అద్భుతం.. ఐఓఎస్ 13.. టాప్ 25 ఫీచర్లివే..!


Sat,September 21, 2019 12:33 PM

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ తాను చెప్పిన విధంగానే ఎట్టకేలకు ఐఓఎస్ 13 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇందులో ఐఫోన్ వినియోగదారులకు పలు ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి. అయితే ఈ ఓఎస్ అప్‌డేట్ కేవలం ఐఫోన్లకు మాత్రమే విడుదల కాగా.. ఐప్యాడ్లకు ప్రత్యేకంగా త్వరలో ఐప్యాడ్ ఓఎస్‌ను ఆపిల్ ప్రవేశపెట్టనుంది. ఇక ఐఓఎస్ 13లో ఆపిల్ అందిస్తున్న ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..!

1. వైఫై, బ్లూటూత్ కనెక్షన్

ఐఓఎస్ 13లో వైఫై, బ్లూటూత్ నెట్‌వర్క్‌లకు సులభంగా కనెక్ట్ అవ్వొచ్చు. అందుకు గాను యూజర్లు ఐఫోన్‌లో కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసి వైఫై లేదా బ్లూటూత్ ఐకాన్‌పై ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి. దీంతో అందుబాటులో ఉన్న నెట్‌వర్క్స్ కనిపిస్తాయి. వాటిల్లో కావాలనుకున్న నెట్‌వర్క్‌కు యూజర్లు సులభంగా కనెక్ట్ అవ్వొచ్చు.

2. సైలెన్స్ అన్‌నౌన్ కాలర్స్

అవాంఛిత కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఐఓఎస్ 13లో అద్భుమైన ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫీచర్ సహాయంతో ఐఫోన్ యూజర్లు కేవలం తమ ఫోన్ కాంటాక్ట్స్‌లో సేవ్ అయి ఉండే కాంటాక్ట్‌ల నుంచే కాల్స్ స్వీకరించవచ్చు. ఫోన్‌లో సేవ్ కాని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఆటోమేటిగ్గా సైలెన్స్ అవుతాయి. దీంతో స్పామ్ కాల్స్‌ను నియంత్రించవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే యూజర్లు.. ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫోన్ విభాగంలో ఉండే సైలెన్స్ అన్‌నౌన్ కాలర్స్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో టెలిమార్కెటర్ల నుంచి వచ్చే కాల్స్ బాధ తప్పుతుంది.

3. లార్జ్ యాప్స్ డౌన్‌లోడ్

ఇప్పటి వరకు ఐఫోన్లలో ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఉండే యాప్స్‌ను కేవలం వైఫై ద్వారా మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై అలా కాదు.. ఎంత పెద్ద యాప్‌నైనా సరే.. మొబైల్ డేటా ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు గాను ఐఫోన్ యూజర్లు తమ ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఐట్యూన్స్ అండ్ యాప్ స్టోర్‌లో ఉండే మొబైల్ డేటా సెక్షన్‌లోని యాప్ డౌన్‌లోడ్స్‌లోకి వెళ్లి ఆల్వేస్ అలో ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అయితే అక్కడే ఉండే ఆల్వేస్ యాస్క్ అనే ఆప్షన్ ఎంచుకుంటే పెద్ద సైజ్ ఉండే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసినప్పుడల్లా ఫోన్ యూజర్ పర్మిషన్ అడుగుతుంది. ఇక అక్కడే ఉండే యాస్క్ ఇఫ్ ఓవర్ 200 ఎంబీ అనే ఆప్షన్ ఎంచుకుంటే కేవలం 200 ఎంబీకి పైన సైజులో ఉండే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఫోన్ యూజర్ పర్మిషన్ అడుగుతుంది. అప్పుడు యూజర్ తనకు కావలిస్తే మొబైల్ డేటా ద్వారా కూడా ఆయా పెద్ద సైజ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

4. ఫేస్‌టైం, ఐమెసేజ్‌కు డ్యుయల్ సిమ్ సపోర్ట్

డ్యుయల్ సిమ్ ఐఫోన్లలో ఇకపై ఫేస్‌టైం, ఐమెసేజ్ యాప్‌లలో ఫోన్‌లో ఉన్న రెండు నంబర్లను ఉపయోగించుకోవచ్చు.

5. యాప్ స్టోర్ నుంచి నేరుగా యాప్స్ డిలీట్

ఐఫోన్‌లోని ఏదైనా యాప్‌కు యాప్ స్టోర్ నుంచి అప్‌డేట్ వస్తే.. ఆ యాప్‌ను డిలీట్ చేసేందుకు హోం స్క్రీన్‌ను వెదకాల్సిన పనిలేదు. సింపుల్‌గా యాప్ స్టోర్‌లోకి వెళ్లి అందులో కుడివైపు పైభాగంలో ఉండే ప్రొఫైల్ ఐకాన్‌ను ట్యాప్ చేసి అందులో వచ్చే అప్‌డేట్స్ సెక్షన్‌లోకి వెళ్లి అక్కడ ఉండే ఆ యాప్ ఐకాన్‌పై ఎడమ వైపుకు స్వైప్ చేస్తే డిలీట్ ఆప్షన్ వస్తుంది. దాన్ని ఎంచుకుంటే ఆ యాప్ డిలీట్ అవుతుంది.

6. సైలెంట్ మోడ్ డిస్‌ప్లే

ఐఫోన్‌ను సైలెంట్ మెడ్‌లో పెడితే దాన్ని సూచించే విధంగా ఇంతకు ముందు పెద్ద ఐకాన్ తెరపై డిస్‌ప్లే అయ్యేది. కానీ ఇప్పుడు దాన్ని చిన్న సైజులో డిజైన్ చేశారు. దీంతో యూజర్లు తమ ఐఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెడితే వచ్చే ఐకాన్ ఐఓఎస్ 13లో చిన్నదిగా కనిపిస్తుంది.

7. సఫారి ట్యాబ్స్ ఆటోమేటిగ్గా క్లోజ్ చేయడం

ఐఓఎస్ 13లో సఫారి బ్రౌజర్‌లో ట్యాబ్‌లను క్లోజ్ చేయడం మరిచిపోతే.. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సఫారి విభాగంలో ఉండే క్లోజ్ ట్యాబ్స్ ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు, ఆ ట్యాబ్స్ ఆటోమేటిగ్గా క్లోజ్ అవుతాయి.

8. మౌస్ సపోర్ట్

ఐఓఎస్ 13లో ఐఫోన్‌కు బ్లూటూత్ మౌస్ కనెక్ట్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. అందుకు గాను యూజర్లు ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాక్సెస్సిబిలిటీ విభాగంలో ఉండే టచ్ సెక్షన్‌లోని అసిస్టివ్ టచ్-డివైసెస్-బ్లూటూత్ డివైసెస్ ఆప్షన్‌లోకి వెళ్లి బ్లూటూత్ మౌస్‌ను పెయిర్ చేసుకుని ఐఫోన్‌తో ఉపయోగించుకోవచ్చు. అయితే డాంగిల్ లేకుండా ఉండే బ్లూటూత్ మౌస్‌లనే ఈ విధంగా ఉపయోగించుకునేందుకు వీలుంటుంది.

9. సఫారి డౌన్‌లోడ్ మేనేజర్

గత ఐఓఎస్‌లలో సఫారి ద్వారా ఆయా వెబ్‌సైట్ల నుంచి ఫైల్స్ డౌన్‌లోడ్ సాధ్యమయ్యేది కాదు. కానీ ఐఓఎస్ 13లో ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు. సఫారి బ్రౌజర్‌లో ఏదైనా వెబ్‌సైట్‌ను యూజర్లు ఓపెన్ చేసి అందులో ఉండే ఏవైనా ఫైల్స్‌ను ఐఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఆ ఫైల్స్ ముందుగా ఐక్లౌడ్‌లోకి డౌన్‌లోడ్ అవుతాయి. వాటిని యూజర్లు కావాలనుకుంటే మాన్యువల్‌గా ఐఫోన్‌లో ఉండే ఫైల్ మేనేజర్ (ఇంటర్నల్ స్టోరేజ్)కు కాపీ చేసుకోవచ్చు.

10. స్క్రీన్ షాట్ ఫుల్ వెబ్ పేజ్

ఫేస్ ఐడీ ఉన్న ఐఫోన్ యూజర్లు ఐఓఎస్ 13లో పవర్, వాల్యూమ్ అప్ బటన్లను ఒకేసారి ప్రెస్ చేయడం ద్వారా ఏదైనా ఫుల్ వెబ్‌పేజీని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అది పీడీఎఫ్ ఫైల్ రూపంలో సేవ్ అవుతుంది. ఫేస్‌ఐడీ లేని ఐఫోన్లలో పవర్, హోమ్ బటన్లను ఒకేసారి ప్రెస్ చేయడం ద్వారా ఫుల్ వెబ్‌పేజీ స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు.

11. సేవ్ స్క్రీన్ షాట్స్ టు ఫైల్స్

ఐఓఎస్ 13లో ఐఫోన్ యూజర్లు తీసుకునే స్క్రీన్‌షాట్లను ఇకపై గ్యాలరీలో కాకుండా ఫైల్ మేనేజర్‌లో ఫోల్డర్లలో ఫైల్స్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఐక్లౌడ్‌లోనూ ఆ ఫైల్స్‌ను సేవ్ చేసుకోవచ్చు.

12. ఇంప్రూవ్డ్ మెసేజెస్ సెర్చ్

ఐఫోన్ మెసేజెస్ యాప్‌లో సెర్చ్ ఫీచర్‌ను మరింత ఇంప్రూవ్ చేశారు. అందులో యూజర్లు రీసెంట్ లింక్స్, కాంటాక్ట్స్ వంటి వాటిని మరింత సులభంగా వెదకవచ్చు.

13. లో డేటా మోడ్

ఐఫోన్‌లో మొబైల్ డేటా తక్కువగా ఉన్నా.. లేదంటే డేటాను ఫోన్ తక్కువగా వాడుకోవాలని చెప్పాలనుకున్నా.. అందుకు గాను ఫోన్‌లో యూజర్లు సెట్టింగ్స్‌లోని మొబైల్ డేటా - మొబైల్ డేటా ఆప్షన్స్ విభాగంలో ఉండే లో డేటా మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో ఫోన్‌లో మొబైల్ డేటా ఆదా అవుతుంది.

14. ఆప్టిమైజ్డ్ బ్యాటరీ చార్జింగ్

ఐఓఎస్ 13లో సెట్టింగ్స్‌లోని బ్యాటరీ - బ్యాటరీ హెల్త్ విభాగంలో అందిస్తున్న ఆప్టిమైజ్డ్ బ్యాటరీ చార్జింగ్ ఫీచర్ వల్ల ఐఫోన్ బ్యాటరీ మరింత కాలం మన్నికనిస్తుంది. యూజర్లు ఫోన్‌కు పెట్టే చార్జింగ్‌కు అనుగుణంగా ఫోన్ బ్యాటరీ చార్జింగ్ 80 శాతం దాటాక మాత్రమే అవసరం అనుకున్నప్పుడు ఫుల్ చార్జ్ అవుతుంది.

15. ఇమేజ్ ఓసీఆర్ సెర్చ్ ఇన్ నోట్స్

ఐఫోన్‌లోని నోట్స్ యాప్‌లో టెక్ట్స్‌తో కూడిన ఏదైనా ఇమేజ్‌ను యూజర్లు సేవ్ చేస్తే.. ఆ టెక్ట్స్‌ను ఫోన్ ఓసీఆర్ టెక్నాలజీతో గుర్తిస్తుంది. దాంతో ఆ టెక్ట్స్‌కు అనుగుణంగా ఇమేజ్‌లను వెదకవచ్చు.

16. ఎమోజీ బటన్

ఐఓఎస్ 13లో అందిస్తున్న ఐఓఎస్ కీబోర్డులో ఎమోజీలకు ప్రత్యేకంగా బటన్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల యూజర్లు ఇతరులకు ఎమోజీలను సులభంగా పంపుకోవచ్చు.

17. కంప్రెస్, ఎక్స్‌పాండ్ ఫైల్స్

ఐఓఎస్ 13లో ఫైల్స్‌ను జిప్, అన్‌జిప్ చేయవచ్చు. ఫైల్స్ యాప్‌కు జిప్ ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేశాక వాటిని అన్‌జిప్ చేయవచ్చు. అలాగే జిప్ చేసుకోవచ్చు. అందుకు గాను యూజర్లు ఫైల్స్ యాప్‌లో ఉండే ఏదైనా ఫైల్‌పై ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే కంప్రెస్ అనే ఆప్షన్ దర్శనమిస్తుంది. దాంతో ఫైల్స్‌ను జిప్, అన్‌జిప్ చేసుకోవచ్చు.

18. ఫోల్డర్స్ క్రియేషన్

ఐఓఎస్ 13లోని ఫైల్స్ యాప్‌లో యూజర్లు నూతనంగా ఫోల్డర్లను క్రియేట్ చేసుకోవచ్చు.

19. ఎగ్జిఫ్ డేటా రిమూవింగ్


ఐఓఎస్ 13లోని ఫొటోస్ యాప్‌లో మీకు కావల్సిన ఫొటోలను సెలెక్ట్ చేసుకుని కింద ఉండే షేర్ బటన్ ప్రెస్ చేశాక వచ్చే విభాగంలో.. పైన ఉండే ఆప్షన్స్ అనే సెక్షన్‌ను ఎంచుకోవాలి. అందులో ఆల్ ఫొటోస్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే యూజర్లు తాము అంతకు ముందు సెలెక్ట్ చేసిన ఫొటోలకు చెందిన ఎగ్జిఫ్ డేటాను రిమూవ్ చేయవచ్చు.

20. లొకేషన్ ప్రైవసీ

ఐఓఎస్ 13లో సెట్టింగ్స్‌లోని ప్రైవసీ - లొకేషన్ సర్వీసెస్ విభాగంలో ఏదైనా ఒక యాప్‌ను ఎంచుకుని ట్యాప్ చేస్తే వచ్చే విభాగంలో యాస్క్ నెక్ట్స్ టైం అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే ఇకపై ఆ యాప్‌ను ఓపెన్ చేసినప్పుడు లొకేషన్ షేర్ చేయమంటారా అని అడుగుతుంది. దీంతో నిర్దిష్టమైన యాప్ లొకేషన్ సర్వీస్‌ను వాడుకుంటుందా, లేదా అనేది సులభంగా తెలిసిపోతుంది.

21. పీఎస్4, ఎక్స్‌బాక్స్ వన్ కంట్రోలర్ సపోర్ట్

ఐఓఎస్ 13లో పీఎస్4, ఎక్స్‌బాక్స్ వన్ కంట్రోలర్స్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలో యూజర్లు తమ వద్ద ఉంటే ఆయా కంట్రోలర్స్‌ను ఐఫోన్లకు పెయిర్ చేసి గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ తెరపై కనిపించే కంట్రోల్స్ కాకుండా సదరు కంట్రోలర్స్ పైన ఉండే కంట్రోల్స్‌ను ఉపయోగించుకుని సులభంగా గేమ్స్ ఆడుకోవచ్చు.

22. యాప్ సబ్‌స్క్రిప్షన్ వార్నింగ్

ఐఓఎస్ 13లో ఏదైనా యాప్‌కు యూజర్ సబ్‌స్ర్కైబ్ అయి ఉంటే ఆ యాప్‌ను డిలీట్ చేసిన సందర్భంలో ఫోన్ యూజర్‌కు సబ్‌స్క్రిప్షన్ ఉందని చెబుతూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో యూజర్ ఆ యాప్‌ను డిలీట్ చేయకుండా జాగ్రత్త పడవచ్చు.

23. అన్‌డు ఫీచర్

ఐఓఎస్ 13లో పలు యాప్స్‌లో ఫోన్‌ను షేక్ చేస్తే అన్‌డు ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే నోట్స్ యాప్‌లో అయితే మూడు చేతి వేళ్లను రెండు సార్లు తెరపై ట్యాప్ చేస్తే అన్‌డు ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

24. బ్లూటూత్ ప్రైవసీ సెట్టింగ్

ఐఓఎస్ 13లో సెట్టింగ్స్‌లోని ప్రైవసీ విభాగంలో కొత్తగా బ్లూటూత్ మెనూ చేర్చారు. ఇందులోకి వెళ్లి ఫోన్‌లో ఏయే యాప్స్ బ్లూటూత్‌ను వినియోగించుకుంటున్నాయో తెలుసుకోవచ్చు. అదే మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్ యాప్స్ అయితే బ్లూటూత్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లూటూత్ ఆడియో యాక్ససరీల ద్వారా ఆడియో వినేటప్పుడు ఆ ఆప్షన్‌ను ఆయా యాప్‌లకు ఎనేబుల్ చేస్తేనే ఆడియో వినేందుకు వీలు కలుగుతుంది. కనుక ఈ ఆప్షన్‌ను డిసేబుల్ చేసే ముందు ఒక్కసారి ఏయే యాప్‌లకు బ్లూటూత్ అవసరమో చెక్ చేసుకోవాలి.

25. క్యాలెండర్ అటాచ్‌మెంట్స్

ఐఓఎస్ 13లో క్యాలెండర్ యాప్‌లో యూజర్లు ఏదైనా ఈవెంట్‌కు గాను అటాచ్‌మెంట్లను యాడ్ చేసుకోవచ్చు.

2127
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles