e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home సూర్యాపేట గెలిసాయ్

గెలిసాయ్

గెలిసాయ్

‌సూర్యాపేట, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : 47వ జాతీయ కబడ్డీ పోటీలు గురువారం ముగిశాయి. బాలుర విభాగంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌), బాలికల విభాగంలో హర్యానా జట్లు చాంపియన్‌గా నిలిచాయి. గురువారం సాయంత్రం హోరాహోరీగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో బాలురకు చెందిన ఉత్తరప్రదేశ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జట్లు ఫైనల్‌కు చేరగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ జట్టు 27 పాయింట్లు, స్పోర్ట్స్‌ అథారిటీ జట్టు 51 పాయింట్లు సాధించించగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జట్టు 24 పాయింట్లతో విజయం సాధించింది. అలాగే బాలికల విభాగంలో ఫైనల్‌ మ్యాచ్‌లో హర్యానా, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జట్లు ఫైనల్‌కు చేరగా హర్యానా జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హర్యానా జట్టు 43 పాయింట్లు సాధించగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జట్టు 35 పాయింట్లు సాధించించగా హర్యానా జట్టు 8 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతి గోల్డ్‌ మెడల్‌తో పాటు రూ.3 లక్షల నగదు, ద్వితీయ బహుమతిగా సిల్వర్‌ మెడల్‌, రూ.1.50లక్షల నగదు, తృతీయ బహుమతిగా కాంస్య మెడల్‌, రూ.75వేల నగదు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు కాంస్య మెడల్‌, రూ.50వేల నగదును రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అందించారు.
ఉత్కంఠ రేపిన సెమీ ఫైనల్స్
47వ జాతీయ స్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీలు ఆధ్యంతం ఉత్కంఠతను రేపాయి. గురువారం సాయంత్రం నాలుగోరోజు జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఉత్తరప్రదేశ్‌ వర్సెస్‌ తమిళనాడు బాలుర మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ 58, తమిళనాడు 33పాయింట్లు సాధించగా 25పాయింట్లతో ఉత్తరప్రదేశ్‌ గెలుపొందింది. అలాగే హర్యానా వర్సెస్‌ సాయి బాలుర మ్యాచ్‌లో హర్యానా 25పాయింట్లు, సాయ్‌ 50పాయింట్లు సాధించగా 25పాయింట్ల తేడాతో సాయ్‌ జట్టు గెలుపొందింది. హర్యానా వర్సెస్‌ చండీగఢ్‌ బాలికల మ్యాచ్‌లో హర్యానా 66, చండీగఢ్‌ 25 సాధించగా 41పాయింట్ల తేడాతో హర్యానా గెలుపొందింది. బాలికల విభాగంలో సెమీ ఫైనల్‌లో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జట్టు వర్సెస్‌ మహారాష్ట్ర మధ్య జరిగిన పోటీలో సాయ్‌ జట్టు విజేతగా నిలిచి ఫైనల్‌కు వెళ్లింది.
కర్నల్‌ సంతోష్‌బాబు జ్ఞాపకార్థం ప్రోత్సాహకం..
సూర్యాపేట ముద్దుబిడ్డ, దేశం కోసం ప్రాణాలర్పించిన కర్నల్‌ సంతోష్‌బాబు జ్ఞాపకార్థం అతని తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్‌ 47వ జాతీయ కబడ్డీ పోటీల్లో గెలుపొందిన బాల, బాలికల జట్లకు రూ.50వేల చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు.

50 ఏండ్ల చరిత్రలో తొలిసారి..
50 ఏండ్ల కబడ్డీ చరిత్రలోనే హైదరాబాద్‌ను దాటి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను తొలిసారిగా మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో తన తల్లి సావిత్రమ్మ స్మారకార్థం సూర్యాపేటలో కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించారు. తొలిరోజు గ్యాలరీ కూలి చిన్నపాటి అపశృతి జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో వెంటనే తేరుకొని క్రీడలను ప్రారంభించారు. అమెచ్యూర్‌ కబడ్డీ అసోసియేషన్‌, ప్రోకబడ్డీలతో పాటు ఇంటర్నేషనల్‌ కబడ్డీ స్టాండర్డ్స్‌లో నిర్వహించడంతోపాటు వసతి, భోజన సదుపాయాల ఏర్పాట్ల పట్ల దేశ వ్యాప్తంగా ఆయా రాష్ర్టాల నుంచి వచ్చిన కబడ్డీ నిష్ణాతులు కితాబిచ్చారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు… లేజర్‌ షో
కబడ్డీ పోటీల ముగింపు ఉత్సవాలు ఎంతగానో అలరించాయి. ప్రముఖ ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌ బీ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన లేజర్‌ షో ఆకట్టుకుంది. తెలంగాణ చరిత్రనే ఇతివృత్తంగా ఐదు నిమిషాలపాటు చూపించగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాతృమూర్తి గుంటకండ్ల సావిత్రమ్మ గురించి కొంత సమయం చూపించారు. అనంతరం ప్రముఖ డ్యాన్స్‌ అకాడమీలు గంగు రాఘవ, వీరు బృందాలు చేసిన డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లు వీక్షకులను కట్టిపడేశాయి. అనంతరం స్టేడియం పక్కన భారీ పటాకులు కాల్చడంతో వినువీధిలో వెదజల్లిన రంగురంగుల మిరుమిట్ల కాంతులు వీక్షకులను అబ్బురపరిచాయి. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్‌, బొల్లం మల్లయ్యయాదవ్‌, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, గుజ్జ దీపిక, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితానంద్‌, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, శాప్‌ చైర్మన్‌ ఆలె వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ మారిపెద్ది శ్రీనివాస్‌, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, మంత్రి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి జగదీశ్‌యాదవ్‌, గుజ్జ యుగంధర్‌రావు, బెల్లంకొండ రాంచందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గెలిసాయ్

ట్రెండింగ్‌

Advertisement