శనివారం 28 నవంబర్ 2020
Suryapet - Nov 13, 2020 , 03:18:56

ఆర్నెళ్ల పని అరగంటలో..

ఆర్నెళ్ల పని అరగంటలో..

  • ఆరు వేలిచ్చి ఆఫీసర్ల సుట్టూ తిరిగిన  
  • ఇప్పుడు చూస్తుండగానే  పనైపోయింది.. 
  •  శానా సంతోషంగా ఉంది : నాగయ్య, రైతు 

భూమి రిజిస్ట్రేషన్‌ పని అంటేనే భయపడిన రైతులకు నేడు ధరణితో భరోసా దొరికింది. ..  నాడు ఆరు నెలల సమయం పడితే నేడు అరగంటలోనే అన్ని పనులు పూర్తికావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన రాగం నాగయ్య, సైదులు గురువారం తమ సోదరి పేరిట ఎకరం భూమి రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ సందర్భంగా వారిని ‘నమస్తే తెలంగాణ’ పలుకరింంది. 

ఆ వివరాలు వారి మాటల్లోనే....

 ‘పదేండ్ల కింద నేను, నా తమ్ముడు సైదులు ఐదెకరాల వారసత్వ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నం. మా ఊరి వీఆర్‌ఓ దోస్తు మధ్యవర్తిగా ఉండి పనిచేపిస్తా అన్నడు. ఎకరానికి మూడు వేలు ఖర్చు అయితయని ఒక్క రూపాయి కూడా తక్కువ తీసుకోలే. నెల రోజులకు రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు రమ్మంటే పోయినం. పొద్దంత కుసోబెట్టి సాయంత్రం సంతకాలు పెట్టిచ్చి వేలిముద్రలు తీసుకున్నడు. మళ్లా చెరొక వంద అడిగి తీసుకుండు. పదిహేను రోజులైనంక రిజిస్ట్రేషన్‌ పత్రాలు వచ్చినయి. ఆర్నెళ్లయినా మ్యుటేషన్‌ కాలే. బ్యాంకు లోను కోసం పాస్‌పుస్తకాలు అక్కరున్నయని బతిలాడినా కనికరించలే.

ఆఖరికి పంచాయితీ పెడితే తప్ప మాకు పాస్‌ పుస్తకాలు రాలే.. కానీ ఇయ్యాల మా అన్నదమ్ములం ఇద్దరం మా అక్కకి ఒక ఎకరం భూమి రాసిచ్చేది ఉండె. మా ఊళ్లనే ఒకాయన మీసేవల నమోదు చేపిస్తే రిజిస్ట్రేషన్‌ డేట్‌ ఇస్తరని చెప్పిండు. అది అయినంక ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చినం. కాయితాలు చూపిస్తే అరగంటల పని చేసిపెట్టిర్రు. మా అన్నదమ్ముళ్ల పాస్‌ పుస్తకాల నుంచి అరెకరం, అరెకరం తీసేసిన్రు. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ కండ్ల ముందల్నే అయిపోయింది’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు నాగయ్య. రైతుల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ధన్యవాదాలు తెలిపాడు.