డెబిట్, క్రెడిట్ కార్డులను ఇంటర్నేషనల్‌గా వాడుతున్నారా..? వెంటనే డిజేబుల్ చేయండి..!


Tue,July 9, 2019 02:31 PM

సైబర్ నేరాల పట్ల వినియోగదారులు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ కేటుగాళ్లు నూతన పంథాలో డబ్బులు కాజేస్తున్నారు. వినియోగదారులకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్‌బ్యాంకింగ్ వివరాలను సంపాదించి పెద్ద ఎత్తున సొమ్మును ఆన్‌లైన్‌లో దోపిడీ చేస్తున్నారు. మరోవైపు వినియోగదారుల డబ్బుకు రక్షణ కల్పించాల్సిన బ్యాంకులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోతున్నది.

ప్రస్తుతం ప్రజలు ఆన్‌లైన్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా నిత్యం ఎన్ని లావాదేవీలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఆయా మాధ్యమాలకు చెందిన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు చాలా సులభంగా పొందగలుగుతున్నారు. బ్యాంకులు కస్టమర్ల అకౌంట్లకు కల్పించే సెక్యూరిటీ వలయాన్ని ఛేదించి ఆ కేటుగాళ్లు ఆయా అకౌంట్ల వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం ఆ వివరాలతో సొమ్ము కాజేస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న చాలా వరకు సైబర్ నేరాలలో అంతర్జాతీయంగా జరుగుతున్నవే ఎక్కువ ఉంటున్నాయి.

సాధారణంగా మన దేశంలో డెబిట్, క్రెడిట్ కార్డులను ఇష్యూ చేసే బ్యాంకులు వాటిని అంతర్జాతీయంగా వాడుకునేందుకు వీలు లేకుండా ముందుగానే బ్లాక్ చేసి కస్టమర్లకు అందిస్తుంటాయి. ఈ క్రమంలో కస్టమర్లు వాటిని అంతర్జాతీయ సైట్లు, విదేశాల్లో వాడుకునేందుకు సంబంధిత కార్డుకు చెందిన బ్యాంకింగ్ యాప్ లేదా సైట్‌లో ఇంటర్నేషనల్ యూసేజ్ కోసం అన్‌బ్లాక్ చేసుకోవాలి. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. కస్టమర్లకు చెందిన కార్డుల వివరాలను సేకరించే కేటుగాళ్లు వారికి తెలియకుండానే ఆయా కార్డులను అంతర్జాతీయ యూసేజ్ కోసం వాటిని ఎనేబుల్ చేస్తున్నారు. అనంతరం కార్డులను యథేచ్ఛగా వాడుతున్నారు. ఈ క్రమంలో కార్డు ఇంటర్నేషనల్ యూసేజ్ కోసం యాక్టివేట్ అయిందీ, ఆ తరువాత దాంతో జరిగిన లావాదేవీల వివరాలకు చెందిన ఎస్‌ఎంఎస్‌లు, మెయిల్స్ కూడా కస్టమర్లకు రావడం లేదు. దీంతో తమ కార్డులో ఫ్రాడ్ జరిగిందని కస్టమర్లు తెలుసుకోవడం ఆలస్యం అవుతోంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతోంది.

అంతర్జాతీయంగా డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన మోసాలు జరిగినప్పుడు బాధితులైన కస్టమర్లు సంబంధిత బ్యాంకులకు ఫోన్ చేస్తే బ్యాంకులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాయని పలువురు కస్టమర్లు ఆరోపిస్తున్నారు. తమ కార్డులో ఫ్రాడ్ జరిగిందని, కార్డు బ్లాక్ చేయాలని కోరుతూ, కార్డులో చీటింగ్ అయిన మొత్తాన్ని రీఫండ్ ఇవ్వాలని అడుగుతుంటే.. బ్యాంకుల ప్రతినిధులు కస్టమర్లకు సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఫ్రాడ్ అయిన సొమ్మును రీఫండ్ పొందడం కస్టమర్లకు సవాల్‌గా మారుతోంది. ఇక కొన్ని బ్యాంకులు రీఫండ్ ఇచ్చేందుకు 45 నుంచి 60 రోజుల వరకు గడువు విధిస్తున్నాయని, దీంతో కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించడం కష్టతరమవుతోందని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నేషనల్ యూసేజ్ డిజేబుల్ చేసుకోవడం ఉత్తమం...


డెబిట్, కార్డులకు సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున సైబర్ నేరాలు జరుగుతుండడంతో ఆయా కార్డులను ఉపయోగించే కస్టమర్లు వాటిని కేవలం దేశీయంగా మాత్రమే వాడుకునేలా ఆప్షన్స్ ఎంచుకోవాలని ఐటీ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ యూసేజ్ కోసం కార్డులను ఎనేబుల్ చేసుకోకూడదని, వాటిని ఎప్పుడూ డిజేబుల్ చేసి ఉంచడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. అలాగే కార్డులకు సంబంధించిన సమాచారాన్ని ఇతరులకు ఇవ్వరాదని కూడా హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు కార్డు ఏదైనా సరే.. దాన్ని ఆన్‌లైన్‌లో ఏదైనా వెబ్‌సైట్‌లో వాడే ముందు ఆ సైట్ అసలుదా, నకిలీదా అన్న విషయాన్ని కూడా పరిశీలించాలని, లేకపోతే అనవసరంగా డబ్బు నష్టపోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.

3052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles