హైద‌రాబాద్‌లో గూగుల్ అతి పెద్ద క్యాంప‌స్‌.. త్వ‌ర‌లో నిర్మాణం..!


Thu,February 21, 2019 02:55 PM

ఇప్ప‌టికే ఎన్నో పేరుగాంచిన అంత‌ర్జాతీయ కార్పొరేట్ సంస్థ‌ల‌కు నెల‌వైన హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో కార్పొరేట్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్యాలయం త్వ‌ర‌లో ఏర్పాటు కానుంది. ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ గూగుల్ త్వ‌ర‌లో న‌గ‌రంలోని గ‌చ్చిబౌలి నాన‌క్‌రాంగూడ ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో అతి పెద్ద క్యాంప‌స్‌ను ఏర్పాటు చేయ‌నుంది. అమెరికా బ‌య‌ట గూగుల్ నిర్మించ‌నున్న అతి పెద్ద కార్యాలయం ఇదే కావ‌డం విశేషం. ఇప్ప‌టికే ఈ కార్యాల‌య నిర్మాణానికి గాను అవ‌స‌ర‌మైన అనుమ‌తుల కోసం గూగుల్ ప్ర‌య‌త్నిస్తున్న‌ది. దీంతో త్వ‌ర‌లో ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో గూగుల్ మ‌రో క్యాంప‌స్ ఏర్పాటు కానుంది.

రూ.1వేయి కోట్లతో నిర్మాణం...


నాన‌క్‌రాంగూడ ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో గూగుల్ నిర్మించ‌నున్న క్యాంప‌స్ లో 13వేల మంది ఉద్యోగులు ప‌నిచేయ‌నున్నారు. మొత్తం 22 ఫ్లోర్ల‌తో భ‌వ‌నాన్ని ఒకే బ్లాక్‌గా నిర్మించ‌నున్నారు. రూ.1వేయి కోట్ల‌తో ఈ క్యాంప‌స్‌ను నిర్మించ‌నున్నారు. అందులో మూడు బేస్‌మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్ తోపాటు మొత్తం 22 అంత‌స్తులు ఉంటాయి. బేస్‌మెంట్ల‌ను పార్కింగ్ కోసం వినియోగించ‌నున్నారు. అలాగే భ‌వనానికి పూర్తిగా సోలార్ విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో మొత్తం కార్యాల‌యానికి 300 కిలోవాట్ల విద్యుత్ అవ‌స‌రం ఉంద‌ని తేల్చారు.

కేటీఆర్ చొరవ వ‌ల్లే...


హైద‌రాబాద్‌లో గూగుల్ కు ఇప్ప‌టికే కొండాపూర్ లో ఓ కార్యాల‌యం ఉంది. అందులో 7వేల మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. కాగా ఇప్పుడు నాన‌క్‌రాంగూడలో నిర్మించ‌నున్న క్యాంప‌స్ గూగుల్‌కు హైద‌రాబాద్‌లో రెండోది. ఈ నిర్మాణానికి 2015లోనే అంకురార్ప‌ణ జ‌రిగింది. అప్ప‌ట్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ అమెరికాకు వెళ్లిన‌ప్పుడు గూగుల్ తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగానే న‌గ‌రంలో గూగుల్ క్యాంప‌స్‌ను నిర్మించేందుకు 7.2 ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయించారు. ఈ క్ర‌మంలో గూగుల్ ఇప్పుడు ఆ స్థలంలోనే త‌న భారీ క్యాంప‌స్‌ను నిర్మించ‌నున్న‌ది.

రెండున్న‌ర ఏళ్ల‌లో పూర్తి కానున్న నిర్మాణం...


కాగా ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో గూగుల్ నిర్మించ‌నున్న త‌న కొత్త క్యాంప‌స్ కు గాను ఇప్ప‌టికే ప‌ర్యావ‌ర‌ణ శాఖ నుంచి అనుమ‌తులు అందాయి. గ‌తేడాది అక్టోబ‌ర్ లోనే గూగుల్ అనుమ‌తులు పొందింది. ఈ క్ర‌మంలోనే గూగుల్ నిర్మించ‌నున్న ఈ కార్యాల‌యం ఆ సంస్థ‌కు కంపెనీ-ఓన్డ్ క్యాంప‌స్ కానుంది. ప్ర‌స్తుతం కొండాపూర్ లో ఉన్న గూగుల్ క్యాంప‌స్ ఆ సంస్థ‌ది కాదు. దాన్ని లీజుకు తీసుకున్నారు. అందులో 7వేల మంది ప‌నిచేస్తున్నారు. కాగా భార‌త్‌లో గూగుల్‌కు మొత్తం 4 క్యాంప‌స్‌లు ఉన్నాయి. హైద‌రాబాద్‌తోపాటు బెంగుళూరు, ముంబై, గుర్గావ్‌ల‌లో గూగుల్ త‌న కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న‌ది. ఇక రాష్ట్ర ప్ర‌భుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం గూగుల్ త‌న ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ క్యాంప‌స్‌ను రెండున్న‌ర ఏళ్ల‌లో పూర్తి చేయ‌నుంది. కాగా ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని టాప్ 5 కంపెనీలైన అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్, యాపిల్‌లు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో గూగుల్ నిర్మించ‌నున్న కొత్త క్యాంప‌స్ న‌గ‌రానికి మ‌రో అలంక‌ర‌ణ కానుంది..!

26846

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles