e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home సూర్యాపేట సొంత వైద్యం డేంజర్‌

సొంత వైద్యం డేంజర్‌

సొంత వైద్యం డేంజర్‌
  • డ్రగ్స్‌ రెసిస్టెన్స్‌ పెరిగితే ప్రమాదంటున్న నిపుణులు
  • దీర్ఘకాలిక రోగులు డాక్టర్లను సంప్రదించాలని సూచన

నేరేడుచర్ల, మే 12 : సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలతో కొందరు ముందస్తుగా కరోనా నివారణ కోసం అడ్డగోలుగా మందులు వాడుతున్నారు. ఒకరి ప్రిస్క్రిప్షన్‌ మీద మరొకరు మందులు కొనుగోలు చేసుకుని సొంతంగా వాడుతున్నారు. మరి కొంతమంది సాధారణ దగ్గు, జలుబు ఉన్నా భయంతో మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు తెచ్చుకుంటున్నారు. వైద్యుల సూచనలు, సలహాలు లేకుండా వాడుతున్న వారిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఏ మందు అయినా అవసరం మేరకే వాడాలి. అంతే కానీ ప్రివెంటివ్‌(వ్యాధి నివారణ ప్రక్రియలు) పేరుతో మందులు విచ్చలవిడిగా వాడితే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అపోహలతో సొంత వైద్యం : మొదటి వేవ్‌ సమయంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌, మీజిల్స్‌-రూబెల్లా వ్యాక్సిన్‌, ఐవర్‌మెక్టిన్‌, లొపినావీర్‌-50, రిటోనావీర్‌-200 వంటి మందులను వైద్యరంగానికి చెందిన వారు సైతం వాడారు. అప్పట్లో వ్యాక్సిన్‌ లేదు. కాబట్టి ముందస్తుగా వాడారు. కానీ నేడు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కొందరు వాటినే వాడుతున్నారు.

ఇక ఇటలీలో కరోనా రోగికి పోస్టుమార్టం చేశారని, రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్స్‌కు ఆస్పిరిన్‌ వాడితే సరిపోతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ఎక్కువ మంది ఆస్పిరిన్‌, ఎకోస్పైన్‌ మందులను వాడేస్తున్నారు. ఇక కొంతమంది విటమిన్‌ సీ, డీ, జింక్‌ మందులను రెగ్యులర్‌గా వేసుకుంటున్నారు. ఒకరి ప్రిస్క్రిప్షన్‌ మరొకరు : కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగికి వైద్యులు రాసిన మందులను స్నేహితులు, సన్నిహితులు పాజిటివ్‌ వచ్చినప్పుడు వైద్యులు సూచన లేకుండానే వాడేస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా ఆ మందుల వివరాలను తీసుకుని మందుల షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. వాస్తవంగా వ్యక్తి ఆరోగ్య పరిస్థితి దీర్ఘకాలిక వ్యాధులను పరిగణలోకి తీసుకుని మందులు వాడాల్సి ఉంది. అలా కాకుండా మధుమేహం ఉన్నవారు సైతం స్టెరాయిడ్స్‌ వాడుతుండడంతో వారి పరిస్థితి విషమిస్తోంది. అంతేకుండా కొన్ని రకాల మందులతో డ్రగ్‌ ఎలర్జీలకు సైతం గురవుతున్నారు.

నష్టాలే ఎక్కువ : వైరస్‌ సోకినప్పుడు మాత్రమే యాంటీ వైరల్‌ డ్రగ్‌ను వాడాలని వైద్యులు చెబుతున్నారు. లేకుంటే వెయిట్‌లాస్‌, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అజిత్రోమైసిన్‌ వంటి యాంటిబయాటిక్‌ మందులు ఎక్కువగా వాడితే గుండెపై ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా యాంటిబయాటిక్‌ మందులు ఎక్కువగా వాడటం ద్వారా శరీరంలో డ్రగ్‌ రెసిస్టెన్స్‌ పెరిగి, జబ్బు చేసినప్పుడు ఆమందులు పని చేయకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు.

వైద్యుల సూచనల మేరకే మందులు వాడాలి
ఇప్పటి వరకు కరోనా చికిత్స కోసం ప్రభుత్వం సూచించిన ఐసీఎంఆర్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే వైద్యం చేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వారు కొవిడ్‌ పరీక్ష చేయించుకున్న అనంతరమే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. ఇష్టారాజ్యంగా మందులు తెచ్చుకొని వాడకూడదు. అలామందులు వాడితే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కరోనా నుంచి రక్షించేంది టీకా మాత్రమే. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి. మాస్క్‌ ధరించడంతోపాటు స్వీయ నియంత్రణ పాటించాలి.

  • నాగయ్య, వైద్యాధికారి, నేరేడుచర్ల
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సొంత వైద్యం డేంజర్‌

ట్రెండింగ్‌

Advertisement