రూ.20కే 1జీబీ డేటా..!


Mon,November 20, 2017 06:45 PM

టెలికాం రంగంలోకి సంచలనంలా దూసుకువచ్చింది జియో. ఈ క్రమంలోనే అతి తక్కువ ధరలకు తన సేవలను వినియోగదారులకు అందిస్తున్నది. అనేక ఆఫర్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నది. అయితే జియో ప్రస్తుతం 1 జీబీ డేటా ప్యాక్‌కు వసూలు చేస్తున్న చార్జి రూ.52గా ఉందని తెలిసిందే. కానీ ఇంతకన్నా తక్కువగా.. అంటే.. కేవలం రూ.20కే అక్కడ 1జీబీ హై స్పీడ్ మొబైల్ డేటా లభిస్తున్నది. షాకింగ్‌గా ఉందా..! ఇది నిజమే..!

బెంగుళూరులో 'వైఫై డబ్బా' అనే స్టార్టప్ కంపెనీ అతి తక్కువ ధరకే వినియోగదారులకు ఇంటర్నెట్‌ను అందిస్తున్నది. రూ.2కు 100 ఎంబీ, రూ.10కి 500 ఎంబీ, రూ.20కి 1 జీబీ డేటా లభిస్తుంది. వీటి వాలిడిటీ 24 గంటలు. అయితే ఈ డేటాను ఉపయోగించుకోవాలంటే స్థానికంగా టీస్టాల్స్, కిరాణా షాపులు, పాన్ డబ్బాలు, ఇతర షాపుల్లో వైఫై డబ్బా ప్రీ పెయిడ్ టోకెన్లు లభిస్తాయి. వాటిని కొన్నాక వైఫై డబ్బా హాట్ స్పాట్ ఉన్న ప్రాంతంలో ఫోన్ ద్వారా వైఫైకు కనెక్ట్ అవ్వాలి. ఈ క్రమంలో ఫోన్‌లో ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఓపెన్ చేస్తే సదరు వైపై డబ్బా లాగిన్ పేజీ వస్తుంది. అందులో వినియోగదారుడు తన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలి. అది పూర్తయ్యాక తాను కొన్న ప్రీపెయిడ్ టోకెన్‌లో ఉన్న కోడ్‌ను వెబ్ పేజీలో ఎంటర్ చేసి లాగిన్ అయితే చాలు, 24 గంటల పాటు మొబైల్ డేటా వాడుకోవచ్చు.
Shubhendu-Karam
వైఫై డబ్బా స్టార్టప్ కంపెనీని శుభేందు శర్మ, కరం లక్ష్మణ్ అనే ఇద్దరు వ్యక్తులు 13 నెలల కిందట బెంగుళూరులో ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ నగరంలో అనేక ప్రాంతాల్లో వారు వైఫై డబ్బా పేరిట తమ కంపెనీకి చెందిన వైఫై రూటర్లను ఏర్పాటు చేశారు. అవి ఇప్పుడు 350 వరకు చేరుకున్నాయి. త్వరలో మిగిలిన ప్రాంతాల్లోనూ వైఫై డబ్బాలు (రూటర్లు) ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా యూజర్ వైఫైకు కనెక్ట్ అయితే గరిష్టంగా 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ పొందవచ్చు. పూర్తిగా ఫైబర్ ఆప్టికల్ నెట్‌వర్క్‌తో వైఫై డబ్బాలు పనిచేస్తాయి.

11246

More News

VIRAL NEWS