ఇకపై ఐఫోన్లలోనూ డ్యుయల్ సిమ్ ఫీచర్..?


Wed,August 1, 2018 11:38 AM

ఐఫోన్ ప్రియులకు శుభవార్త. ఇకపై వాటిల్లోనూ డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను అందివ్వనున్నట్లు తెలిసింది. ఇదే విషయమై యాపిల్ ఇప్పటికే ప్రయోగాలు చేస్తున్నది. త్వరలో రానున్న ఐఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తోపాటు ఈ ఫీచర్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం. త్వరలో నూతనంగా విడుదల కానున్న ఐఫోన్లలో డ్యుయల్ సిమ్ ఫీచర్ ఉండవచ్చని తెలిసింది.

యాపిల్ సంస్థ ఐఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రస్తుతం ప్రయోగాత్మంగా పరిశీలిస్తున్నదనే విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆ ఓఎస్‌కు చెందిన బీటా5 అప్‌డేట్‌లో డ్యుయల్ సిమ్ ఫీచర్ గురించిన వివరాలు ఉన్నాయి. దీన్ని బట్టి త్వరలో విడుదల కానున్న ఐఫోన్లలో ఐఓఎస్12తోపాటు డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను కూడా అందించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

నిజానికి యాపిల్ తన ఐఫోన్లలో డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను ఎప్పటి నుంచో అందించాలని చూస్తున్నట్లు తెలిసింది. ఐఫోన్లలో సింగిల్ సిమ్ ఉండడం వల్ల యూరప్, ఆసియా మార్కెట్లలో మరింత మంది కస్టమర్లను ఆకర్షించడం కష్టంగా మారిందని యాపిల్ భావిస్తున్నది. ఆయా మార్కెట్‌లలో డ్యుయల్ సిమ్ ఉన్న ఫోన్లకు విపరీతమైన ఆదరణ ఉంది. అందుకనే ఆ ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను ఐఫోన్లలో తీసుకు రావాలని యాపిల్ భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ప్రస్తుతం డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను అంతర్గతంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

2074

More News

VIRAL NEWS