వ‌చ్చేశాయ్‌.. డ్యుయ‌ల్ సిమ్ ఫీచ‌ర్ క‌లిగిన కొత్త ఐఫోన్లు..!


Thu,September 13, 2018 11:37 AM

ఐఫోన్ ప్రియులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న నూత‌న ఐఫోన్లు వ‌చ్చేశాయి. కాలిఫోర్నియాలోని క్యూప‌ర్‌టినోలో ఉన్న యాపిల్ పార్క్ క్యాంప‌స్‌లోని స్టీవ్ జాబ్స్ థియేట‌ర్‌లో భార‌త కాల‌మానం ప్ర‌కారం నిన్న రాత్రి 10.30 గంట‌ల‌కు యాపిల్ సంస్థ త‌న గ్యాద‌ర్ రౌంట్ ఈవెంట్‌ను నిర్వ‌హించింది. ఇందులో భాగంగా యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ఆ సంస్థ నుంచి రాబోయే నూత‌న ఉత్ప‌త్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. వాటిలో ముఖ్యంగా నూత‌న ఐఫోన్ల‌తోపాటు, వాచ్ సిరీస్ 4 స్మార్ట్‌వాచ్‌లు, ఐఓఎస్‌12, ఇత‌ర ఉత్ప‌త్తుల గురించిన వివ‌రాల‌ను తెలిపారు.

డ్యుయ‌ల్ సిమ్ ఐఫోన్లు...


ఐఫోన్‌లో వినియోగ‌దారులు ఎప్ప‌టి నుంచో ఆశిస్తున్న ఫీచ‌ర్ డ్యుయ‌ల్ సిమ్‌. అనేక పేరు గాంచిన ఆండ్రాయిడ్ మొబైల్ త‌యారీ కంపెనీలు ఎప్ప‌టి నుంచో డ్యుయ‌ల్ సిమ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నాయి. కానీ యాపిల్ ఫోన్ల‌లో ఆ ఫీచ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. కానీ ఈ సారి మాత్రం డ్యుయ‌ల్ సిమ్ ఫీచ‌ర్‌ను యాపిల్ త‌న నూత‌న ఐఫోన్ల‌లో అందిస్తున్న‌ది. దీనిపై గ‌త కొన్ని రోజులుగా ఇంట‌ర్నెట్‌లో ప‌లు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే అంద‌రూ ఊహించిన‌ట్లుగానే యాపిల్ త‌న నూతన ఐఫోన్ల‌లో డ్యుయ‌ల్ సిమ్ ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. యాపిల్ ఈ సారి త‌న ఐఫోన్ Xకు కొన‌సాగింపుగా ఐఫోన్ Xఎస్‌, Xఎస్ మ్యాక్స్‌, Xఆర్ ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌గా, ఈ మూడింటిలోనూ డ్యుయ‌ల్ సిమ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. మొద‌టి సిమ్ కార్డుకు ఫిజిక‌ల్ స్లాట్ ఇచ్చారు. ఇక‌పోతే రెండో సిమ్ ఇ-సిమ్ వెర్ష‌న్‌లో ఉంటుంది. అంటే.. భౌతికంగా సిమ్ కార్డు వేయ‌డానికి కుద‌ర‌దు. సిమ్ కార్డు స‌మాచారాన్ని క‌స్ట‌మ‌ర్ వాడే నెట్‌వర్క్‌కు చెందిన టెలికాం ఆప‌రేట‌ర్ ఇ-సిమ్‌కు పుష్ చేస్తారు. దీంతో ఐఫోన్ల‌లో రెండో సిమ్‌ను వాడుకోవ‌చ్చు. ఇక భార‌త్‌లో ఎయిర్‌టెల్‌, జియోలు యాపిల్ ఇ-సిమ్‌కు స‌పోర్ట్‌నిస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి. అయితే చైనాలో అందుబాటులోకి వ‌చ్చే ఈ ఐఫోన్లలో మాత్రం డ్యుయ‌ల్ సిమ్‌ల‌లో రెండో సిమ్‌కు కూడా ఫిజిక‌ల్ స్లాట్‌ను అందిస్తున్నారు. అంటే అక్క‌డ ఇ-సిమ్ ఉండ‌దు. రెండో సిమ్ కు స్లాట్ ఉంటుంది.

డిజైన్‌, డిస్‌ప్లే...


ఐఫోన్ Xఎస్‌, Xఎస్ మ్యాక్స్‌, Xఆర్ ఫోన్ల‌ను అత్యంత ఆక‌ట్టుకునే డిజైన్‌తో త‌యారు చేశారు. అల్యూమినియం గ్లాస్ డిజైన్‌ను ఈ ఫోన్లు క‌లిగి ఉన్నాయి. ఐఫోన్ Xఎస్ లో 5.8 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే (2436 x 1125 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌) ఉండ‌గా, Xఎస్ మ్యాక్స్ లో 6.5 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే(2688 x 1245 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌)ను ఏర్పాటు చేశారు. అలాగే ఐఫోన్ Xఆర్ లో 6.1 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే(1792 x 828 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌)ను అమ‌ర్చారు. ఇక మూడు ఫోన్ల‌లోనూ గ‌తంలో వ‌చ్చిన ఐఫోన్ X త‌ర‌హాలో డిస్‌ప్లే పైభాగంలో నాచ్ ఉంటుంది.

ప్రాసెస‌ర్, స్టోరేజ్‌...


ఐఫోన్ Xఎస్‌, Xఎస్ మ్యాక్స్‌, Xఆర్ ఫోన్ల‌లో మూడింటిలోనూ యాపిల్ ఎ12 బ‌యోనిక్ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 6 కోర్లు ఉంటాయి. యూజ‌ర్ల‌కు అత్యుత్త‌మమైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తాయి. గ‌తంలో వ‌చ్చిన యాపిల్ ఐఫోన్ల‌లోని ఎ11 బ‌యోనిక్ ప్రాసెస‌ర్ క‌న్నా ఎ12 ప్రాసెస‌ర్ 15 శాతం వేగంగా ప‌నిచేస్తుంది. 40 శాతం త‌క్కువ ప‌వ‌ర్‌ను వాడుకుంటుంది. ఇక ఐఫోన్ Xఎస్‌, Xఎస్ మ్యాక్స్ ఫోన్లలో 64/256/512 స్టోరేజ్ ఆప్ష‌న్లు ల‌భిస్తుంగా, ఐఫోన్ Xఆర్ లో 64/128/256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌ను అందిస్తున్నారు.

కెమెరా...


ఐఫోన్ Xఎస్‌, Xఎస్ మ్యాక్స్ ఫోన్ల‌లో రెండింటిలోనూ వెనుక భాగంలో 12 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 7 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. గ‌తంలో వ‌చ్చిన ఐఫోన్ల క‌న్నా చాలా మెరుగ్గా కెమెరా ప‌నిత‌నం ఉంటుంద‌ని యాపిల్ ప్ర‌తినిధులు చెప్పారు. అలాగే ఐఫోన్ Xఆర్ లో వెనుక భాగంలో 12 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న సింగిల్ కెమెరాను అమర్చారు. ముందు భాగంలో య‌థావిధిగా 7 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఉంది.

ఇత‌ర ఫీచ‌ర్లు...


మూడు నూత‌న ఐఫోన్లలోనూ ఐఓఎస్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను అందిస్తున్నారు. అయితే ఈ ఓఎస్ ఇంకా విడుద‌ల కాలేదు. దీన్ని ఈ నెల 17వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఐఫోన్ Xఎస్‌, Xఎస్ మ్యాక్స్ ఫోన్ల‌లో ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌ను ఏర్పాటు చేయ‌గా, ఐఫోన్ Xఆర్ లో ఐపీ 67 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మూడు ఫోన్ల‌లోనూ ఫేస్ ఐడీ ఫీచ‌ర్‌ను ఇస్తున్నారు. దీంతో గ‌తంలో వ‌చ్చిన ఐఫోన్ X లో ఉన్న ఫీచ‌ర్లు ల‌భిస్తాయి. ఫేస్ అన్‌లాక్‌, యానిమోజీ వంటి స‌దుపాయాలు ఫేస్ ఐడీ ఫీచ‌ర్‌తో వ‌స్తాయి. ఇవే కాకుండా అన్ని ఫోన్ల‌లోనూ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ ఫీచ‌ర్లు ల‌భిస్తున్నాయి. బ్యాట‌రీ విష‌యానికి వ‌స్తే.. అన్ని ఐఫోన్ల‌కు సంబంధించిన బ్యాట‌రీ స్పెసిఫికేష‌న్ ఎంతో యాపిల్ వెల్ల‌డించ‌లేదు. కానీ గ‌తేడాది విడుద‌లైన ఐఫోన్ల క‌న్నా మెరుగైన బ్యాట‌రీ లైఫ్‌ను ఈ కొత్త ఐఫోన్లు ఇస్తాయ‌ని యాపిల్ ప్ర‌తినిధులు తెలిపారు. అలాగే ఈ మూడు ఐఫోన్ల‌లోనూ వైర్‌లెస్ చార్జింగ్‌, ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్లు ల‌భిస్తున్నాయి.

ధ‌ర‌, ల‌భ్య‌త‌...


ఐఫోన్ Xఎస్‌, Xఎస్ మ్యాక్స్ ఫోన్లు గోల్డ్‌, సిల్వ‌ర్‌, స్పేస్ గ్రే క‌ల‌ర్ వేరియెంట్ల‌లో వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానున్నాయి. ఈ నెల 21వ తేదీన 30కిపైగా దేశాల్లో ఈ ఫోన్లు అందుబాటులోకి వ‌స్తాయి. అందుకు గాను రేప‌టి నుంచి ప్రీ ఆర్డ‌ర్ల‌ను కూడా ప్రారంభించ‌నున్నారు. భార‌త్ లోనూ ఈ నెల 21వ తేదీనే ఈఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ Xఎస్ ప్రారంభ ధ‌ర రూ.99,900గా ఉండ‌గా, ఐఫోన్ Xఎస్ మ్యాక్స్ ప్రారంభ ధ‌ర రూ.1,09,900 గా ఉంది. అలాగే ఐఫోన్ Xఆర్ ఫోన్ వైట్‌, బ్లాక్‌, బ్లూ, ఎల్లో, కోర‌ల్‌, రెడ్ క‌ల‌ర్ వేరియెంట్ల‌లో ల‌భ్యం కానుంది. అక్టోబ‌ర్ 26వ తేదీ నుంచి ఈ ఫోన్ 50కి పైగా దేశాల్లో ల‌భ్యం కానుంది. అమెరికాలో అక్టోబ‌ర్ 19 నుంచి ఈ ఫోన్ ల‌భిస్తుంది. ఇక ఈ ఫోన్‌కు గాను 64 జీబీ వేరియెంట్ ధ‌ర రూ.76,900 ఉండ‌గా, 128 జీబీ వేరియెంట్ ధ‌ర రూ.81,900, 256 జీబీ వేరియెంట్ ధ‌ర రూ.91,900 గా ఉంది.

ఐఫోన్ Xఎస్‌, Xఎస్ మ్యాక్స్ ఫీచ‌ర్లు...


ఐఫోన్ Xఎస్ - 5.8 ఇంచ్ ఓలెడ్ సూప‌ర్ రెటీనా హెచ్‌డీఆర్ డిస్‌ప్లే, 2436 x 1125 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
ఐఫోన్ Xఎస్ మ్యాక్స్ - 6.5 ఇంచ్ ఓలెడ్ సూప‌ర్ రెటీనా హెచ్‌డీఆర్ డిస్‌ప్లే, 2688 x 1245 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
యాపిల్ ఎ12 బ‌యోనిక్ ప్రాసెస‌ర్‌, 64/256/512 జీబీ స్టోరేజ్‌, ఐఓఎస్ 12, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 7 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ ఐడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, వైర్‌లెస్ చార్జింగ్‌, ఫాస్ట్ చార్జింగ్‌.

ఐఫోన్ Xఆర్ ఫీచ‌ర్లు...


6.1 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1792 x 828 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, యాపిల్ ఎ12 బ‌యోనిక్ ప్రాసెస‌ర్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఐఓఎస్ 12, ఐపీ 67 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డ్యుయల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 7 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ ఐడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, వైర్‌లెస్ చార్జింగ్‌, ఫాస్ట్ చార్జింగ్‌.

5966

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles