e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home సూర్యాపేట మనస్సున్న మారాజులు

మనస్సున్న మారాజులు

మనస్సున్న మారాజులు
  • కరోనా కష్ట కాలంలో అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థలు
  • నిత్యావసర వస్తువులు, ఆహార ప్యాకెట్ల పంపిణీ
  • పేదలు, రోగులకు మందులు, వైద్య సహాయం
  • మానవతా దృక్పథంతో ముందుకొస్తున్న దాతలు
  • నిర్విరామంగా సేవా కార్యక్రమాలు

సూర్యాపేట, మే 24 (నమస్తే తెలంగాణ) :కరోనా కష్టకాలంలో మేమున్నాంటూ పలు స్వచ్ఛంద సంస్థలతోపాటు సంఘాలు పేదలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. కొవిడ్‌ బారిన పడిన వారి ఇంటికే వెళ్లి ఆహారం, నిత్యావసర వస్తువులు, మందులు తదితర వాటిని సమకూర్చుతున్నాయి. దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి, ఐసొలేషన్‌లో ఉన్న వారికి, రోగుల సహాయకులకు నిత్యం అన్నదానాలు కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్‌లో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో సేవామూర్తులు ప్రతిరోజూ సాయం చేసేందుకు చొరవ చూపిస్తున్నారు. మానవత్వం బతికే ఉందని నిరూపిస్తున్నారు.

డ్రైఫ్రూట్స్‌, శానిటైజర్ల అందజేత
కోదాడ రూరల్‌, మే 24 : కరోనా బారిన పడి హోం ఐసొలేషన్‌లో ఉంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సద్గురు బోధానంద చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు ఉచితంగా ఆహార ప్యాకెట్లు, పౌష్టిహాకారం అందిస్తున్నారు. ఒక బ్యాగులో ఒక వ్యక్తికి 12 రోజులకు సరిపడా జీడీపప్పు, బాదం, కిస్మిస్‌, ఖర్జూరా, శనగలు, పల్లీలు, మాస్క్‌లు, శానిటైజర్స్‌ ఉన్నాయి. కరోనాతో ఇబ్బందులు పడుతున్నవారు చల్లా అశోక్‌ 9848510069, బోనాల సైదారావు 8019111174, శ్రీనివాసరావు 9246988442, వంగవీటి నాగరాజు 9848231562 నంబర్లను సంప్రదించాలని సభ్యులు తెలిపారు.

అంజన ఫౌండేషన్‌ ద్వారా
కోదాడ, మే 21 : కోదాడ పట్టణానికి చెందిన కంచుకొమ్మల శంకర్‌ అంజన ఫౌండేషన్‌ను స్థాపించి పేదలకు సాయం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇప్పటికి 25 కుటుంబాలకు 10 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా బాధితులు ఫోన్‌ చేస్తే వెంటనే కావాల్సిన అవసరాలు తీర్చుతున్నారు. తన ఇంటి వద్ద భోజన ప్యాకెట్లు తయారు చేసి అనాథలు, యాచకులకు అందిస్తున్నారు. తనతోపాటు దాతలు అందించే సహకారంతోనే చేస్తున్నానని శంకర్‌ తెలిపారు.

అయ్యప్ప దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యాన్నదానం
రామగిరి, మే 24 : నల్లగొండలోని రామగిరి శ్రీహరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్వాహకులు పేదలు, కరోనా బాధితులకు నిత్యం అన్నదానం చేస్తున్నారు. ఆలయ చైర్మన్‌ కొలనుపాక రవికుమార్‌, గురుస్వామి నోముల శ్యామ్‌, కలిశాన్‌ అశోక్‌, ప్రధానార్చకులు బి.మహేశ్‌శర్మ(శివ) తమ సొంత ఖర్చులతోపాటు దాతల సహకారంతో భోజనం అందిస్తున్నారు. దేవస్థానంలో అన్నం తయారు చేసి వాటిని ప్యాకింగ్‌ చేసి పంపిణీ చేస్తున్నారు. వాటితోపాటు మజ్జిగ, వాటర్‌ బాటిల్స్‌ కూడా ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ వరకు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

వాసవి క్లబ్స్‌ ఆధ్వర్యంలో..
నల్లగొండలోని వాసవి క్లబ్స్‌ ఆధ్వర్యంలో పట్టణంలో విధుల్లో ఉన్న పోలీసులకు నిత్యం భోజనం, మజ్జిగ, వాటర్‌ బాటిల్స్‌ అందిస్తున్నారు. పేదలతోపాటు, హోంఐసొలేషన్‌ ఉన్న కరోనా బాధితులకు కూడా భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలను వాసవి క్లబ్‌ కేసీజీఎఫ్‌ నల్లగొండ, వాసవి గ్రేటర్‌ క్లబ్‌, వాసవి వనితా కలిసి నిర్వహిస్తున్నాయి. అలాగే ఆర్యవైశ్య ప్రముఖులు పారేపల్లి శ్రీనివాస్‌, కాచం ఫౌండేషన్‌ సభ్యులు కూడా ఇందులో భాగ్యస్వామ్యమవుతున్నారు.

రోజూ 250 మందికి ఆహారం
కొవిడ్‌ బాధితులకు అండగా ఎల్‌వీ సేవా సంస్థ
రామగిరి, మే 24 : నల్లగొండ పట్టణానికి చెందిన ఎల్‌వీ కుమార్‌ తన కుటుంబ సభ్యుల సహకారంతో ఎల్‌వీ సేవా సంస్థను స్థాపించి 25 ఏండ్లుగా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నదానం, రక్తదానంతోపాటు పేదలు, యాచకులకు నిత్యావసరాలు అందిస్తున్నారు.
కరోనా కాలంలో గతేడాది నుంచి కొవిడ్‌ బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటున్నారు. ప్రస్తుతం రోజుకు 250 మందికి భోజనం ప్యాకెట్లు చేసి అందిస్తున్నారు. అవసరమైన వారికి మెడిసిన్‌తోపాటు శానిటైజర్లు, మాస్కులు కూడా ఇస్తున్నారు. నల్లగొండతోపాటు హైదరాబాద్‌లోనూ వీరి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

ఫోన్‌ చేస్తే ఇంటికే ఫుడ్‌
కరోనా బాధితులు మధ్యాహ్నం 12 గంటలలోపు 9848050321 నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఇంటికే వచ్చి భోజనం సరఫరా చేస్తున్నారు. మధ్యాహ్నం కోడి గుడ్డు, అన్నం, రెండు రకాల కూరగాయలు, సాంబర్‌, పెరుగు, పచ్చడితో కూడిన భోజనం అందిస్తున్నారు. రాత్రి వీటితోపాటు రొట్టె కూడా అదనంగా ఇస్తున్నారు.

నిత్యం పేదల సేవలోనే..
నా సోదరుడు లకుమారపు శ్రీనివాస్‌, మా కుటుంబ సభ్యులంతా కలిసి ఎల్‌వీ సేవా సంస్థను 1996లో స్థాపించాం. నిరంతర సేవా కార్యక్రమాల్లో మా మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. కరోనా కాలంలో మాస్కులు, శానిటైజర్లు ఉచితంగా ఇచ్చాం. కొవిడ్‌ బాధితులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రస్తుతం నల్లగొండలో 250మందికి, హైదరాబాద్‌లో 350మందికిపైగా నిత్యం భోజనాలు, రొట్టెలు పంపిణీ చేస్తున్నాం.

  • ఎల్‌వీ కుమార్‌, చైర్మన్‌, ఎల్‌వీ సేవా సంస్థ, నల్లగొండ

కరోనాను జయించి రోగుల సేవలో..
నేను కరోనా బారిన పడి ఇటీవల కోలుకున్నా. ఎవరు కూడా కరోనాతో ఇబ్బందులు పడకూడదని నా కుమారుడు కీ.శే.గండూరి ప్రీతంజోనా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల వద్ద రోగుల సహాయకులతోపాటు పేదలకు ప్రతిరోజూ ఆహారం అందిస్తున్నాం. కరోనా వచ్చిన వారిని దూరం పెట్టకుండా వారికి చేతనైన సాయం చేయాలి. ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయాన్ని అందిస్తూ ఆత్మైస్థెర్యం నింపాలి. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, కరోనా నిబంధనలు పాటించాలి.

  • గండూరి ప్రకాశ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు, సూర్యాపేట
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మనస్సున్న మారాజులు

ట్రెండింగ్‌

Advertisement