ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Suryapet - Jan 27, 2021 , 00:33:58

సూర్యాపేటను అగ్రస్థానంలో నిలుపుదాం

సూర్యాపేటను అగ్రస్థానంలో నిలుపుదాం

  • రిపబ్లిక్‌ డే వేడుకల్లో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట, నమస్తే తెలంగాణ, జనవరి 26 : ప్రభుత్వ పథకాలను పేదలకు అందించి సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుదామని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంగళవారం పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రగతిని వివరించారు. జిల్లాలో వ్యవసాయ రంగం ఎంతో పురోగతి సాధించిందని, మిషన్‌ భగీరథ, మెడికల్‌ కళాశాల, మినీ ట్యాంక్‌బండ్‌లు త్వరలోనే పూర్తిచేసి ప్రజలకు అందిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లతోపాటు సబ్సిడీ రుణాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు   తెలిపారు. 

వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం

ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. యాసంగిలో 4.48లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి 2.58లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లు చెప్పారు.  రైతుబంధు ద్వారా 2.40లక్షల మంది రైతులకు రూ.303కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతుబీమా పథకంలో భాగంగా 1502మంది నామినీల ఖాతాల్లో రూ.75.10కోట్లు జమచేసినట్లు తెలిపారు. 560 నీటి వనరుల్లో రూ.2.70కోట్ల చేప పిల్లలను వదిలినట్లు చెప్పారు. పశు సంవర్థక శాఖ ద్వారా 16,800మందికి రూ.186కోట్లతో 3.52లక్షల గొర్రెలు పంపిణీ చేసినట్లు తెలిపారు. 

మిషన్‌ కాకతీయతో సస్యశ్యామలం.. 

మిషన్‌ కాకతీయ ద్వారా 905 చెరువుల్లో రూ.343కోట్ల అంచనాతో 801పనులు పూర్తి చేశామన్నారు. మిషన్‌ భగీరథ పనులు దాదాపు పూర్తిచేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామన్నారు. గోదావరి జలాలతో 2.14లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చిందని తెలిపారు. 556 చెరువులను నింపినట్లు వెల్లడించారు. 

మెడికల్‌ కళాశాల జిల్లాకు వరం 

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాల జిల్లాకు వరం లాంటిందని చెప్పారు. రూ.450 కోట్లతో 890మంది సిబ్బందితో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు కాగా ప్రస్తుతం ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరంలో 150మెడికల్‌ సీట్లు భర్తీ చేసినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 7820మందికి కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రూ.8.34కోట్లతో 1262 వ్యవసాయ ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రహదారుల మరమ్మతులకు రూ.28.73కోట్లు కేటాయించినట్లు వివరించారు. కరోనా కారణంగా ఈసారి శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేదు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్‌, ఎస్పీలతోపాటు అధికారులు సందర్శించారు. అనంతరం ఉద్యోగులకు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ భాస్కరన్‌, అదనపు కలెక్టర్‌ పద్మజారాణి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, డీఆర్‌డీఓ కిరణ్‌కుమార్‌, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

VIDEOS

logo