అధికారులు అప్రమత్తంగా ఉండాలి

- నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
- సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి
సూర్యాపేట : జిల్లాలో బుధ, గురువారం భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాల మేరకు భారీ వర్షాల వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదలు వాటర్‌లాగింగ్, చెట్లు, విద్యుత్ స్తంభాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. జలాశయాలు, ప్రవాహాలు పొంగిపోర్లుతూ లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని, చిన్న వంతెనలు, కాజ్‌వేలు పొంగిపొర్లుతాయని, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఏమైనా సంఘటనలు జరిగితే వెంటనే సమాచారం తెలియజేయాలన్నారు. రైతులు తమ పొలాల వద్ద గల ధాన్యం రాశులు, బస్తాలు తడువకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు వేయాలన్నారు. రోడ్లపై, పొలాల్లో ఆరబోసిన ధాన్యం, రైస్ మిల్లులకు తీసుకెళ్లే ధాన్యం తడువకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.