ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు చుక్కలు చూపించనున్న యాపిల్..?


Sat,August 10, 2019 02:55 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన ప్రొడక్ట్‌లను వాడే కస్టమర్లకు ఎంతటి పటిష్టమైన సెక్యూరిటీ, ప్రైవసీలను కల్పిస్తుందో అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ కన్నా మెరుగైన సెక్యూరిటీ, ప్రైవసీ సదుపాయాలు యాపిల్ ప్రొడక్ట్స్‌లో వినియోగదారులకు లభిస్తాయి. ముఖ్యంగా వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత డేటాను కాపాడే విషయమై యాపిల్ పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. తాను డెవలప్ చేసే యాప్స్ మాత్రమే కాదు, ఇతర థర్డ్‌పార్టీ కంపెనీలు డెవలప్ చేసే యాప్స్‌పై కూడా యాపిల్ నియంత్రణ కలిగి ఉంటుంది. వినియోగదారుల డేటా చోరీకి, హ్యాకింగ్‌కు గురికాకుండా చూస్తుంటుంది. అయితే ఇకపై యాపిల్ ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనుందట. దీంతో ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు వినియోగదారుల డేటా సేకరించడం విషయమై మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లలో అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ వాయిస్ కాల్ సదుపాయంతోపాటు ఆయా యాప్స్‌కు చెందిన సేవలను వాడుకునే సమయంలో ఆ యాప్స్.. యూజర్లకు చెందిన డేటాను బ్యాక్‌గ్రౌండ్‌లో సేకరిస్తుంటాయి. ఇందుకు గాను ఈ రెండు యాప్స్ ఇప్పటి వరకు ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై యాపిల్‌కు చెందిన ప్రత్యేకమైన డెవలపర్ టూల్ సహాయంతో వినియోగదారులకు చెందిన డేటాను ఆయా సమయాల్లో సేక‌రిస్తూ వ‌స్తున్నాయి. అయితే ఇకపై ఫేస్‌బుక్, వాట్సాప్ మెసెంజర్‌లకు ఈ వెసులుబాటు ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే.. త్వరలో యాపిల్ విడుదల చేయనున్న ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లో యూజర్ల డేటాకు మరింత ప్రైవసీని అందించే విషయమై యాపిల్ కఠినమైన నిర్ణయం తీసుకుందట.

యాపిల్ తీసుకోబోతున్న ఈ నిర్ణయం నిజమైతే గనక ఇకపై ఐఫోన్లు, ఐప్యాడ్లలో మరింత గోప్యంగా యూజర్లు వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్ సేవలను ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుంది. అయితే ఇదే నిర్ణయం ఆ యాప్‌లకు అశనిపాతంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ యాప్‌లు రెండూ ఫేస్‌బుక్‌కు చెందినవే కనుక.. ఆ సంస్థ పెద్ద ఎత్తున డేటా సేకరించి దాన్ని యాడ్స్‌కు, ఇతర అవసరాలకు వినియోగిస్తుంది కనుక.. యాపిల్ నిర్ణయం ఫేస్‌బుక్‌కు సంకటంగా మారే అవకాశం ఉంటుంది. ఇక వచ్చే నెలలోనే యాపిల్ ఐఓఎస్ 13ను విడుదల చేస్తుందని తెలుస్తుండగా.. అప్పటి వరకు ఆగితేగానీ ఈ విషయంపై స్పష్టత రాదు..!

3113
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles