సోమవారం 25 జనవరి 2021
Suryapet - Nov 30, 2020 , 02:54:39

నేడు పున్నమి వెలుగులో రాములోరి కల్యాణం

నేడు పున్నమి వెలుగులో రాములోరి కల్యాణం

  • అనేక విశిష్టతలు కలిగిన కోదండ రామస్వామి ఆలయం

మునగాల : నవమి రోజు రాములోరి కల్యాణం నిర్వహించడం విదితమే. కానీ, పౌర్ణమి రోజు నిండు వెన్నెల వెలుగులో రాములవారి కల్యాణం జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మండలంలోని నర్సింహపురం కోదండరామ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కార్తిక మాసం రోజు రాత్రిపూట ఆరుబైట శ్రీరాముడి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఆసూరి మరిగంటి అప్పలదేశకుల రచనల్లో తెలిపిన చరిత్ర ఆధారంగా కల్యాణం నవమి రోజు మధ్యాహ్నం నిర్వహించడంతో చంద్రభగవానుడు రాములవారిని స్వామి నీవు మధ్యాహ్నం సమయంలో  కల్యాణం జరుపుకోవడంతో నేను వీక్షించె భాగ్యం కలుగలేదు. మీ కల్యాణం చూడాలని కోరికగా ఉందని, చూసే భాగ్యం కల్పించాలని రాముల వారిని కోరాడట. చంద్రుడి కోరిక మేరకు రామచంద్రమూర్తి కార్తిక పౌర్ణమి నాడు నిండు చంద్రుడి సమక్షంలో ఆరుబయట కల్యాణ మండపంలో పెళ్లి జరిగేట్లు వరమిచ్చాడట. దీంతో ఎక్కడా లేనివిధంగా రాములోరి కల్యాణం కేవలం నర్సింహపురంలోనే, అదీ కార్తిక పౌర్ణమి రోజునే జరుగుతుంది. 

ఆలయం విశిష్టతలు.. 

  • అన్ని దేవాలయాల్లో రంగనాయక స్వామి పడుకొని ఉంటే ఇక్కడ నిలుచొని ఉంటాడు. 
  • పౌర్ణమి రోజు రాముడి  కల్యాణం జరిగె ఏకైక ఆలయం ఇదే. 
  • ఈ ఆలయంలో రాముడు, లక్ష్మణుడు, సీతల విగ్రహాలు మాత్రమె ఉంటాయి. హనుమంతుడి  విగ్రహం లేకపోవడం ఆశ్చర్యం. 
  • కోనేరులోని నీరు కొబ్బరి నీటిని తలపించేలా తీపిగా ఉంటాయి. మహానంది నీటి కంటే పూర్వం ఎంతో స్వచ్ఛంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. 
  • కోనేరు నీరు కోనేరులో ఉన్నప్పుడు వెచ్చగాగాను, వెలుపలకు తీసిన తరువాత చల్లగా ఉంటుంది.  
  • కోనేరు నీరు స్వామివారి పాదాలను తాకుతాయి.  

కోనేరు ఆవశ్యకత..  

ఈ దేవాలనయానికి అనుకొని పెద్ద కోనేరు ఉంది. ఈ కోనేరు సాక్షాత్తు లక్ష్మణస్వామి బాణం వేయగా ఏర్పడిందని దేశకుల వారి కవిత్వంలో గుర్తించబడింది. కోనేరు నుంచి దేవాలయం లోపల ఉష్ణజలం, బయట చల్లటి నీరు వచ్చేదని వారి రచనలో రాయబడింది. కోనేరు నీటి ద్వారా దేశికులు పంటలను పండించుకునేవారని ప్రతీతి.    

దాతల సహకారంతోనే కల్యాణం..  

కోదండ రామస్వామికి కీసర వంశస్తులు 800ఎకరాలు ఇచ్చినా నేడు రెవెన్యూ రికార్డుల్లో కేవలం  కొన్ని ఎకరాలు మాత్రమే ఉంది. దానిని సేద్యం చేస్తున్న వారు కౌలు సక్రమంగా ఇవ్వకపోవడంతో దాతల సహకారంతో కల్యాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి స్వామివారి ఆస్తిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.  

నాడు ఘనం.. నేడు శిథిలం.. 

ఆలయం గతంలో ఎంతో ఘనంగా ఉండేది. నేడు ఆదరణ కోల్పోతుంది. చాలా మందికి ఆలయ విశిష్టత తెలియదు. ప్రస్తుతం కోనేరు నీరు అశుభ్రంగా ఉంటుంది. గ్రామస్తులు కోనేరు ప్రాంతంలో చెత్తాచెదారం పోస్తుండడమే కాకుండా బహిర్భూమికి సైతం నీటిని వాడుతున్నారు. గర్భగుడికి వెళ్లే నీరు ఇప్పుడు పోవడం లేదు. ఇప్పటికైనా గత చరిత్రను వెలికితీసి భావితరాలకు అందించాలని పలువురు కోరుతున్నారు.    

కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి 

ఆలయంలో నేడు నిర్వహించే కల్యాణానికి ఏర్పాట్లు పూర్తిచేశాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తుగా అన్ని సౌకర్యాలు కల్పించాం. పౌర్ణమి రోజున రాములోరి కల్యాణం నిర్వహించే ఏకైక ఆలయం ఇది. కల్యాణానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలి. 

- కుక్కడపు శ్రీనివాస్‌, ఆలయ చైర్మన్‌  logo