ఐఓఎస్ 12 ను అనౌన్స్ చేసిన యాపిల్..!


Tue,June 5, 2018 02:27 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన వార్సిక డెవలపర్ సదస్సు (వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ - డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2018ని అట్టహాసంగా ప్రారంభించింది. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 10.30 గంటలకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రారంభోపన్యాసంతో డబ్ల్యూడబ్ల్యూడీసీ 2018 ప్రారంభమైంది. ఈ సదస్సులో నూతనంగా రానున్న పలు ఆపరేటింగ్ సిస్టమ్‌ల గురించిన వివరాలను యాపిల్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రధానంగా ఐఓఎస్ 12, వాచ్ ఓఎస్ 5, టీవీ ఓఎస్ 12, మాక్ ఓఎస్ మొజావె లకు చెందిన ఫీచర్లను తెలియజేశారు. అయితే ఈ సదస్సులో యాపిల్ తన నూతన ఐఫోన్ మోడల్ ఐఫోన్ ఎస్‌ఈ 2ను విడుదల చేస్తుందని అంతా భావించారు. కానీ ఈ సదస్సులో కేవలం సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులపైనే యాపిల్ దృష్టి పెట్టింది.
ios-12

ఐఓఎస్ 12 ఫీచర్లివే...


యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్) క్రెయిగ్ ఫెడిరిగి ఐఓఎస్ 12 ఫీచర్లను సదస్సులో తెలియజేశారు. నూతనంగా రానున్న ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కొత్తగా సిరి షార్ట్‌కట్స్, గ్రూప్ ఫేస్ టైం, మెమోజీ, స్క్రీన్ టైం, షేర్డ్ ఏఆర్ ఎక్స్‌పీరియెన్సెస్ తదితర ఫీచర్లను అందివ్వనున్నారు.

* ఇప్పటి వరకు వచ్చిన ఐఓఎస్ వెర్షన్ల కన్నా ఐఓఎస్ 12లో కెమెరా 70 శాతం వేగంగా ఓపెన్ అవుతుంది. అలాగే కీబోర్డ్ 50 శాతం వేగంగా ఓపెన్ అవుతుంది. ఇతర ఏ యాప్ అయినా రెండున్నర రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది.
ios-12
* ఐఓఎస్ 12లో గ్రూప్ ఫేస్ టైం ఫీచర్‌ను అందివ్వనున్నారు. దీంతో ఒకేసారి 32 మంది వీడియో, ఆడియో చాట్స్ చేసుకోవచ్చు.

* అగ్‌మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత నూతనంగా ఐఓఎస్ 12లో అందివ్వనున్నారు. దీని వల్ల 3డీ ఇమేజ్‌లను ఒక ప్రదేశంలో ఉంచి ముందుగానే ప్రివ్యూ చూడవచ్చు. అలాగే ఒక వస్తువుకు చెందిన కచ్చితమైన కొలతలను (పొడవు, వెడల్పు, ఎత్తు) మీజర్ యాప్ ద్వారా సులభంగా కొలిచే విధంగా ఏఆర్ ఎక్స్‌పీరియెన్స్‌ను తీర్చిదిద్దారు.
ios-12
* ఐఫోన్ X లో అప్‌డేట్ అయ్యే ఐఓఎస్ 12లో కొత్తగా మెమోజీ క్యారెక్టర్లను సృష్టించుకునేలా సౌకర్యం కల్పించారు.

* ఐఓఎస్ 12లో లభించనున్న స్క్రీన్ టైం ఫీచర్ ద్వారా ఐఫోన్‌ను యూజర్లు ఎంత సమయం ఉపయోగిస్తున్నారు, ఏ యాప్‌పై ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు.. వంటి విషయాలను తెలుసుకోవచ్చు. దీని వల్ల స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ తగ్గించుకునేందుకు వీలవుతుంది.
ios-12
* ఐఓఎస్ 12 లో డు నాట్ డిస్టర్బ్ మోడ్‌ను మరింత సమర్థవంతంగా అందించనున్నారు. బెడ్ టైంలో యూజర్ ఐఫోన్ స్క్రీన్ డిస్‌ప్లే డిమ్ అవడంతోపాటు నోటిఫికేషన్స్ ఏమీ రాకుండా యూజర్ ప్రశాంతంగా నిద్రపోయేలా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

* ఐఓఎస్ 12లో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ సిరిని ఇతర యాప్స్‌లోనూ వాడుకునేలా డిజైన్ చేశారు. అందుకు గాను సిరి షార్ట్‌కట్స్ ఫీచర్ పనిచేస్తుంది. నిర్దిష్టమైన పదంతో ఏదైనా యాప్‌లో సిరి షార్ట్‌కట్‌ను సెట్ చేసుకుంటే ఆ పదంతో కూడిన వాయిస్ కమాండ్ ఇచ్చినప్పుడల్లా సదరు యాప్‌లోని సమాచారాన్ని సిరి సేకరించి చదివి యూజర్‌కు వినిపిస్తుంది.
ios-12
* ఐఓఎస్ 12 లో ఫొటోస్ యాప్‌ను కూడా మరింత నూతనంగా డిజైన్ చేశారు. ఇందులో గతంలో కన్నా ఫొటోలను సెర్చ్ చేసుకోవడం మరింత సులభతరం అవుతుంది.

* ఐఓఎస్ 12 లో ఐబుక్స్‌కు బదులుగా యాపిల్స్ బుక్స్‌ను పరిచేయం చేశారు. అలాగే యాపిల్ న్యూస్‌ను కూడా నూతనంగా డిజైన్ చేశారు. దీంతోపాటు పలు ఇతర ఆకట్టుకునే ఫీచర్లను ఐఓఎస్ 12లో అందివ్వనున్నారు.
ios-12
ఐఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందిన ఫీచర్లను యాపిల్ ప్రకటించినప్పటికీ ఈ వెర్షన్‌కు చెందిన అప్‌డేట్‌ను మాత్రం యాపిల్ సెప్టెంబర్‌లోనే విడుదల చేయనుంది. ఆ నెలలో యాపిల్ తన నూతన ఐఫోన్ మోడల్స్‌ను విడుదల చేయడంతోపాటు ఐఓఎస్ 12 ఓఎస్ అప్‌డేట్‌ను కూడా విడుదల చేయనుంది. ఇక ఐఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఐఫోన్ 5ఎస్ ఆ తరువాత వచ్చిన ఐఫోన్ మోడల్స్, అన్ని ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రొ మోడల్స్, ఐప్యాడ్ 5వ జనరేషన్, ఐప్యాడ్ మినీ 2 ఆ తరువాతి డివైస్‌లు, ఐపాడ్ టచ్ 6వ జనరేషన్ డివైస్‌లలో ఇన్‌స్టాల్ అవుతుందని యాపిల్ ప్రతినిధులు వెల్లడించారు.కాగా యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2018 ఈ నెల 8వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

3085

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles