యాసంగి వరి..చేద్దామిలా సరి

- చలి, చౌడు కారణంగా
- ఎదుగని పొలాలు
- జింక్, సల్ఫైడ్ లోపంతో
- సమస్య మరింత తీవ్రం
- కాండం తొలిచే
- పురుగుతోనూ ప్రమాదం
- మందుల పిచికారీ,
- యాజమాన్య పద్ధతులు
- పాటించాలంటున్న శాస్త్రవేత్తలు
గరిడేపల్లి, జనవరి 18 : వరి ప్రస్తుతం కొన్నిచోట్ల దుబ్బు వచ్చే దశలో ఉంది. ఈ పంటలో అనేక రకాల సమస్యలు వస్తుండడంతో రైతులకు ఏమి చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు. సాధారణంగా గతంలో యాసంగి వరి నారును అనురాధ కార్తె వచ్చిన తర్వాతే పోసి 25 రోజుల తర్వాత నాటేవారు. కానీ రైతులు బోర్లు, బావులను ఏర్పాటు చేసుకోవడం, నీరు సమృద్ధిగా ఉండడంతో నెల రోజుల ముందుగానే నాట్లు వేస్తున్నారు. దీంతో చలి, చౌడు కారణంగా పలు రకాల సమస్యలు వచ్చి పంట సక్రమంగా ఎదుగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ కొందరైతే నాటుపెట్టిన పొలాన్ని మళ్లీ దున్ని కొత్తగా నాట్లు వేస్తున్నారు. పంటలో వచ్చిన లోపాన్ని నిశితంగా పరిశీలించి, దానిని గుర్తించి తగిన మందులను పిచికారీ చేసుకోవాలని, సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరిలో ఎదురవుతున్న సమస్యలను సరిచేసుకునేందుకు రైతులు అనుసరించాల్సిన విధానాలను గడ్డిపల్లి కేవీకే పంటల విభాగం శాస్త్రవేత్త దొంగరి నరేశ్ వివరించారు.
జింక్ లోపం, సవరణ
జింక్ లోపం వల్ల మొక్కలో పైనుంచి మూడు లేదా నాలుగు ఆకుల్లో మధ్య ఈనె పాలిపోతుంది. ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురు ఆకు చివరలో మధ్య ఈనెకు ఇరుపక్కలా తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనపడుతాయి. ఆకులు చిన్నవిగా, పొలుసుగా మారుతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. దీని సవరణకు ప్రతి యాసంగి సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్సల్ఫేట్ వేసుకోవాలి. పైరుపై జింక్ లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి ఐదురోజుల వ్యవధిలో రెండు, మూడుసార్లు పిచికారీ చేయాలి. జింక్సల్ఫేట్ ద్రావణంలో పురుగు/తెగుళ్ల మందులు కలుపకూడదు. చౌడు నేలల్లో తప్పనిసరి పిచికారీ చేసుకోవాలి.
చలి ప్రభావం, యాజమాన్యం..
ప్రస్తుతం వరిపంట దుబ్బు చేసే దశలో ఉంది. రాత్రి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల (5- 15.5 డిగ్రీ సెంటిగ్రేడ్), గాలిలో అధిక తేమశాతం (90-100) వల్ల వరిపైరు సరిగ్గా ఎదుగక ఎర్రబడి చనిపోతుంది. వరి ప్రధాన పొలంలో వీలైనచోట మాత్రమే రాత్రివేళల్లో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి కొత్తనీరు పెట్టాలి. చలి ప్రభావం వల్ల మొక్క భూమి నుంచి పోషకాలను తీసుకోలేదు. నీటిలో కరిగే పోషకాలను పైపాటుగా పిచికారీ చేయాలి. ఒక లీటర్ నీటికి పది గ్రాముల 19ః19ః19, ఐదు గ్రాముల ఫార్ములా -4 పోషకాలను వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. వీటి తర్వాత యూరియాతోపాటు కార్బండిజమ్, మాంకోజెబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి. కాండం తొలిచే పురుగు.. సమగ్ర యాజమాన్యంయాసంగి వరిలో కాండం తొలుచే పురుగు ప్రధానమైనది. దీనిని మనం మొగి పురుగు లేదా తెల్లకంకి లేదా ఊసపోటు అని పిలుస్తాం. ఈ పురుగు వరిని మూడు దశల్లో ఆశిస్తుంది. నారుమడి దశ, పిలకదశ, చిరుపొట్ట దశ, నారుమడి, పిలక దశలో ఆశించినప్పుడు మొవ్వులు ఎండి చనిపోతాయి. అదే విధంగా అంకురం నుంచి చిరుకంకి దశ వరకు ఆశించినప్పుడు ఈనిన తర్వాత తెల్లకంకులు బయటకు వస్తాయి. ముఖ్యంగా ఇది ఆలస్యంగా, ముదురు నారు నాటడం, రాత్రి తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం, సూర్యరశ్మి రోజుకు ఏడు గంటల కంటే ఎక్కువ ఉన్న పరిస్థితిలో ఈ కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి రెక్కల పురుగులు ముదురు గోధుమ రంగులో ఉండి ముందు జత రెకలపై నల్లరంగు మచ్చలు కలిగి ఉంటాయి. ఇవి నారుమడిలోనే నారు కొసలపై గుడ్లు పెడతాయి. ఇవి పొదిగి ప్రధాన పొలంలో నష్టం చేస్తాయి. సమగ్ర యాజమాన్యంలో భాగంగా నారు పీకడానికి వారం రోజుల ముందు రెండు గుంటల నారుమడికి 800 గ్రాముల కార్బొఫ్యూరాన్ 3 జీ గుళికలు చల్లి ఆ మడిలో ఇంకిపోయేలా చేయాలి. ముదురు నారు నాటితే నారుకొనలను తుంచాలి. దీంతో గుడ్ల సముదాయాన్ని ప్రధాన పొలంలోకి రాకుండా అరికట్టవచ్చు. ఆ తర్వాత పిలకలు, దుబ్బు చేసే దశలో ఎకరాకు 3 జీ గుళికలను 10 కేజీల చొప్పున లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి, లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఎస్పీ మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాండం తొలిచే పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలను ఎకరాకు 5-6 పెట్టుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంకురం నుంచి చిరుపొట్టదశలో క్లోరాంథలినిపోల్ ఎస్పీ 0.3 మి.లీ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీని 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావం సల్ఫైడ్ దుష్ప్రభావం యాసంగిలో ఎక్కువగా కన్పిస్తుంది. దీని వల్ల పెరిగిన వరి అక్కడక్కడ గుంపులు, గుంపులుగా పసుపు వర్ణంలోకి మారుతుంది. అలా అయిన చోట మట్టి మెత్తగా ఉండి కాలితో తొక్కితే లోతుగా పోతుంది. అలాగే బుడగలుగా గాలి బయటకు రావడంతో పాటు చెడు వాసన వస్తుంది. దీనికి గల ప్రధాన కారణాలు పొలం నీటిముంపునకు గురి కావడం, వేర్లకు గాలి అందకపోవడం. వీటితోపాటు కాంప్లెక్స్ ఎరువు వేయడం, అమ్మోనియం సల్ఫేట్, 20-20-0-13 మోతాదుకు మించి వాడడంతో ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు పంట కన్నా ముందు 1-2 లోడ్లు ఎర్రమట్టి వేసుకోవాలి. పంట పొలంలో దీని ప్రభావం కనిపిస్తే ఉన్న మురుగు నీటిని బయటకు తీసి ఆరబెట్టి మొక్కల వేర్లకు గాలి అందేలా చేయాలి. తదుపరి కొత్త నీరు బెట్టుకోవాలి. కాంప్లెక్స్ ఎరువులు (సల్ఫేట్ కలిగినవి) వీలైనంత తగ్గించుకోవాలి. సేంద్రియ ఎరువులు వాడకం చేపట్టాలి. పంటలపై సూక్ష్మపోషకాలు 2-3 సార్లు 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే నేలలో వేసే సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని వర్మీకంపోస్ట్లో కలిపి వేసుకుని నివారించుకోవచ్చు.
తాజావార్తలు
- రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: మహేష్
- వరుసగా మూడో రోజూ 18 వేల కరోనా కేసులు
- రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే
- కొల్లూరి చిరంజీవి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- మద్యం మత్తులో తండ్రిని చంపిన తనయుడు
- ఆర్ఆర్ఆర్ టీంతో కలవనున్న అలియా.. !
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు చిరంజీవి కన్నుమూత
- అమెరికన్ యోధులతో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫైట్