ఆదివారం 24 జనవరి 2021
Suryapet - Nov 28, 2020 , 02:41:01

‘ముసురు’కుంది

‘ముసురు’కుంది

  • కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో  మోస్తరు వర్షం   
  • పలు గ్రామాల్లో నేలవాలిన వరిచేలు 

కోదాడ రూరల్‌ : బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో శుక్రవారం కోదాడ నియోజవర్గ వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ముసురు పెట్టింది. వర్షంతోపాటు భారీగా చలిగాలులు వీయడంతో  ప్రజలు బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. తుఫాన్‌ ముప్పుపై రాష్ట్రప్రభుత్వం, స్థానిక అధికారులు ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. కోదాడ మండల పరిధిలోని పలువురు రైతులు కోత మిషన్లతో వరి కోసి ధాన్యాన్ని  కొనుగోలు కేంద్రాలకు తరలించడంతో రంగు మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కోదాడ, ఎర్రవరం, చిమిర్యాల, కాపుగల్లు పీఏసీఎస్‌ చైర్మన్లు ధాన్యం కేంద్రాలను పరిశీలించారు. పలు గ్రామాల్లోని వందల ఎకరాల్లో వరి నేలవాలింది. తుఫాన్‌తో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. 

హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో.. 

హుజూర్‌నగర్‌ రూరల్‌/మఠంపల్లి/మేళ్లచెర్వు : తుఫాన్‌ ప్రభావంతో రెండ్రోజులుగా హుజూర్‌నగర్‌ మండల వ్యాప్తంగా ముసురు పెట్టింది.  రైతులు ధాన్యం రాశులపై పట్టాలు కప్పినప్పటికీ వర్షం నీరు రాశుల చుట్టూ చేరకుండా కాల్వలు తీసి మట్టికట్టలు పోసుకున్నారు. మఠంపల్లి మండలంలో 470ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లినట్లు ఏఓ బుంగా రాజు తెలిపారు. ధాన్యం రాశులు, పంట కోతలు చివరి దశలో ఉండడంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మేళ్లచెర్వు మండల వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు మోస్తరు జల్లులు కురిశాయి. మండలంలో 22.8మి.మీ. వర్షం నమోదైనట్లు అధికారులు తెలిపారు.  

ధాన్యం రాశులు, పంటపొలాల పరిశీలన 

నేరేడుచర్ల/పాలకవీడు : నేరేడుచర్ల మండలంలో కోతలు చివరి దశకు చేరాయి. ఇప్పటికే చాలా మంది రైతులు పంట కోసి ధాన్యాన్ని అమ్ముకోగా నిల్వ చేసుకుందామని ఆరబెట్టుకున్న రైతులు ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు. శుక్రవారం మండల వ్యవసాయాధికారి వీరభద్రారావు పలు గ్రామాల్లో పర్యటించి ధాన్యం రాశులు, వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. స్థానిక వ్యవసాయ కార్యాలయంతోపాటు మండలంలోని మేడారం, పెంచికల్‌దిన్న ఐకేపీ కేంద్రాల్లో పట్టాలు సరఫరా చేయడంతో ధాన్యం రాశులపై కప్పారు. మండలంలో 9మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తుఫాన్‌ కారణంగా పాలకవీడు మండలంలోని పలు గ్రామాల్లో వరిపొలాలు నేలవాలాయి. 

రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే బొల్లం  కోదాడటౌన్‌ : నివర్‌ తుఫాన్‌తో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ సూచించారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుఫాన్‌తో నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఇలాంటి సమయంలో రైతులు పొలాలను కోయవద్దని సూచించారు. వరి కోసి ధాన్యం రాశులు పోసిన రైతులు టార్పాలిన్లతో కప్పి భద్రపర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను నేల పాలు చేసుకోవద్దని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. వాతావరణంలో భారీ మార్పులు సంభవిస్తున్నందున వృద్ధులు, పిల్లలు ఇళ్లలోంచి బయటకు రాకుండా ఉండాలని సూచించారు. వాతావరణం చల్లగా ఉండడంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున మాస్క్‌ లేకుండా బయటకు రావద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఏమైనా సమస్యలు తలెత్తితే అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.  రైతులు ఎట్టిపరిస్థితుల్లో ఇబ్బందులకు గురి కావద్దని, ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.logo