బీఎస్‌ఎన్‌ఎల్‌లో 35వేల ఉద్యోగాల కోత..?


Tue,February 12, 2019 07:39 PM

ముంబై: రిలయన్స్ జియో అరంగేట్రంతో భారత టెలికాం మార్కెట్లో భారీ కుదుపు. జియో రాకకు ముందే తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్.. ప్రైవేట్ టెలికాం సంస్థల నుంచి పోటీని తట్టుకొని నిలబడటంలో ఘోరంగా విఫలమైంది. రోజురోజుకీ సంస్థ నష్టాలు పెరిగిపోతుండటంతో నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఇక స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం ద్వారా ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రస్తుతం 1.8లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో కంపెనీ వార్షిక వ్యయాలు రూ.15వేల కోట్లకు చేరాయి.

ఉద్యోగులకు సంబంధించిన కొన్ని బెనిఫిట్స్‌ను కూడా కంపెనీ నిలిపివేసింది. ఎలక్ట్రిసిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు తగ్గించడం, రూ.5వేల కోట్ల‌ను ఆదా చేసేందుకు సంస్థ ఉద్యోగుల బెనిఫిట్స్‌ను స్తంభింపజేయడం ద్వారా ఖర్చులు తగ్గించుకుంటున్నాం. అలాగే ఎల్‌టీసీ(ప్ర‌యాణ భ‌త్యం (లీవ్ ట్రావెల్ అల‌వెన్స్‌), మెడికల్ ఖర్చులపై కూడా నియంత్రణలు అమలు చేశాం. అని బీఎస్‌ఎన్‌ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.

సంస్థ మనుగడలో ఉండాలంటే ఐఐఎం అహ్మదాబాద్ ఒక నివేదిక కూడా తయారు చేసింది. ప్రాథమిక నివేదికలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 35వేల మంది ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలు చేయనున్నట్లు తెలిసింది. దీని కోసం రూ.13వేల కోట్లు అవసరం అవుతాయని సంస్థ అంచనా వేస్తోంది. ప్రిలిమినరీ రిపోర్ట్‌ను సమర్పించగా.. ఫైనల్ రిపోర్టును త్వరలోనే సమర్పించనున్నారు. వీఆర్‌ఎస్ ప్యాకేజ్‌ను అమలు చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను బీఎస్‌ఎన్‌ఎల్ పరిశీలిస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రభుత్వ మద్దతుతో గానీ, రుణం ద్వారా గానీ సమస్యను పరిష్కరించనున్నట్లు వివరించారు.

ట్రాయ్ వద్ద ఉన్న డేటా ప్రకారం.. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బీఎస్‌ఎన్‌ఎల్ రెవెన్యూ మార్కెట్ కేవలం రూ.1,284 కోట్లు మాత్రమేనని వెల్లడైంది. అదే సమయంలో ఇదే క్వార్టర్‌లో జియో రూ.8271 కోట్లు.. వొడాఫోన్ ఐడియా రూ.7528కోట్లు.. భారతీ ఎయిర్‌టెల్ రూ.6720కోట్లుగా సంస్థల రెవెన్యూ ఉంద‌ని తేలింది.

కొంతమంది ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అనుపమ్ కూడా ఘాటుగా స్పందించారు. బీఎస్ఎన్ఎల్‌లో కొనసాగాలంటే సంస్థ లాభాలు ఆర్జించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. సంస్థ లాభాల్లో ఉన్నప్పుడే ఉద్యోగులకు అన్ని రకాల బెనిఫిట్స్ అందజేయగలుగుతామని ఆయన చెప్పారు. వీఆర్‌ఎస్‌పై కూడా చర్చించాం.. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం. దీంతో ఉద్యోగులు సంస్థను వీడాల్సి ఉంటుంది. 1.75 లక్షల మంది ఉద్యోగులతో పాటు సంస్థ ఆపరేషన్స్ కొనసాగాలంటే ఏడాదికి బీఎస్‌ఎన్‌ఎల్ 15వేల కోట్లు అవసరం అవుతాయని ఒక సీనియర్ అధికారి వివరించారు.

ప్రైవేట్ టెలికాం సంస్థల్లో 25వేల నుంచి 30వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉంటే.. వాటికి ఐదు రెట్ల మంది ఉద్యోగులు బీఎస్‌ఎన్‌ఎల్( 2018 వరకు 1,74,000 ఎంప్లాయిస్)లో పనిచేస్తున్నారు. మిగ‌తా ఆప‌రేట‌ర్లు వొడాఫోన్ ఐడియా, భార‌తీ ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి.

7878

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles