నివర్ కలవరం

- తరుముకొస్తున్న అతి తీవ్ర తుఫాను
- ఉమ్మడి జిల్లాకు భారీ వర్ష సూచన
- మార్కెట్లలో భారీగా ధాన్యం నిల్వలు
- అప్రమత్తమైన యంత్రాంగం
నష్ట నివారణ చర్యలకు కలెక్టర్ల ఆదేశంఅక్టోబర్లో వరుస వర్షాలు ముంచెత్తగా.. తాజాగా మరో తుఫాను గండం పొంచి ఉన్నది. ‘నివర్' తుఫాను ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతాంగాన్ని కలవరపెడుతున్నాయి. ఓ వైపు సన్నధాన్యం వరి కోత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకోవైపు మార్కెట్లలో పెద్దమొత్తంలో ధాన్యం రాశులు నిల్వ ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ‘తుఫాన్ ప్రభావం ఏ స్థాయిలో ఉన్నా
ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం.. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయడంతో పాటు
ఉద్యోగులకు సెలవులు రద్దు చేశాం’ అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. నేడు, రేపు
రైతులు వరి, పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా టార్పాలిన్లు కప్పి భద్రంగా ఉంచుకోవాలని
నల్లగొండ జిల్లా కలెక్టర్ పీజే పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు.
సూర్యాపేట, నమస్తే తెలంగాణ : బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ జిల్లా రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రస్తుతం చేతికి వస్తుండగా.. మరోపక్క కోసిన పంటలు కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో భారీగా నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావం ఏ స్థాయిలో ఉన్నా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతుంది. ్ర ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు, ఉద్యోగులకు సెలవులు రద్దు చేశామని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు.
పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడుపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుందని, తెలంగాణలో కూడా ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. రెండు, మూడ్రోజులపాటు తుఫాన్ ప్రభావం ఉంటుందన్న సమాచారంతో తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు. తుఫాన్‌తో పంటలకు నష్టం వాటిల్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాసులపై టార్పాలిన్లు రైతులకు ముందస్తుగా సూచిస్తున్నారు.
మంగళవారం నుంచే అప్రమత్తం
నివర్ తుఫాన్ వస్తుందన్న సమాచారంతో మంగళవారం నుంచే అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎంతటి కురిసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తుఫాన్ నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం.
- సూర్యాపేట జిల్లా కలెక్టర్
మార్కెట్‌కు ధాన్యం, పత్తి తేవద్దు
వాతావరణ శాఖ సూచన మేరకు నేడు, రేపు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రైతులు ధాన్యం, పత్తిని విక్రయించేందుకు మార్కెట్‌కు తేవద్దు. ఈ రెండ్రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు బంద్ చేస్తున్నారు. ధాన్యం, పత్తి తడవకుండా టార్పాలిన్లు కప్పి జాగ్రత్తలు తీసుకోవాలి.
- ప్రశాంత్ జీవన్ పాటిల్, నల్లగొండ జిల్లా కలెక్టర్
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు