ఐఓఎస్ 13ను అనౌన్స్ చేసిన యాపిల్.. ఫీచర్లివే..!


Tue,June 4, 2019 05:37 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ ఐఓఎస్ 13తోపాటు టీవీఓఎస్ 13, వాచ్ ఓఎస్ 6లను కూడా తాజాగా అనౌన్స్ చేసింది. నిన్న ప్రారంభమైన యాపిల్ వార్షిక డెవలపర్ సదస్సు (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2019లో భాగంగా యాపిల్ తన నూతన ఓఎస్‌ల గురించి ప్రకటన చేసింది. అలాగే వాటిల్లో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను కూడా యాపిల్ వెల్లడించింది.

ఐఓఎస్ 13లో అందివ్వనున్న ముఖ్యమైన ఫీచర్ల వివరాలు...


* యాపిల్ త్వరలో విడుదల చేయనున్న ఐఓఎస్ 13లో కొత్తగా డార్క్ మోడ్ అనే ఫీచర్‌ను అందివ్వనున్నారు. దీంతో రాత్రి పూట ఫోన్‌లో థీమ్ అంతా నల్లగా మారుతుంది. ఈ క్రమంలో కళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.
* ఐఓఎస్ 13లో ఫొటోస్ ట్యాబ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఫొటోలను వాటిని తీసిన రోజులు, నెలలు, సంవత్సరాలను బట్టి సులభంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే ఫొటోలను స్క్రోల్ చేసే కొద్దీ వాటిలో వచ్చే లైవ్ ఫొటోలు, వీడియోలు మ్యూట్ చేయబడి ఆటోమేటిక్‌గా ప్లే అవుతాయి.
* ఫొటోలను ఎడిట్ చేసుకునేందుకు మరిన్ని అధునాతన టూల్స్‌ను, ఫీచర్లను అందిస్తున్నారు. దీంతో ఫొటోలను మరింత ఆకర్షణీయంగా ఎడిట్ చేసుకోవచ్చు.
* కెమెరా ఆప్షన్‌లో పోర్ట్రెయిట్ మోడ్‌లో కొత్త లైటింగ్ ఎఫెక్ట్‌లను అందివ్వనున్నారు.
* వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్, గూగుల్ అకౌంట్లతో సైనిన్ అవ్వాల్సిన పనిలేకుండా యాపిల్ ఐడీతోనూ లాగిన్ అయ్యేలా ఐఓఎస్ 13లో కొత్త సైనిన్ ఫీచర్‌ను అందివ్వనున్నారు.
* ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లను మరింత సమర్థవంతంగా అందివ్వనున్నారు. ఒక యాప్ లొకేషన్ లేదా డేటాను ఏ మేర ఉపయోగించాలో నియంత్రించే కంట్రోల్ ఆప్షన్‌ను అందివ్వనున్నారు.
* యాపిల్ మ్యాప్స్, సిరి, మెమోజీ, మెసేజ్‌లు, రిమైండర్స్, కార్ ప్లే, హోమ్ పాడ్, వాయిస్ కంట్రోల్, నోట్స్, టెక్ట్స్ ఎడిటింగ్, ఫైల్స్, హెల్త్ యాప్‌లను మరింత సులభంగా, వేగంగా ఓపెన్ చేసి వాడుకునేలా తీర్చిదిద్దారు.
* గత ఓఎస్‌ల కన్నా ఐఓఎస్ 13 మరింత వేగంగా, రెస్పాన్సివ్‌గా పనిచేసేలా తీర్చిదిద్దారు. ఇక ఐఓఎస్ 13 ఉన్న డివైస్‌లలో యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్ సైజ్ 50 నుంచి 60 శాతం వరకు తగ్గనుంది. అలాగే యాప్‌లు కూడా వేగంగా ఓపెన్ అయ్యేలా నూతన ఓఎస్‌ను డిజైన్ చేశారు.

ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ సెప్టెంబర్ నెలలో ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ ఓఎస్ ఐఫోన్ 6ఎస్ ఆపైన వచ్చిన ఐఫోన్లలో, ఐపాడ్ టచ్ (7వ జనరేషన్)డివైస్‌లో ఇన్‌స్టాల్ అవుతుందని యాపిల్ తెలిపింది.


వాచ్ ఓఎస్ 6 ఫీచర్లు...


యాపిల్ ప్రవేశపెట్టిన వాచ్ ఓఎస్ 6 లో కొత్తగా సైకిల్ ట్రాకింగ్ యాప్, నాయిస్ యాప్, న్యూ ట్రెండ్స్ ట్యాబ్‌ను అందివ్వనున్నారు. అలాగే హెల్త్ అండ్ ఫిట్‌నెస్ యాప్‌లో కొత్త ఫీచర్లు, నూతన వాచ్ ఫేసెస్, యాప్ స్టోర్‌కు సపోర్ట్, కొత్త కాలిక్యులేటర్ యాప్ తదితర ఫీచర్లను అందివ్వనున్నారు. ఇక వాచ్ ఓఎస్ 6 సెప్టెంబర్ నెలలో లభ్యం కానుండగా, యాపిల్ వాచ్ సిరీస్ 1 ఆపైన వచ్చిన వాచ్‌లలో ఈ ఓఎస్ ఇన్‌స్టాల్ అవుతుంది. అలాగే ఐఫోన్ 6ఎస్ లేదా, ఐఓఎస్ 13 ఉన్న డివైస్‌లకు మాత్రమే ఓఎస్ అప్‌డేటెడ్ యాపిల్ వాచ్‌లు కనెక్ట్ అవుతాయి.


యాపిల్ టీవీఓఎస్ 13 ఫీచర్లు...


యాపిల్ ప్రకటించిన టీవీఓఎస్ 13లో కొత్త హోం స్క్రీన్, మల్టీ యూజర్ సపోర్ట్, యాపిల్ మ్యూజిక్ లిరిక్స్, ఎక్స్‌బాక్స్ వన్, పీఎస్4 గేమ్ కంట్రోలర్స్‌కు సపోర్ట్, నూతన స్క్రీన్ సేవర్లు తదితర ఫీచర్లను అందివ్వనున్నారు. ఇక ఈ టీవీఓఎస్ 13 కూడా సెప్టెంబర్ నెలలోనే లభిస్తుంది. యాపిల్ టీవీ 4కె, యాపిల్ టీవీ హెచ్‌డీ యూజర్లు ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్‌ను పొందవచ్చు.


కొత్తగా వచ్చిన ఐప్యాడ్ ఓఎస్...


యాపిల్ తన వార్షిక డెవలపర్ సదస్సులో కొత్తగా ఐప్యాడ్ ఓఎస్‌ను కూడా ప్రవేశపెట్టింది. పెద్ద డిస్‌ప్లే ఉన్న ఐప్యాడ్‌ల కోసం ఈ ఓఎస్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. ఇందులో హోం స్క్రీన్‌ను మరింత నూతనంగా తీర్చిదిద్దారు. ఐకాన్స్ మరింత పకడ్బందీగా గ్రిడ్‌లో అమరి ఉంటాయి. అలాగే హోం స్క్రీన్‌పై యూజర్లు తమ ఫేవరెట్ విడ్జెట్లను సెట్ చేసుకోవచ్చు.

ఐప్యాడ్ ఓఎస్‌లో మల్టీటాస్కింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. దీని సహాయంతో ఒకటి కన్నా ఎక్కువ యాప్‌లలో యూజర్లు ఒకేసారి పనిచేయవచ్చు. అలాగే యాపిల్ పెన్సిల్, ఫైల్స్ యాప్, సఫారీ బ్రౌజర్, టెక్ట్స్ ఎడిటింగ్, డార్క్ మోడ్, కస్టమ్ ఫాంట్స్, ఫ్లోటింగ్ కీబోర్డు, ఫొటోస్ తదితర యాప్‌లను, ఫీచర్లను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా ఐప్యాడ్ ఓఎస్‌ను తీర్చిదిద్దారు. కాగా ఈ ఓఎస్ కూడా సెప్టెంబర్ నెలలోనే యూజర్లకు లభిస్తుంది. ఇక ఈ నూతన ఓఎస్ ఐప్యాడ్ ఎయిర్ 2 ఆపైన వచ్చిన డివైస్‌లు, అన్ని ఐప్యాడ్ ప్రొ మోడల్స్, ఐప్యాడ్ 5వ జనరేషన్ ఆపైన వచ్చిన డివైస్‌లు, ఐప్యాడ్ మినీ 4 ఆపైన వచ్చిన డివైస్‌లలో ఇన్‌స్టాల్ అవుతుందని యాపిల్ తెలిపింది.

ఇక ఇవే కాకుండా యాపిల్ తన వార్షిక డెవలపర్ సదస్సులో నూతన మాక్‌ఓఎస్ క్యాటలినాను కూడా ప్రవేశపెట్టింది. ఇందులోనూ పలు అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందివ్వనున్నారు. ఈ ఓఎస్ కూడా సెప్టెంబర్‌లోనే లభిస్తుంది. 2012 మధ్యలో, ఆ తరువాత వచ్చిన అన్ని మాక్‌లలో ఈ నూతన ఓఎస్ ఇన్‌స్టాల్ అవుతుంది. అలాగే యాపిల్ తన సదస్సులో నూతన మాక్ ప్రొలను కూడా ప్రవేశపెట్టింది. ఇవి రూ.3,46,220, రూ.4,15,490 ప్రారంభ ధరలకు సెప్టెంబర్ నెలలో వినియోగదారులకు లభ్యం కానున్నాయి.

2376
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles