శుక్రవారం 05 మార్చి 2021
Suryapet - Jan 14, 2021 , 01:12:45

కల్యాణ వైభవం

కల్యాణ వైభవం

  • ఘనంగా గోదాశ్రీనివాసుడి కల్యాణోత్సవం 
  • పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు

ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బుధవారం వైష్ణవాలయాల్లో గోదారంగనాయకుల కల్యాణోత్సవం నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సూర్యాపేటలోని వేంకటేశ్వరాలయంలో జరిగిన గోదాశ్రీనివాస కల్యాణోత్సవంలో మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు, నల్లగొండలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి దంపతులు పాల్గొని పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

బొడ్రాయి బజార్‌, జనవరి 13 : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాల్లో భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి, గోదాదేవీ సమేత శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ప్రధానార్చకుడు నల్లాన్‌ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, నల్లాన్‌ చక్రవర్తుల మురళీధరాచార్యుల ఆధ్వర్యంలో కల్యాణ వేడుకను కనుల పండువగా జరిపించారు. స్వస్తివాచనం, అనంతరం విశ్వక్సేనపూజతో కల్యాణతంతు ప్రారంభించి మాంగల్యధారణ గావించారు. ముఖ్య అతిథిగా హాజరైన విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, సునీత దంపతులు స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు సూర్యాపేట అని అన్నారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, ఐష్టెశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అంతకుముందు మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు ఊరేగింపుగా దేవాలయానికి తీసుకెళ్లగా వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, నాగమణి దంపతులు, అదనపు కలెక్టర్‌ పద్మజారాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితా ఆనంద్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, కౌన్సిలర్లు మొరిశెట్టి సుధారాణి శ్రీనివాస్‌తో పాటు హరిచరణ్‌ ఆచార్యులు, సునీల్‌కుమార్‌, పవన్‌కుమార్‌, శ్రీహరి, హరికుమార్‌, సంతోష్‌ ఆచార్యులు పాల్గొన్నారు.

పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి

సూర్యాపేట టౌన్‌, జనవరి 13: పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. భోగి పర్వదినం పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడుతూ జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతే అందుకు ముఖ్య కారణమని కొనియాడారు. 24గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాతో మొదలు పెట్టి రైతుబంధు, రైతు బీమా వంటి విప్లవాత్మక పథకాలు పెట్టిన ఘనత కేసీఆర్‌దే అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి, కనుమ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. 

సుఖసంతోషాలతో జరుపుకోవాలి..

రామగిరి, జనవరి 13: శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి, కనుమ పండుగలను సంతోషాలతో ప్రజలు జరుపుకోవాలని కోరారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


VIDEOS

logo