ఎయిర్‌టెల్ 50 జీబీ డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫర్


Thu,October 12, 2017 05:04 PM

ముంబై: జియోతో పోటీకి సై అంటే సై అంటున్నది ఎయిర్‌టెల్. ఆఫర్ల మీద ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. నిన్న రూ.1399కే 4జీ ఆండ్రాయిడ్ ఫోన్ అంటూ సంచలనం రేపిన ఈ టెలికాం సంస్థ.. ఇవాళ మరో ఆఫర్ ప్రకటించింది. డేటా ఎక్కువగా వాడే వారికోసం ఆకర్షిణీయమైన ప్లాన్ తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్ కింద 50 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోమింగ్‌లోనూ ఫ్రీకాల్స్ లభిస్తాయి. పోస్ట్ పెయిడ్ యూజర్లకు రూ.999కి ఈ ప్లాన్ ఇస్తున్నది. ఇప్పటికే ఉన్నవారితోపాటు కొత్త యూజర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు మిగిలిపోయిన డేటాను రోల్ ఓవర్ కూడా చేస్తామని ఎయిర్‌టెల్ స్పష్టంచేసింది. ఇక ఈ ఆఫర్‌తోపాటు ఎయిర్‌టెల్ సెక్యూర్ సర్వీస్‌ను ఆరు నెలల పాటు ఫ్రీగా అందిస్తున్నది. దీనికింద ఒకవేళ కస్టమర్ ఫోన్ ప్రమాదవశాత్తూ పాడైతే సంబంధింత ఆథోరైజ్డ్ సర్వీస్ సెంటర్‌లో రిపెయిర్ చేయించి ఇస్తుంది. ప్రీపెయిడ్‌లో గత సెప్టెంబర్‌లోనే రూ.999 ప్లాన్‌ను ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్ కింద 112 జీబీ డేటా అందిస్తున్నది. ప్రీపెయిడ్‌లో గరిష్ఠంగా రోజుకు 4 జీబీ వాడుకొనే వెసులుబాటు ఉండగా.. పోస్ట్ పెయిడ్‌లో మాత్రం రోజువారీ డేటా పరిమితులు ఏమీ లేవు. ఇప్పటికే జియో కూడా రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద 90 జీబీ డేటా అందిస్తుండగా.. దీని వేలిడిటీ రెండు నెలలుగా ఉంది.

12621

More News

VIRAL NEWS