారు. ఇక వెనుక భాగంలో యథావిధిగా కెమెరా, దాంతోపాటు ఫ్లాష్, మైక్‌లను ఏర్పాటు చేశారు. అయితే ఐఫోన్ X వెనుక భాగంలో రెండు కెమెరాలను ఒకదాని కింద ఒకటి ఏర్పాటు చేశారు. గతంలో వచ్చిన ఐఫోన్ 7 ప్లస్ వెనుక భాగంలో ఇవే కెమెరాలను పక్క పక్కనే ఇవ్వగా ఐఫోన్ X లో మాత్రం ఈ తరహా డిజైన్‌ను మార్చి కెమెరాలను ఒక దాని కింద మరొకటి ఏర్పాటు చేయడం విశేషం.

iphone-x

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్...


ఐఫోన్ Xలో అధునాతన యాపిల్ ఎ11 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆరు కోర్లు (హెగ్జాకోర్) ఉన్నాయి. దీని వల్ల గతంలో వచ్చిన ఐఫోన్ మోడల్స్ కన్నా ఐఫోన్ X వేగంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇందులో ఎం11 మోషన్ కో ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 3 జీబీ ర్యామ్ ఉండగా, 64, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో దీన్ని యూజర్లకు అందిస్తున్నారు.

కెమెరాలు...


ఐఫోన్ X వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి f/1.8 అపర్చర్ సైజ్‌ను కలిగి ఉండడం వల్ల ఈ కెమెరాలతో తీసిన ఫొటోలు, వీడియోలు చాలా క్వాలిటీతో వస్తాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఫీచర్ ఉండడం వల్ల కుదుపులు ఉన్నప్పటికీ ఫొటోలు, వీడియోలు షేక్ అవకుండా వస్తాయి. 4కె అల్ట్రాహెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ను ఈ కెమెరాలు సపోర్ట్ చేస్తాయి. క్వాడ్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను కెమెరా పక్కనే ఇవ్వడం వల్ల తక్కువ కాంతిలోనూ నాణ్యమైన ఫొటోలను తీసుకోవచ్చు. ఇక ఐఫోన్ X ముందు భాగంలో 7 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమెరా ఉంది. f/2.2 అపర్చర్ సైజ్ ఉండడం వల్ల సెల్ఫీ ఫొటోలు నాణ్యంగా వస్తాయి. ఈ కెమెరాతో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న వీడియోలను కూడా రికార్డ్ చేసుకోవచ్చు.

ఐఓఎస్ 11...


ఐఫోన్ Xలో యాపిల్ సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 11ను అందిస్తున్నది. ఈ ఓఎస్‌ను యాపిల్ ఈ ఏడాది జూన్ 5న జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఐఓఎస్ 11కు చెందిన లేటెస్ట్ ప్రివ్యూ బీటా వెర్షన్‌ను ఈ నెల 6వ తేదీన విడుదల చేసింది. ఇదే వెర్షన్‌తో కూడిన ఐఓఎస్ 11ను ఐఫోన్ Xలో అందిస్తున్నారు. దీంట్లో గతంలో వచ్చిన ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కన్నా అనేక భిన్నమైన ఫీచర్లను ఇచ్చారు. డివైస్ సాఫ్ట్‌వేర్‌లో ఐకాన్లు, థీమ్స్, యాప్‌లను కొత్తగా డిజైన్ చేసి అందిస్తున్నారు. ఐఓఎస్ 11లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లను ఐఫోన్ Xలో యూజర్లు పొందవచ్చు.

4జీ, సింగిల్ సిమ్...


ఐఫోన్ Xలో 4జీ వీవోఎల్‌టీఈ సదుపాయాన్ని అందిస్తున్నారు. దీంతో ట్రూ 4జీని ఇందులో ఆపరేట్ చేసుకోవచ్చు. హెచ్‌డీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో సిమ్ దీంట్లో భేషుగ్గా పనిచేస్తుంది. కాకపోతే ఎప్పటిలా ఈ ఫోన్‌లో కేవలం సింగిల్ సిమ్ సదుపాయం మాత్రమే కల్పించారు. దీంతో కేవలం ఒకే సిమ్‌ను ఇందులో వేసుకునేందుకు వీలుంటుంది. ఐఫోన్ Xలో డ్యుయల్ సిమ్ ఫీచర్ వస్తుందని తొలుత అందరూ భావించారు. అయినప్పటికీ ఇందులో ఎప్పటిలాగే సింగిల్ సిమ్ ఫీచర్‌నే ఇచ్చారు. ఇక ప్రత్యేకంగా మెమొరీ కార్డును కూడా వేసుకునేందుకు వీలులేదు. ఇది కూడా ఐఫోన్‌లలో ఎప్పటి నుంచో అలాగే వస్తున్నది. ఇందులోనూ ఎలాంటి మార్పు లేదు.

వాటర్, డస్ట్ రెసిస్టెన్స్...


ఐఫోన్ Xలో ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఇచ్చారు. దీని వల్ల నీరు పడినా, దుమ్ము పడినా ఫోన్‌కు అంత సులభంగా ఏమీ కాదు. అది పాడవ్వదు. 1.5 మీటర్ల లోతులో సుమారు 30 నిమిషాల పాటు ఫోన్‌ను ఉంచినా అందులోకి నీరు చేరదు. దీంతో ఫోన్ నీటికి పాడైపోతుందనే బెంగ అక్కర్లేదు. వర్షం పడుతున్నా నిరభ్యంతరంగా ఫోన్‌ను వాడుకోవచ్చు.
iphone-x

యాపిల్ పే...


ఐఫోన్ Xలో యాపిల్ పే యాప్‌ను ఇచ్చారు. దీంతో వీసా, మాస్టర్‌కార్డు, అమెక్స్ కార్డు హోల్డర్లు కార్డ్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. సింపుల్‌గా కార్డులను యాపిల్ పేలో యాడ్ చేసుకుంటే చాలు, అవసరం ఉన్న చోట పీవోఎస్ టెర్మినల్ వద్ద యాపిల్ పేను ఓపెన్ చేసి, పేమెంట్ వివరాలను ఎంటర్ చేసి, పే బటన్‌ను నొక్కితే పేమెంట్ సులభంగా పూర్తవుతుంది.

ఫేస్ ఐడీ...


గతంలో వచ్చిన ఐఫోన్ మోడల్స్‌కు భిన్నంగా యాపిల్ తన ఐఫోన్ Xలో నూతనంగా ఫేస్ ఐడీ ఫీచర్‌ను ఏర్పాటు చేసింది. దీని సహాయంతో యూజర్లు డివైస్ ఫ్రంట్ కెమెరాను ఉపయోగించి ఫోన్‌ను లాక్, అన్‌లాక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాకు స్ట్రక్చర్డ్ లైట్ ట్రాన్స్‌మిటర్, స్ట్రక్చర్ లైట్ రిసీవర్, ఫ్లైట్/ప్రాక్సిమిటీ సెన్సార్‌లను జత చేశారు. దీని వల్ల ఫ్రంట్ కెమెరా యూజర్ కళ్లను స్కాన్ చేసి డివైస్‌ను లాక్, అన్‌లాక్ చేస్తుంది. అలాగే యాపిల్ పే ద్వారా పేమెంట్లకు, యాప్ స్టోర్‌లో యాప్ కొనుగోళ్లకు, యాప్ లాక్, అన్‌లాక్‌కు కూడా ఫేస్ ఐడీ సపోర్ట్ చేస్తుంది. అయితే ఫేస్ ఐడీ ఫీచర్ ఇచ్చిన కారణంగా ఐఫోన్ Xలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను పూర్తిగా తీసేశారు.

3డీ యానిమేషన్లు...


ఫోన్‌లో డిఫాల్ట్‌గా వచ్చే ఎమోజీలకు తోడు ఐఫోన్ X యూజర్లు కొత్తగా 3డీ యానిమేషన్లను ఎమోజీలుగా వాడుకోవచ్చు. ఈ 3డీ యానిమేషన్లను ఫోన్ క్రియేట్ చేస్తుంది. యూజర్‌కు చెందిన ముఖాన్ని ప్రత్యేకమైన యాప్‌తో స్కాన్ చేసుకున్న తరువాత ఆ యాప్ యూజర్ ముఖానికి అనుగుణంగా వివిధ రకాల ఆకారాలతో కూడిన 3డీ యానిమేషన్స్‌ను ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది. దీంతో ఆ యానిమేషన్స్‌ను యూజర్లు ఎమోజీలుగా వాడుకోవచ్చు.

iphone-x

బ్యాటరీ...


గతంలో వచ్చిన ఐఫోన్ మోడల్స్ కన్నా మరింత ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వచ్చేలా ఐఫోన్ Xను తీర్చిదిద్దారు. ఐఫోన్ 7 కన్నా 2 గంటల ఎక్కువ బ్యాకప్‌ను ఐఫోన్ X ఇస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. అందువల్ల కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ పూర్తవుతుంది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఐఫోన్ Xలో వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీంతో ఎలాంటి కేబుల్స్ లేకుండానే ఐఫోన్ Xను చార్జింగ్ చేసుకోవచ్చు.

కలర్స్, ధర...


ఐఫోన్ ఎక్స్ సిల్వర్, స్పేస్ గ్రే రంగుల్లో యూజర్లకు లభిస్తున్నది. అక్టోబర్ 27వ తేదీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు దేశాల్లో ఐఫోన్ X అందుబాటులోకి రానుంది. నవంబర్ 3వ తేదీ నుంచి అన్ని దేశాల్లోనూ విక్రయాలు ప్రారంభించనున్నారు. ఇక భారత్‌లో ఐఫోన్ X 64 జీబీ ధర రూ.89వేలుగా ఉంది. అదే 256 జీబీ వేరియెంట్ కావాలనుకుంటే రూ.1.02 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ప‌నిచేయ‌ని ఫేస్ ఐడీ...


ఐఫోన్ X విడుద‌ల సందర్భంగా అందులో ఉన్న ప‌లు ఫీచ‌ర్ల‌ను యాపిల్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ డ‌బ్ల్యూ షిల్ల‌ర్ డెమో ఇచ్చారు. అయితే ఫేస్ ఐడీ గురించి వివ‌రణ ఇస్తున్న స‌మ‌యంలో ఫేస్ ఐడీతో ఐఫోన్ X లాక్ ఓపెన్ కాలేదు. దీంతో ఆయ‌న కొంత ఇబ్బందిగా ఫీల‌య్యారు. అయితే చివ‌రకు అది ప‌నిచేయ‌క‌పోవ‌డంతో బ్యాక‌ప్ పాస్‌వ‌ర్డ్‌తో ఫోన్‌ను అన్‌లాక్ చేశారు.

6336

More News

VIRAL NEWS