శనివారం 28 నవంబర్ 2020
Suryapet - Nov 12, 2020 , 02:46:32

సాఫీగా సన్న ధాన్యం కొనుగోళ్లు

సాఫీగా సన్న ధాన్యం కొనుగోళ్లు

  •  టోకెన్ల ద్వారా సులువుగా దిగుమతి

మిర్యాలగూడ : మిర్యాలగూడ రైసు మిల్లుల వద్ద సన్నధాన్యం కొనుగోళ్లు సాఫీగా కొనసాగుతున్నాయి.  మిల్లుల వద్దకు వేలాది ట్రాక్టర్లు రావడం, రైతులు రోజుల తరబడి రోడ్లపై ఉండడంతో అధికారులు చర్యలు తీసుకొని టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో మిల్లుల వద్దకు వచ్చిన ఐదారుగంటల్లోనే ధాన్యం దిగుమతి అవుతుంది. ధాన్యం విక్రయించిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

టోకెన్ల ద్వారానే కొనుగోళ్లు.. 

ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేందుకు అధికారులు రైతులకు పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా టోకెన్లు జారీ చేశారు.   టోకెన్లు పొం దిన రైతులు వారికి కేటాయించిన తేదీల్లో మిల్లుల వద్దకు వెళ్లగానే నాలుగైదు గంటల్లో ధాన్యం దిగుమతి అవుతుంది. కాగా మిల్లర్లు కూడా ఎలాంటి పేచీలు లేకుండా టోకెన్ల ఆధారంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు.

టోకెన్ల కోసం బారులు 

రైతులు టోకెన్లు పొందేందుకు ఆయా మండల కేంద్రాల్లో ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. మిర్యాలగూడ మండలం పూర్తిగా ఆయకట్టు కావడంతో రైతులు, మహిళలు టోకెన్ల కోసం భారీగా తరలివస్తున్నారు. మిర్యాలగూడ తాసీల్దార్‌ కార్యాలయం ఇరుకుగా ఉండడంతో వారు అవస్థలు పడుతున్నారు. దీంతో శనివారం నుంచి మిర్యాలగూడ మండల రైతులకు  టోకెన్లు పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్‌లో పంపిణీ చేయాలని నిర్ణయించారు. రైతులు శనివారం నుంచి టోకెన్ల కోసం పాత వ్యవసాయ మార్కెట్‌కు రావాలని ఏడీఏ నాగమణి సూచించారు. 

13 వరకు టోకెన్లు పంపిణీ

మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన రైతులకు ఆయా మండల కేంద్రాల్లో ఈనెల 13వ తేదీ వరకు టోకెన్లు పంపిణీ చేశారు. అయితే మిర్యాలగూడ తాసీల్దార్‌ కార్యాలయం వద్ద వందలాది మంది రైతులకు టోకెన్లు లభించక పోవడంతో అప్పటికే  లైన్లలో ఉండి టోకెన్‌ లభించని రైతులకు నాయబ్‌ తాసీల్దార్‌ సంతకంతో కూడిన ప్రత్యేక చిట్టీలు అందించారు. ఈ చిట్టీల ఆధారంగా రైతులకు  14వ తేదీ రోజు పాత వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్ల టోకెన్లను అధికారులు పంపిణీ చేయనున్నారు.