e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home సూర్యాపేట సాగుకు సన్నద్ధం

సాగుకు సన్నద్ధం

సాగుకు సన్నద్ధం
  • వానకాలం పంట ప్రణాళిక సిద్ధం
  • ఎరువులు, విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు
  • నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 18,42,892 ఎకరాల్లో సాగు అంచనా
  • గతేడాది కంటే పెరుగనున్న పంటల విస్తీర్ణం
  • నల్లగొండలో అధికంగా పత్తి, సూర్యాపేటలో వరి

వానకాలం సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు కానుంది.. ఎన్ని విత్తనాలు, ఎరువులు అవసరం పడుతాయో అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులకు ఇబ్బందులు లేకుండా అవసరాలు తీర్చనుంది. గత పాలకులకు భిన్నంగా ప్రభుత్వం వ్యవసాయానికి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నది. కృష్ణా, గోదావరి, మూసీ నదులతోపాటు చెరువులు,కుంటలు, బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో సాగు విస్తీర్ణం ప్రతియేటా పెరుగుతున్నది. ఈ వానకాలంలో సూర్యాపేట జిల్లాలో 6,27,539 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 12,15,357 పంట సాగు చేయనున్నట్లు ప్రణాళిక సిద్ధం చేశారు. రెండు జిల్లాల్లో కలిపి గతేడాది కంటే లక్ష ఎకరాలు అదనంగా సాగయ్యే అవకాశం ఉందని అధికారుల అంచనా. సూర్యాపేటలో అత్యధికంగా 4,25,527 ఎకరాల్లో వరి, నల్లగొండ జిల్లాలో 8,10,000 ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నారు. ఇప్పటికే 58 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా ప్రణాళిక మేరకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

సాగుకు సన్నద్ధం


సూర్యాపేట, మే 5 : సమైక్య రాష్ట్రంలో వర్షాలు వస్తే కానీ ఏ పంటలు వేయాలి, ఎంత వేయాలి అని నిర్ణయించేవారు. అధికారులు సైతం అదేవిధంగా వ్యవసాయ సాగు ప్రణాళికలు సిద్ధం చేసేవారు. కానీ, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకూ నీరు అందుతున్నది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కృష్ణా, గోదావరి, మూసీ నీటితో రెండు పంటలకు నీరు అందిస్తున్నారు. రైతులు ఆ నీటిని సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నారు. పంట పెట్టుబడి కోసం ముందుగానే ప్రభుత్వం రైతుబంధు ఇస్తుండడంతో అప్పులు తెచ్చే బాధ లేకుండా పోయింది. దీంతో రైతులు సైతం ఉత్సాహంగా పంటలు సాగు చేస్తున్నారు. అదే స్థాయిలో అధికారులు పంటల ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసి రైతులకు అండగా నిలుస్తున్నారు. ఈక్రమంలో 2021 వానకాలం సాగుకు సంబంధించి అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.
గతేడాది కన్నా ఎక్కువ..
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 18,42,892 ఎకరాల్లో పంటలు సాగుచేయనున్నట్లు అంచనా వేయగా, సూర్యాపేట జిల్లాలో 6,27,539 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 12,15,357 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నారు. రెండు జిల్లాల్లో 2020 వానకాలం సీజన్‌తో పోల్చితే ఈసారి సాగు విస్తీర్ణం పెరుగనున్నది. గత వానకాలం సూర్యాపేట జిల్లాలో 5,91,743 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, నల్లగొండ జిల్లాలో 11,54,994 ఎకరాల్లో సాగు చేశారు. సాగుకు అవసరమైన ఎరువులను సైతం అధికారులు ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా తీసుకొవచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సూర్యాపేట జిల్లాకు ఐదు రకాల ఎరువులు కలిపి 1,73,263 మెట్రిక్‌ టన్నులు అవసరం ఉండగా, నల్లగొండ జిల్లాకు 2,79,057 మెట్రిక్‌ టన్నులు కావాల్సి ఉంది. సూర్యాపేట జిల్లాలో సుమారు 20 వేల మెట్రిక్‌ టన్నులు, నల్లగొండ జిల్లాలో 38 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సాగు ప్రారంభం నాటికి అవసరమైన మిగతా ఎరువులు తెప్పించనున్నారు.
సూర్యాపేటలో వరి.. నల్లగొండలో పత్తి సాగు
సూర్యాపేట జిల్లాలో వరి అధికంగా సాగవుతుండగా నల్లగొండ జిల్లాలో పత్తి సింహాభాగంలో సాగవుతుంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 6,27,539 ఎకరాల్లో మొత్తం పంటలు సాగవనున్నాయని అంచనా వేయగా కేవలం వరి సాగే సుమారు 3.80లక్షల ఎకరాలు ఉండనున్నది. కానీ, ఈ సంఖ్య 4.20 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని మరో అంచనా వేస్తున్నారు. గత ఏడాది సుమారు 4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి 1.85లక్షల ఎకరాల్లో సాగైంది. నల్లగొండ జిల్లాలో 12,15,357 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 8.10 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా వరి సాగు 3,65,000 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఆరు తడి పంటల సాగుకు ముందుకు రావాలి
ప్రస్తుతం నీళ్లు అధికంగా ఉండడంతో రైతులు ఎక్కువగా వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. కానీ, ఆరుతడి పంటలకు సైతం మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. రైతులు ఆరుతడి పంటలు వేసేందుకు ముందుకు రావాలి. గత ఏడాది జిల్లాలో సాగైన పంటల ఆధారంగానే ఈ సారి పంటల ప్రణాళిక సిద్ధం చేశాం. పంటలకు అనుగుణంగా ఎరువుల డిమాండ్‌ను సైతం లెక్కిస్తున్నాం. సాగుకు ముందు వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని పంటలు వేయాలి.
రామారావు నాయక్‌ , వ్యవసాయాధికారి, సూర్యాపేట జిల్లా

సాగుకు సన్నద్ధం
సాగుకు సన్నద్ధం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సాగుకు సన్నద్ధం

ట్రెండింగ్‌

Advertisement