ఆదివారం 06 డిసెంబర్ 2020
Suryapet - Nov 13, 2020 , 03:18:56

పోలీస్‌ శిక్షణ కేంద్రాన్ని వినియోగించుకోవాలి

పోలీస్‌ శిక్షణ కేంద్రాన్ని వినియోగించుకోవాలి

  •  పట్టుదలతో సాధన చేస్తే అన్నింటా విజయమే
  • యువత చదువుతోపాటు అన్నిరంగాల్లో రాణించాలి
  •  విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
  • ‘పేట’లో నిరుద్యోగ యువతకు ఉచిత పోలీస్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం  

సూర్యాపేట టౌన్‌ : ఉద్యోగ అవకాశాల కోసం ఏర్పాటు చేసిన పోలీస్‌ శిక్షణ కేంద్రాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిరుద్యోగ యువతకు ఇంటర్మీడియట్‌ విద్యావిభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్‌ శిక్షణ కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. కేవలం పోలీస్‌ ఉద్యోగాల కోసమే కాకుండా జీవితంలో చక్కని క్రమశిక్షణతో మెలిగేందుకు ఈ శిక్షణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడనుందన్నారు. మానసిక, శారీరక వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చన్నారు. శిక్షణ కోసం వచ్చే విద్యార్థులకు  శిక్షణ కాలం ముగిసేవరకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం అందజేయనున్నట్లు తెలిపారు. యువత చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని, పట్టుదలతో సాధన చేస్తే విజయం తప్పక వరిస్తుందన్నారు. చదువుకు ఆటంకం కలుగకుండా విద్యార్థులకు శిక్షణ అందించాలని మంత్రి నిర్వాహకులకు సూచించారు.  జిల్లా నలుమూలల నుంచి పోలీస్‌ ట్రైనింగ్‌ కోసం వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఎస్‌.ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గతంలో సూర్యాపేట  నిరుద్యోగ యువతకు ఉచిత భోజన వసతి కల్పించి స్టడీమెటీరియల్‌ అందించి ప్రత్యేక నిపుణులతో శిక్షణ ఇప్పించినట్లు గుర్తుచేశారు. 

కళాశాల ప్రిన్సిపాల్‌ రుద్రంగి రాము మాట్లాడుతూ.. 100రోజులపాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి షాట్‌పుట్‌ బాల్‌ వేసి యువతను ఉత్తేజపరిచారు.  10మీటర్ల దూరం బాల్‌ను విసిరి అందరినీ ఆశ్యర్యపరిచారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వై.వెంకటేశ్వర్లు, ఎస్‌.ఫౌండేషన్‌ సీఈఓ వీరన్న, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.