కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం ఎంతో అవసరం. కరోనా వచ్చిన వారిని చూస్తూ చాలామంది మానసికంగా ఆందోళన చెందుతుంటారు. అలా కాకుండా మనసును ఇతర పనుల్లో నిమగ్నం చేసి ఉంచాలి. ఖాళీ సమయాల్లో తోచిన పని చేస్తూ ఉండాలి. వ్యాయామం చేస్తే పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. దీంతో మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
3-4 లీటర్ల నీరు తాగాలి
నెగెటివ్ వచ్చిన తర్వాత పూర్తిగా కోలుకునేందుకు వారం పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. తగినంత నీరు తాగుతూ శరీరానికి ఎప్పటికప్పుడు నీరందిస్తూ ఉండాలి. రోజులో కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. దీంతోపాటు కొబ్బరినీరు, నిమ్మరసం, గ్లూకోజ్ తరచూ తీసుకుంటూ ఉండాలి.
నెగెటివ్ రాగానే.. వ్యాయామం వద్దు
కొవిడ్ ప్రభావం అన్నింటికన్నా ఎక్కువగా ఊపిరితిత్తులపైనే ఉంటుంది. అందుకే అవి ఆరోగ్యంగా ఉండేలా తగిన వ్యాయామం చేయాలి. ఇందుకు యోగా, ప్రాణాయామం ఉత్తమమైనవి. ప్రాణాయామంతో శ్వాసకు సంబంధించిన నాడులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. అలాగని నెగెటివ్ వచ్చిన వెంటనే వ్యాయామం మొదలు పెట్టకూడదు. దీంతో ఆరోగ్యం బాగుపడటం పక్కన పెడితే దెబ్బతినే అవకాశమే ఎక్కువ. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలి. బీపీ, షుగర్ స్థాయి పరీక్షించుకోవాలి. అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే వ్యాయామం మొదలుపెట్టాలి.
పంచదార తగ్గించండి
వ్యాయామంతో పాటు సమతుల ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. తినే ఆహారంలో కార్బొహైడ్రేట్స్, విటమిన్లు, తగిన పాళ్లలో ఉండేలా చూసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. పచ్చని కూరలు, ఉసిరి, నిమ్మ, ఆరెంజ్ తదితర విటమిన్ ‘సీ’ ఎక్కువగా ఉండే పండ్లు అధికంగా తినాలి. జంక్‌ఫుడ్, వేపుళ్లకు దూరంగా ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు పంచదార వాడకూడదు. దీనికి బదులు న్యాచురల్ షుగర్ ఉండే పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.