ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Suryapet - Dec 17, 2020 , 01:21:47

58.62 కిలోమీటర్లు.. రూ.2,054 కోట్లు

58.62 కిలోమీటర్లు.. రూ.2,054 కోట్లు

  • నాలుగు లైన్లుగా సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి 
  • తీరనున్న ఇబ్బందులు

నిత్యం రద్దీగా ఉండే ఖమ్మం- సూర్యాపేట రహదారి నాలుగు లైన్ల రోడ్డుగా మారనున్నది. 56.62 కిలోమీటర్ల గల ఈ రోడ్డుకు రూ. 2,054 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే భూ సేకరణ పూర్తి కాగా, పలుచోట్ల రోడ్డు నిర్మాణం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 

- సూర్యాపేట 

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలకు వెళ్లాలంటే సూర్యాపేట టు ఖమ్మం మీదుగా చాలామంది ప్రయాణం కొనసాగిస్తారు. దీంతో వందలాది వాహనాలతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ రోడ్డును జాతీయ రహదారిగా మార్చాలని అనేకమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 12,000 పీసీయూ (పాసిజర్‌ కార్‌ యూనిట్‌) ఉన్న ఈ రోడ్డును రెండేళ్ల క్రితం నాలుగు లైన్ల జాతీయ రహదారిగా మార్చేందుకు అనుమతినిచ్చారు. జాతీయ రహదారి 365 బీబీగా పిలిచే ఈ రోడ్డు సూర్యాపేట మండలం టేకుమట్ల నుంచి ఖమ్మం జిల్లా కేంద్రం వరకు 58.62 కిలోమీటర్ల మేర ఉన్నది. ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2,054 కోట్లు కేటాయించింది. అదానీ గ్రూప్స్‌ కాంట్రాక్టు పనులు చేజిక్కించుకుంది. 

సూర్యాపేటకు తగ్గనున్న వాహనాల రద్దీ 

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలో సూర్యాపేట వద్ద నుంచే ఖమ్మం జిల్లాకు వెళ్తారు. దీంతో సూర్యాపేట పట్టణానికి వాహనాల రద్దీ విపరీతంగా ఉన్నది. నిత్యం వేలాది వాహనాలు పట్టణం మధ్యలో నుంచి వెళ్తుంటాయి. ప్రస్తుతం సూర్యాపేట పట్టణానికి సమీపంలోని టేకుమట్ల వద్ద ఉన్న హైదరాబాద్‌- విజయవాడ రహదారి వద్ద రోడ్డు కట్‌ అయి చివ్వెంల మండలం వట్టిఖమ్మం పహాడ్‌ గ్రామ స్టేజీ వద్ద ఖమ్మం రోడ్డును కలువనున్నది. ఈ నిర్మాణం పూర్తయితే వాహనాలు మొత్తం సూర్యాపేట పట్టణ శివారు నుంచి వెళ్లనున్నాయి.

21న వర్చువల్‌ ద్వారా ప్రారంభం  

గతేడాది నుంచి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. కరోనా వల్ల 5నెలలు పనులు నిలిచిపోయాయి. అప్పుడే అధికారికంగా పనులు ప్రారంభించాల్సి ఉండగా ఆలస్యమవడంతో ఈనెల 21న కేంద్ర భూ ఉపరితల రవాణాశాఖ మంత్రి నితీన్‌గడ్కరీ ఢిల్లీ నుంచి వర్చువల్‌ ద్వారా అధికారికంగా పనులు ప్రారంభించనున్నారు. రెండురోజుల్లో పూర్తిస్థాయి సమాచారం అందుతుందని ప్రాజెక్టు డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

ఆరు లైన్లకు సరిపడా భూ సేకరణ 

సూర్యాపేట-ఖమ్మం రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నారు. కానీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని 6 లైన్లకు సరిపడా భూమిని సేకరించారు. గతేడాదే భూ సేకరణను పూర్తిచేశారు. దాదాపుగా 150కోట్లతో సుమారు 800ఎకరాలు సేకరించారు. ఈ రోడ్డు నిర్మాణం పాత రోడ్డులోని  కేవలం నాలుగుగ్రామాల నుంచి మాత్రమే రోడ్డు వెళ్తున్నది. మిగిలిన రోడ్డు మొత్తం బైపాస్‌ ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు 49 సర్వీస్‌ రోడ్లు, సూర్యాపేట -దంతాలపల్లి, సూర్యాపేట -జనగాం రోడ్డు వద్ద ఫ్లై ఓవర్‌ను నిర్మించనున్నారు.

VIDEOS

logo