యాపిల్ వాచ్ 3, టీవీ 4కె విడుద‌ల‌


Wed,September 13, 2017 02:13 PM

యాపిల్ సంస్థ నిన్న కాలిఫోర్నియాలో జ‌రిగిన ప్ర‌త్యేక ఈవెంట్‌లో ఐఫోన్ 8, 8 ప్ల‌స్‌, ఐఫోన్ X కొత్త ఫోన్ల‌తోపాటు యాపిల్ వాచ్ సిరీస్ 3 స్మార్ట్‌వాచ్‌ను, యాపిల్ టీవీ 4కె డివైస్‌ని కూడా విడుద‌ల చేసింది. ఈ డివైస్‌ల‌లో ఉన్న ప్రధాన ఫీచ‌ర్లు, వాటి ధ‌ర‌, ఇత‌ర వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్ వాచ్ సిరీస్ 3...


గ‌తంలో వ‌చ్చిన యాపిల్ వాచ్‌ల క‌న్నా ఈ యాపిల్ వాచ్ 3ని నూత‌నంగా డిజైన్ చేశారు. ఇందులో సెల్యులార్ క‌నెక్టివిటీ ఆప్ష‌న్ ఇచ్చారు. అందువ‌ల్ల వాచ్ స‌హాయంతో ఏకంగా కాల్స్ చేసుకోవ‌చ్చు, కాల్స్ రిసీవ్ చేసుకోవ‌చ్చు. మెసేజ్‌ల‌ను కూడా పంపుకోవ‌చ్చు. ఇక ఈ వాచ్‌ను రెండు మోడ‌ల్స్‌లో అందిస్తున్నారు. ఒక దాంట్లో జీపీఎస్ మాత్ర‌మే ఉంటుంది. రెండో మోడ‌ల్ వాచ్‌లో జీపీఎస్‌తోపాటు సెల్యుల‌ర్ క‌నెక్టివిటీ కూడా ఉంటుంది. అదేవిధంగా వాచ్ లో ఏర్పాటు చేసిన నూత‌న ప్రాసెస‌ర్ వ‌ల్ల పాత వాచ్ ల క‌న్నా ఈ కొత్త వాచ్ 70 శాతం ఎక్కువ వేగంగా ప‌నిచేస్తుంది.

యాపిల్ వాచ్ 3లో డిజిట‌ల్ అసిస్టెంట్ సిరిని మ‌రింత స్మార్ట్‌గా తీర్చిదిద్దారు. ఈ అసిస్టెంట్ యూజ‌ర్‌తో మాట్లాడుతుంది. ఇందులో డ‌బ్ల్యూ 2 వైర్‌లెస్ చిప్‌ను ఏర్పాటు చేశారు. దీంతో గ‌తంలో వ‌చ్చిన వాచ్ ల క‌న్నా 85 శాతం ఎక్కువ వేగంగా వైఫై ఆప‌రేట్ అవుతుంది. బ్లూటూత్ 50 శాతం అధిక వేగంతో ప‌నిచేస్తుంది. యాపిల్ వాచ్ 3 వాచ్ ఓఎస్ 4 వెర్ష‌న్ ఆధారంగా ప‌నిచేస్తుంది. దీంతో హార్ట్ రేట్‌, వ‌ర్క‌వుట్‌, స్లీప్ వంటి యాక్టివిటీల‌ను మ‌రింత సుల‌భంగా ట్రాక్ చేసుకోవ‌చ్చు. ఈ వాచ్ 18 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్ ఇస్తుంది. యాపిల్ వాచ్ 3 సెప్టెంబ‌ర్ 22వ తేదీన అమెరికా స‌హా ప‌లు ఇత‌ర దేశాల్లో ల‌భ్యం కానుంది. భార‌త్‌లో ఈ నెల 29వ తేదీ నుంచి ఈ వాచ్ రూ.29,900 ధ‌ర‌కు ల‌భించ‌నుంది.

Apple-TV-4K

యాపిల్ టీవీ 4కె...


యాపిల్ విడుద‌ల చేసిన 4కె టీవీ డివైస్‌తో హై డెఫినిష‌న్ వీడియోల‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీక్షించ‌వ‌చ్చు. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో త‌దిత‌ర యాప్‌ల‌ను ఈ డివైస్‌లో ఓపెన్ చేసి టీవీ ద్వారా 4కె వీడియోల‌ను చూడ‌వ‌చ్చు. హెచ్‌డీఆర్ 10, డాల్బీ విజ‌న్ ఫీచ‌ర్లు ఈ డివైస్‌లో ఉన్నాయి. గ‌తంలో విడుద‌లైన యాపిల్ టీవీ డివైస్‌ల క‌న్నా దీని ద్వారా దృశ్యాలు మ‌రింత స్ప‌ష్టంగా, నాణ్యంగా క‌నిపిస్తాయి. యాపిల్ 4కె టీవీలో ఎ10ఎక్స్ ఫ్యుష‌న్ చిప్‌ను ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల 4కె అల్ట్రా హెచ్‌డీ వీడియోల‌ను సుల‌భంగా వీక్షించ‌వ‌చ్చు. యాపిల్ టీవీ 4కె డివైస్ ఈ నెల 22వ తేదీ నుంచి అమెరికాలో ల‌భించ‌నుంది. భార‌త్ లో ఈ నెల 29వ తేదీ నుంచి ఈ డివైస్ ల‌భ్యం కానుంది. 32, 64 జీబీ వేరియెంట్ల‌లో విడుద‌లైన యాపిల్ టీవీ 4కె భార‌త్‌లో రూ.15,900, రూ.17,900 ధ‌ర‌ల‌కు ల‌భ్యం కానున్న‌ది.

2400

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles