మంగళవారం 24 నవంబర్ 2020
Suryapet - Nov 14, 2020 , 02:12:26

రైతు ఇంట ‘ధరణి’ కానుక

రైతు ఇంట ‘ధరణి’ కానుక

  • జోరుగా కుటుంబ సభ్యులపై భూ బదలాయింపు
  • సులభంగా, వేగంగా భూముల రిజిస్ట్రేషన్లు, పట్టాలు
  • గిఫ్ట్‌ డీడ్‌లకు పెరిగిన ఆదరణ
  • సంతోషం వ్యక్తం చేస్తున్న రైతు  కుటుంబాలు

రాష్ట్రంలో భూ సమస్యలకు చరమగీతం పాడేందుకు సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌ రైతుల ఇంట సంతోషాన్ని పంచుతోంది. గతంలో భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌కు ఏళ్ల తరబడి తిరిగినా కాని పని ఇప్పుడు నిమిషాల్లో అవుతోంది.  

వారసత్వ భూమి మార్పిడి కావాలంటే రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు, రెవెన్యూ ఆఫీసుకు తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ధరణితో ఈ సమస్యలన్నీ తీరిపోయాయి. తండ్రి నుంచి కొడుకుకు, కూతురుకు.. అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లకు గిఫ్డ్‌ డీడ్‌ చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో తాసీల్దార్‌ కార్యాలయాన్నీ రైతు కుటుంబ సభ్యులతో సందడిగా 

మారుతున్నాయి.  - మిర్యాలగూడ రూరల్‌

భారం పోయింది..

నా చెల్లెకు భూమి రిజిస్ట్రేషన్‌ చేసినందుకు సంతోషంగా ఉంది. గతంలో రిజిస్ట్రేషన్‌కు రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని, ఖర్చు అధికంగా అవుతుందని, మధ్యవర్తుల అవసరం ఉంటుందని భయపడ్డాం. ఇందుకే ఇన్ని సంవత్సరాలు ఆగాము. రైతుల కష్టాలు తెలుసుకనుక  సీఎం కేసీఆర్‌ కొత్త రిజిస్ట్రేషన్‌ విధానం తీసుకొచ్చిండు. ఇది మాలాంటి పేదలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఎమ్మార్వో ఆఫీసుకు రాగానే మా సంతకాలు, వేలిముద్రలు తీసుకున్నారు. డాక్యుమెంట్లు చూసిర్రు. ఆ తరువాత పావు గంటకే పని పూర్తయిందని చెప్పి నాపాస్‌ బుక్‌లోని భూమిని తీసేసి నా చెల్లె పాస్‌ బుక్‌లోకి ఎక్కించిర్రు. పట్టా కాగితాలు నా చెల్లె చేతికి ఇచ్చిన. మేము ఎంతో సంబురపడ్డాం. ఇన్నాళ్లు నాకు భారంగా తోచిన భూమి పట్టా చెల్లె చేతికి వెళ్లాక నా మనసు ఎంతో తేలికైంది. - నర్సమ్మ, బుబ్బారెడ్డిగూడెం, మిర్యాలగూడ 

అక్క నుంచి చెల్లెలికి..

మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెం గ్రామానికి చెందిన మద్దిమడుగు గురువయ్యకు ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డ నర్సమ్మ, చిన్నబిడ్డ సైదమ్మ. ఆయనకు ఎకరన్నర భూమి ఉంది. ఆ భూమి ఇద్దరికి సమానంగా ఇవ్వాల్సి ఉండగా పెద్ద బిడ్డ పేరున ఎక్కువ నమోదైంది. దీంతో అదనంగా పాస్‌బుక్‌లో నమోదైన భూమిని చెల్లెలికి రిజిస్ట్రేషన్‌ చేయించాలని సంవత్సరాల తరబడి కోరుతోంది. ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్‌ రిస్కుతోపాటు ఖర్చుతో కూడుకున్న పనని ఆగిపోయారు. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ సులభంగా అవుతుందని తెలిసి అక్కాచెల్లెళ్లిద్దరూ  తాసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకొన్న వారు అక్క పేరు మీద అదనంగా ఉన్న భూమిని చెల్లె పేరున కానుకగా రిజిస్ట్రేషన్‌ చేశారు. దీంతో వారు నూతన డాక్యుమెంట్లు తీసుకొని అనందంగా కార్యాలయం నుంచి వెనుదిరిగారు.

రోజంతా పట్టేది

ఇంతకు ముందు భూమి కొనుగోలు, అమ్మకం ఉన్నపుడు రోజంతా పని చెడిపోవాల్సి వచ్చేది. కానీ కొత్త పద్ధతి ద్వారా కొంచెం సేపట్లోనే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నరు. దూరం పోయే బాధ కూడా తప్పింది. ఎమ్మార్వో ఆఫీసులోనే రిజిస్ట్రేషన్‌, పట్టాలు చేసి ఇస్తున్నారు. ఇది రైతులు ఎంతో మంచిగుంది. 

- ఒంగూరి భారత్‌, సాక్షి, బసిరెడ్డి పల్లె, పెద్దవూర

మా ఆయన రాలేక నేను చేయించుకున్నా..

మేము మండలంలోని మురుపునూతల గ్రామంలో ఇటీవల 2.20 ఎకరాల భూమిని కొన్నాం. మా ఆయన రమేశ్‌ మధ్యప్రదేశ్‌లో కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. మా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే ఎంతో సమయం పడుతుంది. పది రోజులు సెలవు పెట్టి రావాలనుకున్నాడు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారు ధరణి పోర్టల్‌ ద్వారా తాసీల్దార్‌ ఆఫీసులో వెంటనే రిజిస్ట్రేషన్‌ అవుతుండటంతో నా పేరు మీదనే పట్టా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్తే వెంటనే రిజిస్ట్రేషన్‌ అయింది. మా ఆయనకు ఫోన్‌ చేసి రిజిస్ట్రేషన్‌ అయిపోయిందని చెప్పడంతో ఎంతో సంతోషపడ్డాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారు తీసుకొచ్చిన ఈ ధరణి చాలా బాగుంది.

- సిర్సవాడ జ్యోతి, గొట్టిముక్కల, చందంపేట

ఇంత తొందరైతదనుకోలే..

నాకు పెండ్లి చేసినప్పుడు మా నాన్న పనుసు కుంకుమ కింద అరెకరం ఇస్తనన్నడు.  తరువాత రిజిస్ట్రేషన్‌ చేయిస్తా రాబిడ్డా.. అని మస్తుసార్లు పిలిశిండు. కానీ అరెకరం రిజిస్ట్రేషన్‌కు వారం రోజులు తిరగాల్సి వస్తదని భయపడి నేనే బోలే. ఇగో ఇప్పుడు కేసీఆర్‌ సారు ధరణి పోర్టల్‌ తెచ్చిండని.. రిజిస్ట్రేషన్లు ఎమ్మటే అయితున్నయని ఆళ్లీళ్లు చెప్తుంటే విని.. గురువారం స్లాట్‌ బుక్‌ చేసుకొని మా నాన్నను, ఇద్దరు సాక్షులను తీసుకొని శుక్రవారం తాసీల్దార్‌ ఆఫీసుకు వచ్చిన. స్లాట్‌ బుకింగ్‌ పేపరు, ఆధార్‌ జీరాక్స్‌, రెండు ఫొటోలు, మా నాన్న పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌, ఫొటోలు, సాక్షుల ఆధార్‌ జీరాక్సులు తీసుకొని తాసీల్దార్‌ సారు 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ చేసి డాక్యుమెంట్లు చేతిల బెట్టిండు. ఇంత తొందరగా అయితదనుకోలే. పరేషాన్‌ అయిన. ఏది ఏమైనా సీఎం కేసీఆర్‌  రైతులకు శానా చేసిండు.. ఇంకా చేస్తున్నడు కూడా. ఆయన్ను నేనైతే ఎన్నడూ మరువ. 

-  రమావత్‌ జయమ్మ, అన్నారం, మిర్యాలగూడ 

అదో బ్రహ్మాండం అనుకునేది..  

గతంలో రిజిస్ట్రేషన్‌ అంటే అదో బ్రహ్మాండం అనుకునేది. ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుక్‌ చేసిన వెంటనే సులభంగా రిజిస్ట్రేషన్‌ అయిపోయేలా తెలంగాణ ప్రభుత్వం చేయడం ఆనందంగా ఉంది. రోజుల తరబడి పట్వార్ల చుట్టూ తిరగడం.. రిజిస్ట్రేషన్‌ కాడ ఎన్ని డబ్బులైతాయో, దళార్లు ఎంత తీసుకుంటరోనన్న బెంగలేదిప్పుడు. స్లాట్‌ బుక్‌ చేసుకున్నప్పుడే రిజిస్ట్రేషన్‌కు, మ్యుటేషన్‌కు, కొత్తపాస్‌బుక్‌కు మొత్తం ఆన్‌లైన్‌లో డబ్బులు కడితే సరిపోతుంది. మరెక్కడా ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకుండా చేసిన కేసీఆర్‌కు రైతులు కృతజ్ఞత చూపుతున్నారు. మా నాన్న నాకు 20గుంటల భూమిని గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా పట్టా చేసిండు. కేవలం అర్ధగంటలో రిజిస్ట్రేషన్‌ కావడంతో రైతులకు ఖర్చుతోపాటు, అధికారుల నుంచి ఇబ్బందులు తప్పాయి. 

-పొడిశెట్టి కవిత, అభంగాపురం, మాడ్గులపల్లి 

జర్రంతల జేసిచ్చిండు..

మా తండాలో 574 సర్వే నెంబర్‌లో 16 గుంటల జాగ కొన్న. రిజిస్ట్రేషన్‌ చేయించుకుందామని తండా నుంచి నలుగురం కలిసి పొద్దున్నే వచ్చినం. మీసేవలో బుకింగ్‌ చేసుకున్న కాయితాలు తాసీలాఫీసుల ఇచ్చినం. ఎమ్మార్వో సారు ఆటిని సూసి నాయి ఏలిముద్రలు, సంతకాలు పెట్టించుకుండు. సాక్షి సంతకాలు చేయించుకుని టక్క టక్క కంపీటర్ల గొట్టి జర్రసేపట్ల కాయితాలు చేతుల పెట్టిండు. కూసున్నంత సేపు పట్టలె నా యెమ్మటొచ్చినోళ్లు నోరెళ్ల బెట్టిర్రు. ‘అరె గిదేందే జగ్నా.. కాసేపట్ల పన్నయ్యింది..’ అంటున్నరు. నాకే ఇచిత్రం అయితుండే ఆళ్లకేం జెప్ప నేనిగ. కూసున్నంత సేపు పట్టలే జర్రంతల రిజిస్ట్రేషన్‌ అయిపోగొట్టి పాసుపుస్తకం నకలు ఇచ్చిండు. అప్పట్ల తండాలో పొలం అమ్మినా, కొన్నా యమ తిరుగుడుండేది. ఆడ బోను.. ఈడ బోను.. ఆనికి పైసలియ్య.. ఈన్ని బతిలాడ.. అబ్బబ్బ తిరగలేక సావొచ్చేది. ఇప్పుడు తిరుగుడు తప్పింది. 

- బానోతు జగ్నా, గణేశ్‌పాడు, రైతు, దామరచర్ల