పని కల్పనలో నల్లగొండ జిల్లా సెకండ్
మూడో స్థానంలో సూర్యాపేట
ఉమ్మడి జిల్లాలో 2.73లక్షల మందికి ఉపాధి
స్పెషల్ డ్రైవ్‌లతో లాక్డౌన్ వేళ ఊరట
పని ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు
కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న జనానికి ఊళ్లోనే ఉపాధి దొరుకుతున్నది. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేలా అధికారులు చేపడుతున్న చర్యలతో ఉమ్మడి జిల్లాలో 2,73,386 మందికి ప్రయోజనం చేకూరుతున్నది. ఉపాధి హామీ పనులు కల్పించడంలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా రెండో స్థానంలో, సూర్యాపేట మూడో స్థానంలో ఉన్నాయి.
సూర్యాపేట, మే 26 : కరోనా విస్తరిస్తున్న వేళ పట్టణాల్లో ఉపాధి లేక చాలా మంది గ్రామాలకు తిరిగి వచ్చారు. వారికి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం వరంగా మారింది. ప్రతి రోజు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 2.73 లక్షలకు పైగా కూలీలు ఉపాధి పొందుతున్నారు. పట్టణాల్లో ఉండి ఉపాధి పొందే వారు ఇప్పుడు గ్రామాలకు వచ్చి ఉంటున్నారు. ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తూ వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నది ప్రభుత్వం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పుడు ఉపాధి హామీలో సుమారు 2,73,386 మంది ప్రతి రోజు ఉపాధి కూలీకి వెళ్తున్నారు. నల్లగొండ జిల్లాలోని 844 గ్రామ పంచాయతీల పరిధిలో 3,70,006 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా 8,69,724 మంది కూలీలుగా ఉన్నారు. కరోనా కాలంలో ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా 1,26,8672 మంది కూలీలకు పని కల్పిస్తున్నది. గత నెల రోజులుగా ప్రతి రోజు సుమారు లక్ష మందికి పైగా అధికారులు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రంలోనే ఉపాధి కల్పనలో రెండో స్థానంలో నిలిచింది. సూర్యాపేట జిల్లాలో 2,61,197 మంది కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా సుమారు 6,08,608 మంది కూలీలు ఉన్నారు. ఇక్కడ కూడా సుమారు 1,10.628 మంది రోజు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారు. సూర్యాపేట జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సుమారు 40 వేల మంది ఉపాధి పనులకు వచ్చేలా చేశారు. ఈ నెల 20న 70 వేల మంది కూలీలు ఉపాధి పనికి పోగా ఆ సంఖ్య ఇప్పుడు 1.10 లక్షలకు చేరింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,55,553 మంది కుటుంబాలకు జాబ్‌కార్డులుండగా 3,36,295 మంది కూలీలు ఉండగా ప్రతి రోజు 35,891 మందికి కూలీ కల్పిస్తూ రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచారు.
భౌతిక దూరం పాటిస్తూ
ఉపాధి కూలీలు పనిచేసే చోట మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పనిచేసుకుంటున్నారు. వేసవి కావడంతో చెరువుల పూడికతీత, ఫీడర్ చానల్, వ్యవసాయ భూముల శుభ్రం చేయడం వంటి పను లు చేయిస్తున్నారు. గ్రామాల్లో కరోనా తో అందరూ ఇంటి పట్టునే ఉంటుండగా రోజువారీగా పనులకు పోయే వారు మాత్రం ఉపాధి కూలీకి పోతు జీవనం గడుపుతున్నారు. లాక్డౌన్ కాలంలో ఉపాధి హామీ ఇప్పుడు కూలీల బతుకులు మారుస్తున్నది.
ఉపాధి పొందుతున్న కూలీల సంఖ్య
జిల్లా పంచాయతీలు ఉపాధి పొందుతున్న కూలీలు
నల్లగొండ 844 1,26,867
సూర్యాపేట 475 1,10,628
యాద్రాది భువనగిరి 421 35,891
ప్రతి ఒక్కరికీ పని కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
కరోనా సమయంలో చాలా మంది గ్రామాలకు వచ్చారు… గతేడాదే చాలా మందికి ఉపాధి కార్డులు ఇచ్చాం. ప్రతి ఒక్కరికీ పని కల్పించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రతి రోజు లక్ష మందికైన ఉపాధి కల్పించే అవకాశం జిల్లాలో ఉంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా పనులు చేయిస్తున్నాము. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యచరణ నిర్వహిస్తున్నాము.