గురువారం 26 నవంబర్ 2020
Suryapet - Nov 21, 2020 , 01:23:47

పంచాయతీల్లో ఆస్తుల లెక్క పక్కా

పంచాయతీల్లో ఆస్తుల లెక్క పక్కా

  • 1319 పంచాయతీల్లో  ముగిసిన ఆస్తుల నమోదు
  • సూర్యాపేట 92, నల్లగొండలో 87 శాతం పూర్తి
  • వంద శాతం పూర్తి చేసేందుకు త్వరలోనే మరో విడుత సర్వే

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : గ్రామ పంచాయతీల్లో వ్యవసాయేతర ఆస్తుల లెక్కలు పక్కాగా చేసి ఎన్‌పీబీ(నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీ బుక్‌)లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నెలరోజుల పాటు  గ్రామాల్లో పంచాయతీ పాలక వర్గాల సహకారంతో పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి ఎన్‌పీబీ యాప్‌లోకి అప్‌లోడ్‌ చేశారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలో 92 శాతం, నల్లగొండ జిల్లాలో 87 శాతం పూర్తయింది. సూర్యాపేట జిల్లాలో మొత్తం 2,54, 330 ఆస్తులు ఉంటే 2,33,509 ఇళ్ల వివరాలు వచ్చాయి. నల్లగొండ జిల్లాలో 3,82,533 ఆస్తులకు 3,36,419 వివరాలు వచ్చాయి. వివిధ కారణాలతో సూర్యాపేటలో 20,821, నల్లగొండలో 46, 114 ఆస్తుల వివరాలను ఎన్‌పీబీలో నమోదు చేయలేదు. ప్రతి గ్రామ ముఖ చిత్రం ఈ యాప్‌లో ఉండడంతో భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన విష యం విదితమే. గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ యాప్‌ అధికారిక రికార్డు కానుంది. ఈ యాప్‌లోని వివరాలతోనే ప్రభుత్వానికి ఏ సమాచారం కావాలన్నా అధికారులు వెంటనే పంపనున్నారు. కాగా వందశాతం నమోదు చేసేందుకు త్వరలోనే మరోదఫా గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నారు.

1319 పంచాయతీల్లో వంద శాతం    

     సూర్యాపేట జిల్లాలో 475, నల్లగొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీల పరిధిలో వంద శాతం ఆస్తుల నమోదు పూర్తయింది. తొలిసారిగా ప్రభుత్వం పల్లెల్లో చేపట్టిన ఆస్తుల నమోదుతో గ్రామాల్లో ఏ ఆస్తి ఎంత పక్కాగా తేలింది. గత నెల మొదటి వారం నుంచి చేపట్టిన ఈ కార్యక్రమం ఈ నెల 5తో ముగిసింది. తొలుత గ్రామ పంచాయతీల్లో ఆస్తులకు సంబంధించి ఆ యా పంచాయతీల్లో ఉన్న మాన్యువల్‌ రికార్డుల వివరాలను  పుస్తకాల్లోకి ఎక్కించారు. ఇక్కడి నుంచి ఎన్‌పీబీ యాప్‌లోకి ఈ వివరాలు అప్‌లోడ్‌ చేశారు. ఈ యాప్‌ ఆధారంగా పంచాయతీ సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి పరిశీలించి మళ్లీ వివరాలను పూర్తి స్థాయిలో ఎడిట్‌ ఆప్షన్‌ ద్వారా యాప్‌లో నమోదు చేశారు. ఈ పంచాయతీ పోర్టల్‌లో జిల్లాలోని ఇళ్ల వి వరాలు వచ్చాయి. పలు కారణాలతో మిగిత వాటిని ఎన్‌పీబీలో నమోదు చేయలేదు. అయితే మాన్యువల్‌ నుంచి ఈ పోర్టల్‌ అనంతరం ఎన్‌పీబీలో ఆస్తుల వివరాలు ఉండడం తో భవిష్యత్‌లో ఆస్తుల లెక్కకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పంచాయితీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

లెక్కకు రానివి 66,935  

ఎన్‌పీబీలో నమోదు కాని ఆస్తులు సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో మొత్తం 66,935 ఉండగా వీటిలో సూర్యాపేటలో 20,821, నల్లగొండలో 46, 114 గుర్తించారు. ఇతర ప్రాంతాల్లో ఉండి డోర్‌లాక్‌ చేసిన ఇళ్లు సూర్యాపేటలో 4,021 ఉండగా నల్లగొండలో14,320గా గుర్తించారు. అలాగే ఈ యాప్‌లో నమోదు చేయిస్తే భవిష్యత్‌లో ఏదైనా నష్టం జరుగుతుందనే అనుమానంతో సూర్యాపేటలో 225 మం ది ఇంటి యజమానులు తమ వివరాలు చెప్పడానికి నిరాకరించగా నల్లగొండలో 1,170మంది ఉన్నా రు. కాగా 2,494 ఇళ్లకు సంబంధించి సూర్యాపేట లో ఈ పంచాయతీ పోర్టల్‌ డబుల్‌ ఎంట్రీ కాగా నల్లగొండలో 8,491 కావడంతో ప్రస్తుతానికి వీటిని పరిశీలిస్తున్నారు. అలాగే సూర్యాపేటలో 10,065, నల్లగొండలో 11,668 ఓపెన్‌ ప్లాట్స్‌ ఉండడం, సూ ర్యాపేటలో 2,968, నల్లగొండలో 6522 ఇళ్ల వివరాలు ఇతర గ్రామా పంచాయతీల్లో ఉండడం, సూ ర్యాపేటలో 234, నల్లగొండలో 1064 ఇళ్లను కూల్చడంతో ఆ వివరాలు ఎన్‌పీబీలో చూపలేదు. ఇక 710 ఇళ్లకు సంబంధించి సూర్యాపేట, నల్లగొండలో 1477 ఇళ్లకు ఆయా కుటుంబాల మధ్య వివాదం కొన సాగుతుండడంతో వాటిని సైతం ఎన్‌పీబీలోకి తీసుకోలేదు.   

త్వరలోనే వంద శాతం పూర్తి చేస్తాం   

గ్రామాల్లో ఆస్తుల నమోదు త్వరలోనే వందశాతం పూర్తి చేస్తాం. ప్రభుత్వం నుంచి కూడా మూడు రోజుల క్రితం వంద శాతం పూర్తిచేయాలని ఆదేశాలు వచ్చాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న ప్లాట్లు గతంలో కొట్టాలు, గుడిసెలు ఉండి ఉంటాయి. అలాంటి వాటితో పాటు కూల్చివేసిన ఇళ్లను, ఇతర గ్రామాల రికార్డుల్లో ఉన్నవాటిని తొలగిస్తాం. యజమానులు స్థానికంగా ఉండకపోవడం, ఇళ్లకు తాళం వేసి ఉండడం, చాలా కారణాలతో జిల్లాలోని కొన్ని ఇళ్ల వివరాలను ఎన్‌పీబీలో నమోదు చేయలేదు. త్వరలోనే మరోసారి గ్రామాల్లో సర్వే నిర్వహించి వందశాతం పూర్తి చేస్తాం. ఎన్‌పీబీ అనేది పక్కాగా గ్రామ సమాచారం రికార్డుగా మారింది. ఏ గ్రామ వివరాలు కావాలన్నా వెంటనే తెలుస్తుంది. 

-యాదయ్య, డీపీఓ, సూర్యాపేట