వాచ్ సిరీస్ 5, 7వ జనరేషన్ ఐప్యాడ్‌ను లాంచ్ చేసిన ఆపిల్..!


Wed,September 11, 2019 12:30 PM

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ నిన్నటి తన ఈవెంట్‌లో నూతన ఐఫోన్లను మాత్రమే కాకుండా వాచ్ సిరీస్ 5 నూతన స్మార్ట్‌వాచ్‌ను కూడా లాంచ్ చేసింది. ఇందులో ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్‌ప్లే, బిల్టిన్ కంపాస్, ఎమర్జెన్సీ కాలింగ్, వాచ్ ఓఎస్ 6, 18 గంటల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ఈ వాచ్‌కు చెందిన జీపీఎస్ వేరియెంట్ ధర రూ.40,900 ఉండగా, జీపీఎస్+సెల్యులార్ వేరియెంట్ ధర రూ.49,900 గా ఉంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ రెండు వేరియెంట్లను విక్రయించనున్నారు.


అలాగే ఆపిల్ తన ఈవెంట్‌లో 7వ జనరేషన్ నూతన ఐప్యాడ్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో 10.2 ఇంచుల డిస్‌ప్లే, ఆపిల్ ఎ10 ఫ్యుషన్ ప్రాసెసర్, 32, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు, ఐఓఎస్ 13, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 1.2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ (ఆప్షనల్), టచ్ ఐడీ, 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. కాగా ఈ ఐప్యాడ్‌కు చెందిన వైఫై మోడల్ ప్రారంభ ధర రూ.29,900 ఉండగా, వైఫై+సెల్యులార్ మోడల్ ప్రారంభ ధర రూ.40,900 గా ఉంది. సెప్టెంబర్ 30వ తేదీ తరువాత ఈ ఐప్యాడ్‌ను విక్రయించనున్నారు.

ఇక ఆపిల్ ఆర్కేడ్ పేరిట ఓ నూతన గేమ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను కూడా ఆపిల్ లాంచ్ చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సర్వీస్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. దీంతో ఐఫోన్, ఐప్యాడ్, మాక్, యాపిల్ టీవీ వినియోగదారులు ఒక్కో గేమ్‌ను విడివిడిగా కొనుగోలు చేసి ఆడాల్సిన అవసరం ఉండదు. నెలకు రూ.99 చెల్లిస్తే చాలు, ఏ పెయిడ్ గేమ్‌నైనా ఆడుకోవచ్చు. అలాగే మరో రూ.99 చెల్లిస్తే ఆపిల్ టీవీ ప్లస్ వీడియో స్ట్రీమింగ్ యాప్ సబ్‌స్క్రిప్షన్ ఆపిల్ వినియోగదారులకు లభిస్తుంది. దీంతో ఆ యాప్‌లో ఉండే వీడియోలు, టీవీ షోలు, మూవీలను వినియోగదారులు వీక్షించవచ్చు. అయితే కొత్త ఐఫోన్లను కొన్నవారికి ఏడాదిపాటు ఆపిల్ టీవీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఇక ఈ సర్వీస్ నవంబర్ 1 నుంచి వినియోగదారులకు లభిస్తుంది.


ఇక చివరిగా ఆపిల్ తన నూతన ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 13ను సెప్టెంబర్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఆ రోజు నూతన ఐఓఎస్‌ను ఐఫోన్ వినియోగదారులు తమ తమ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఐఫోన్ 6ఎస్ ఆ తరువాత వచ్చిన ఐఫోన్లలో ఈ కొత్త ఐఓఎస్ ఇన్‌స్టాల్ అవుతుంది. అనంతరం సెప్టెంబర్ 30వ తేదీన మరిన్ని సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో ఐఓఎస్ 13.1ను విడుదల చేయనున్నారు. అలాగే ఐప్యాడ్ ఎయిర్ 2 ఆ తరువాత డివైస్‌లు, అన్ని ఐప్యాడ్ ప్రొ మోడల్స్, ఐప్యాడ్ 5వ జనరేషన్ ఆ తరువాత డివైస్‌లు, ఐప్యాడ్ మినీ 4 ఆ తరువాత డివైస్‌లకు గాను ప్రత్యేకంగా డెవలప్ చేసిన ఐప్యాడ్ ఓఎస్‌ను సెప్టెంబర్ 30వ తేదీన ఆపిల్ విడుదల చేయనుంది. అలాగే వాచ్ సిరీస్ 3 ఆ తరువాత వచ్చిన ఆపిల్ వాచ్‌లకు కొత్త వాచ్‌ఓఎస్ 6 ను సెప్టెంబర్ 19వ తేదీన అందిస్తారు. అంతకు ముందు వచ్చిన ఆపిల్ వాచ్‌లకు ఈ ఏడాది చివర్లోగా కొత్త వాచ్‌ఓఎస్ 6ను అందిస్తారు.

562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles