ఐఫోన్ 8, 8 ప్లస్‌ల విడుదల.. పూర్తి ఫీచర్లివే..!


Wed,September 13, 2017 12:20 PM

యాపిల్ సంస్థ తన నూతన ఐఫోన్ మోడల్ ఐఫోన్ 10 (X) ను విడుదల చేసిన విషయం విదితమే. మొదటి ఐఫోన్ విడుదల చేసి 10 వసంతాలు పూర్తయినందున అందుకు గుర్తుగా ఐఫోన్ 10ను ప్రత్యేకమైన ఎడిషన్ రూపంలో యాపిల్ విడుదల చేసింది. అయితే దీంతోపాటు ఐఫోన్ 8, 8 ప్లస్‌లను కూడా యాపిల్ లాంచ్ చేసింది. వాటిలో ఉన్న ఫీచర్లపై 'నమస్తే తెలంగాణ' ప్రత్యేక కథనం.

డిస్‌ప్లే...


ఐపోన్ 8 లో 4.7 ఇంచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1334 x 750 పిక్సల్స్‌గా ఉంది. అదే ఐఫోన్ 8 ప్లస్‌లో అయితే 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్‌గా ఉంది. రెండు ఫోన్ల డిస్‌ప్లేలకు 3డీ టచ్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ డిస్‌ప్లేలకు అయాన్ స్ట్రెంగ్తెన్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఐఫోన్ 10లో మాదిరిగా ఓలెడ్ డిస్‌ప్లేను వీటిల్లో ఇవ్వలేదు. కేవలం రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లేనే వీటిల్లో అందిస్తున్నారు.

డిజైన్...


గతంలో వచ్చిన ఐఫోన్ 7, 7 ప్లస్ ల మాదిరిగానే ఐఫోన్ 8, 8 ప్లస్‌లను కూడా డిజైన్ చేశారు. అందులో పెద్దగా మార్పులు లేవు. ఐఫోన్ 7 ప్లస్‌లో లాగానే 8 ప్లస్‌లో వెనక భాగంలో రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇక రెండు ఫోన్ల బాడీలను నూతన తరహా గ్లాస్‌తో తయారు చేశారు. అల్యూమినియం ఉపయోగించడం వల్ల ఫోన్లకు ప్రీమియం క్వాలిటీ లుక్ వచ్చింది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్...


ఐఫోన్ 8, 8ప్లస్‌లలో అధునాతన యాపిల్ ఎ11 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆరు కోర్లు (హెగ్జాకోర్) ఉన్నాయి. దీని వల్ల గతంలో వచ్చిన ఐఫోన్ మోడల్స్ కన్నా ఐఫోన్ 8, 8ప్లస్‌లు వేగంగా పనిచేస్తాయి. అదేవిధంగా ఈ ఫోన్లలో ఎం11 మోషన్ కో ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఐఫోన్ 8 లో 2 జీబీ ర్యామ్ ఉండగా ఇది 64, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లభిస్తున్నది. అదే ఐఫోన్ 8 ప్లస్‌లో 3 జీబీ ర్యామ్ ఉండగా, ఇది కూడా 64, 256 జీబీ వేరియెంట్లలో లభిస్తున్నది.

iphone-8

కెమెరాలు...


ఐఫోన్ 8 వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. f/1.8 అపర్చర్ సైజ్ ఉండడం వల్ల ఈ కెమెరాతో తీసిన ఫొటోలు, వీడియోలు చాలా క్వాలిటీతో వస్తాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఫీచర్ ఉండడం వల్ల కుదుపులు ఉన్నప్పటికీ ఫొటోలు, వీడియోలు షేక్ అవకుండా వస్తాయి. 4కె అల్ట్రాహెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ను ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను కెమెరా పక్కనే ఇవ్వడం వల్ల తక్కువ కాంతిలోనూ నాణ్యమైన ఫొటోలను తీసుకోవచ్చు. ఇక ఐఫోన్ 8 ముందు భాగంలో 7 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమెరా ఉంది. f/2.2 అపర్చర్ సైజ్ ఉండడం వల్ల సెల్ఫీ ఫొటోలు నాణ్యంగా వస్తాయి. ఈ కెమెరాతో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న వీడియోలను కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అదే ఐఫోన్ 8 ప్లస్‌లో అయితే వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలను పక్క పక్కనే ఏర్పాటు చేశారు. వీటి అపర్చర్ సైజ్‌లు f/1.8, f/2.8 గా ఉండడం వల్ల ఫొటోలు, వీడియోలు క్వాలిటీతో వస్తాయి. ఐఫోన్ 8 బ్యాక్ కెమెరాకు ఉన్న ఫీచర్లు ఈ కెమెరాలకు కూడా ఉన్నాయి. ఐఫోన్ 8 ప్లస్ ముందు భాగంలో కూడా 7 మెగాపిక్సల్ సామర్థ్యం, f/2.2 అపర్చర్ సైజ్ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో కూడా నాణ్యమైన సెల్ఫీలను, ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.

ఐఓఎస్ 11...


ఐఫోన్ 8, 8 ప్లస్‌లలో యాపిల్ సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 11ను అందిస్తున్నది. ఈ ఓఎస్‌ను యాపిల్ ఈ ఏడాది జూన్ 5న జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఐఓఎస్ 11కు చెందిన లేటెస్ట్ ప్రివ్యూ బీటా వెర్షన్‌ను ఈ నెల 6వ తేదీన విడుదల చేసింది. ఇదే వెర్షన్‌తో కూడిన ఐఓఎస్ 11ను ఐఫోన్ 8, 8 ప్లస్‌లలో అందిస్తున్నారు. దీంట్లో గతంలో వచ్చిన ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కన్నా అనేక భిన్నమైన ఫీచర్లను ఇచ్చారు. డివైస్ సాఫ్ట్‌వేర్‌లో ఐకాన్లు, థీమ్స్, యాప్‌లను కొత్తగా డిజైన్ చేసి అందిస్తున్నారు. ఐఓఎస్ 11లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లను ఐఫోన్ 8, 8 ప్లస్‌లలో యూజర్లు పొందవచ్చు.

4జీ, సింగిల్ సిమ్...


ఐఫోన్ 8, 8 ప్లస్ రెండు కూడా 4జీ వీవోఎల్‌టీఈ సదుపాయాన్ని కలిగి ఉన్నాయి. దీంతో ట్రూ 4జీని వీటిలో ఆపరేట్ చేసుకోవచ్చు. హెచ్‌డీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో సిమ్ వీటిలో భేషుగ్గా పనిచేస్తుంది. కాకపోతే ఎప్పటిలా ఈ ఫోన్లలో కేవలం సింగిల్ సిమ్ సదుపాయం మాత్రమే కల్పించారు. దీంతో కేవలం ఒకే సిమ్‌ను వీటిలో వేసుకునేందుకు వీలుంటుంది. ఐఫోన్ 8, 8 ప్లస్‌లలో డ్యుయల్ సిమ్ ఫీచర్ వస్తుందని తొలుత అందరూ భావించారు. అయినప్పటికీ వీటిలో ఎప్పటిలాగే సింగిల్ సిమ్ ఫీచర్‌నే ఇచ్చారు. ఇక ప్రత్యేకంగా మెమొరీ కార్డును కూడా వేసుకునేందుకు వీలులేదు. ఇది కూడా ఐఫోన్‌లలో ఎప్పటి నుంచో అలాగే వస్తున్నది. ఇందులోనూ ఎలాంటి మార్పు లేదు.

వాటర్, డస్ట్ రెసిస్టెన్స్...


ఐఫోన్ 8, 8 ప్లస్ ఫోన్లలో ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఇచ్చారు. దీని వల్ల నీరు పడినా, దుమ్ము పడినా ఫోన్లకు అంత సులభంగా ఏమీ కాదు. అవి పాడవ్వవు. 1.5 మీటర్ల లోతులో సుమారు 30 నిమిషాల పాటు ఫోన్లను ఉంచినా వాటిలోకి నీరు చేరదు. దీంతో ఫోన్లు నీటికి పాడైపోతాయనే బెంగ అక్కర్లేదు. వర్షం పడుతున్నా నిరభ్యంతరంగా ఫోన్లను వాడుకోవచ్చు.

యాపిల్ పే...


రెండు ఫోన్లలోనూ యాపిల్ పే యాప్‌ను ఇచ్చారు. దీంతో వీసా, మాస్టర్‌కార్డు, అమెక్స్ కార్డు హోల్డర్లు కార్డ్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. సింపుల్‌గా కార్డులను యాపిల్ పేలో యాడ్ చేసుకుంటే చాలు, అవసరం ఉన్న చోట పీవోఎస్ టెర్మినల్ వద్ద యాపిల్ పేను ఓపెన్ చేసి, పేమెంట్ వివరాలను ఎంటర్ చేసి, పే బటన్‌ను నొక్కితే పేమెంట్ సులభంగా పూర్తవుతుంది.

iphone-8-plus

ఇతర ఫీచర్లు...


ఐఫోన్ 8, 8ప్లస్ రెండు ఫోన్లలోనూ డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారో మీటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ X లో మాదిరిగానే ఇందులో కూడా యూజర్ తన ముఖంతో 3డీ యానిమేషన్లను క్రియేట్ చేసుకుని వాటిని ఎమోజీలుగా సెట్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే గతంలో వచ్చిన ఐఫోన్ మోడల్స్‌లో లేని ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను ఐఫోన్ 8, 8ప్లస్ ఫోన్లలో ఏర్పాటు చేశారు. దీని వల్ల కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ పూర్తవుతుంది. అదేవిధంగా ఈ ఫోన్లలో వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీంతో ఎలాంటి కేబుల్స్ లేకుండానే ఫోన్లను చార్జింగ్ పెట్టుకోవచ్చు.

కలర్స్, ధర...


గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే రంగుల్లో ఐఫోన్ 8, 8 ప్లస్‌లు లభిస్తున్నాయి. ఐఫోన్ 8 భారత్‌లో రూ.64వేల ప్రారంభ ధరకు లభ్యం కానుండగా, ఐఫోన్ 8 ప్లస్ రూ.73వేల ప్రారంభ ధరకు లభ్యం కానుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అమెరికా సహా పలు దేశాల్లో ఈ రెండు మోడల్స్ అందుబాటులోకి రానుండగా, భారత్‌లో ఈ నెల 29వ తేదీ నుంచి ఐఫోన్ 8, 8ప్లస్‌లు లభించనున్నాయి.

3262

More News

VIRAL NEWS