e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home సూర్యాపేట యండ్లపల్లి యమ మారింది..

యండ్లపల్లి యమ మారింది..

యండ్లపల్లి యమ మారింది..

సూర్యాపేట రూరల్‌, జూన్‌ 11 : రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని యండ్లపల్లి ఎంతో అభివృద్ధి సాధించింది. సర్కారు ప్రతి నెలా అందిస్తున్న నిధులతో ఏండ్ల సమస్యలను పరిష్కరించుకుంది. పచ్చదనం పెంపుతోపాటు, పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తూ గ్రామస్తులు సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు.

మారిన రూపు
గ్రామంలో 4,196 మంది జనాభా, 3,682 మంది ఓటర్లు ఉన్నారు. గత ప్రభుత్వాల కాలంలో చెత్తాచెదారంతోపాటు అస్తవ్యస్త రోడ్లు, వీధుల్లో పారే మురుగుతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతో గత రూపురేఖలే మారిపోయాయి.

30 రోజుల కార్యక్రమంతో..
30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామంలో పాత బావులను పూడ్చివేశారు. రోడ్ల వెంట ఉన్న పాత ఇండ్లు, పిచ్చి మొక్కలు, పెంట దిబ్బలు తొలగించారు. ప్రమాదకరంగా ఉన్న 40 విద్యుత్‌స్తంభాలను తీసివేసి కొత్తవి ఏర్పాటు చేశారు. వేలాడుతున్న విద్యుత్‌ వైర్లను సరిచేసి వీధుల్లో ఎల్‌ఈడీ లైట్లు బిగించారు. దీంతో గ్రామం సుందరంగా మారింది.

కనువిందు చేస్తున్న పల్లె ప్రకృతివనం
సుమారు ఎకరం ప్రభుత్వ స్థలంలో హరితహారం కోసం నర్సరీలో మొక్కలు పెంచుతున్నారు. దీనితోపాటు పండ్లు, పూల మొక్కలతో పల్లె ప్రకృతి వనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఇందులో కూర్చోవడానికి సిమెంట్‌ బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. డంపింగ్‌ యార్డుతోపాటు సెగ్రిగేషన్‌ షెడ్‌ను కూడా నిర్మించారు. వైకుంఠధామాన్ని కూడా అన్ని సౌకర్యాలతో పూర్తి చేశారు. ఇక పంటల సాగు, దిగుబడి, మార్కెటింగ్‌ తదితర వాటిపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన రైతు వేదిక నిర్మాణం పూర్తయ్యింది. ఇవన్నీ గ్రామానికి కొత్తదనం తీసుకొచ్చాయి.

పారిశుధ్యానికి ప్రాధాన్యం
గ్రామంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంతేగాక ఇంకుడు గుంతలను నిర్మించేలా ప్రోత్సహించారు. ఇక పంచాయతీకి ప్రభుత్వం అందించిన ట్రాక్టర్‌ ద్వారా సిబ్బంది ఇంటింటికీ వచ్చి చెత్త సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతి ఇంటికీ అందించిన తడి, పొడి చెత్త బుట్టలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. గ్రామంలో వీధులన్నీ సీసీ రోడ్లుగా మార్చారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చారు. ఎక్కడా అపరిశుభ్రత లేకుండా పాలకవర్గ సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు.

అందరి భాగస్వామ్యంతోనే..
పల్లె ప్రగతి కార్యక్రమంతోనే మా గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. నర్సరీ, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, సెగ్రిగేషన్‌ షెడ్‌, డంపింగ్‌ యార్డు వంటి పనులను వేగవంతంగా పూర్తి చేశాం. ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల భాగస్వామ్యంతోనే ఇదంతా చేయగలిగాం.
-దండి సుగుణమ్మ, సర్పంచ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యండ్లపల్లి యమ మారింది..

ట్రెండింగ్‌

Advertisement