శుక్రవారం 27 నవంబర్ 2020
Suryapet - Nov 12, 2020 , 02:46:32

గాడిన పడుతున్న ఆర్టీసీ ప్రజా రవాణా

 గాడిన పడుతున్న ఆర్టీసీ ప్రజా రవాణా

  •  పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య
  • రెండు నెలలుగా రెట్టింపవుతున్న ఆదాయం  
  •  అధికారులు, సిబ్బందిలో నూతనోత్సాహం  

నల్లగొండ సిటీ/సూర్యాపేట అర్బన్‌ : కరోనా ఎఫెక్ట్‌తో ఆర్టీసీ కుదేలైంది. బస్సుల్లో ప్రయాణం సేఫ్‌ కాదని భయపడిన ప్రయాణికులు సొంత, ప్రైవేట్‌ వాహనాల్లో రాకపోకలు సాగించారు. దీంతో సంస్థ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. రెండు నెలల నుంచి కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రయాణికులు తిరిగి ఆర్టీసీ బాట పడుతున్నారు. మళ్లీ బస్సుల్లో ప్రయాణం చేస్తుండడంతో  రద్దీ పెరుగుతోంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఆక్యుపెన్సీ రేటు పెరుగడంతోపాటు సంస్థ ఆదాయం రోజు రోజుకూ పుంజుకుంటోంది. నల్లగొండ జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో జూన్‌లో రూ.6.22కోట్ల ఆదాయం రాగా, అక్టోబర్‌లో రూ.9.31కోట్లకు పెరిగింది. అలాగే సూర్యాపేట జిల్లాలోని రెండు డిపోల పరిధిలో మే నెలలో రూ.1.24కోట్ల ఆదాయం రాగా, సెప్టెంబర్‌ నాటికి రూ.4.20 కోట్లకు పెరిగింది. పెరుగుతున్న ఆదాయం ఆర్టీసీ అధికారులు, ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

లాక్‌డౌన్‌ తర్వాత..

లాక్‌డౌన్‌ కాలంలో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. మార్చి 19నుంచి మే18 వరకు ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. ప్రస్తుతం 50శాతం బస్సులు మాత్రమే రోడెక్కాయి. డ్రైవర్లందరూ విధుల్లోకి వస్తుండగా 80శాతం మంది కండక్టర్లు మాత్రమే అవసరమవుతున్నారు. సుమారు 42రూట్లలో బస్సులు నడుపుతుండగా ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ట్రిప్పులను తగ్గిస్తూ పెంచుతూ ఉన్నారు. 

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ...

ఇప్పటికే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు మూడుసార్లు మాస్కులు పంపిణీ చేయగా రోజూ సిబ్బందితో పాటు ప్రయాణికుల కోసం శానిటైజర్లు అందిస్తున్నారు. ప్రతి బస్సును సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేసిన తర్వాతనే డిపో నుంచి బయటకు పంపిస్తున్నారు. 

పెరిగిన ప్రయాణికుల రద్దీ..

కరోనా భయంతో గతంలో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేసినవారు ఇప్పుడు ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గుచూపుతున్నారు. గడిచిన 7నెలలతో పోల్చితే ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్‌ వరకు ఓఆర్‌ 30నుంచి 35శాతానికి మించలేదు. అంటే 60 సీట్లు ఉన్న బస్సులో సగటున 30సీట్లు మాత్రమే నిండేవి. కానీ ప్రస్తుతం 40నుంచి 50శాతానికి ఓఆర్‌ పెరిగింది. గడిచిన వారం రోజులుగా బస్సులో ప్రయాణికుల రద్దీ పెరిగింది. 

దసరా నుంచి..  

ప్రయాణికుల రద్దీ పెరుగడంతో నల్లగొండ జిల్లా పరిధిలోని నాలుగు డిపోల పరిధిలో ఆదాయం పెరుగుతోంది. దసరా నుంచి అన్ని బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చారు. దీంతో ఐదు నెలలపాటు నష్టాలు రాగా దసరా నుంచి కొంతమేర ఆదాయం మెరుగుపడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కరోనా కంటే ముందు రోజుకు రూ.75లక్షల ఆదాయం రాగా, కరోనా తర్వాత ఆదాయం పూర్తిగా పడిపోయింది. 

ఏ డిపోలో ఎంత..

నల్లగొండ జిల్లాలో డిపోల వారీగా ఆదాయం ఇలా ఉంది. జూన్‌లో నల్లగొండ డిపోలో 10.12 లక్షల కిలోమీటర్లు తిరుగగా రూ.1.56 కోట్ల ఆదాయం వచ్చింది. జూలైలో 7.85 లక్షల కిలోమీటర్లు తిరుగగా రూ.1.17 కోట్లు, ఆగస్టులో 8.33 లక్షలకు రూ.1.46 కోట్లు, సెప్టెంబర్‌లో 9.81లక్షలకు రూ.1.99 కోట్లు, అక్టోబర్‌లో 10.68 లక్షలకు రూ.2.66 కోట్ల ఆదాయం వచ్చింది. అదేవిధంగా దేవరకొండ డిపో పరిధిలో జూన్‌లో 9.97 లక్షల కిలో మీటర్లకు రూ.1.87 కోట్ల ఆదాయం, జూలైలో 7.51లక్షల కిలోమీటర్లకు రూ.1.37 కోట్లు, ఆగస్టులో 8లక్షలకు రూ.1.73 కోట్లు, సెప్టెంబర్‌లో 9.02 లక్షలకు రూ.2.09 కోట్లు, అక్టోబర్‌లో 9.98 లక్షలకు రూ.2.64 కోట్ల ఆదాయం వచ్చింది. నార్కట్‌పల్లి డిపో పరిధిలో జూన్‌లో 5.53 లక్షల కిలోమీటర్లకు రూ.83.84లక్షల ఆదాయం, జూలైలో 4.75 లక్షలకు రూ.65.22 లక్షలు, ఆగస్టులో 4.83 లక్షలకు  రూ.76.04 లక్షలు, సెప్టెంబర్‌లో 5.18లక్షలకు రూ.92.60 లక్షలు, అక్టోబర్‌లో 5.85 లక్షలకు రూ.1.22 కోట్ల ఆదాయం వచ్చింది. మిర్యాలగూడ డిపో పరిధిలో జూన్‌లో 10.49 లక్షల కిలోమీటర్లకు రూ.1.96 కోట్ల ఆదాయం, జూలైలో 7.42 లక్షలకు రూ.1.25 కోట్లు, ఆగస్టులో 7.62 లక్షలకు రూ.1.54 కోట్లు, సెప్టెంబర్‌లో 9.33 లక్షలకు రూ.2.16 కోట్లు, అక్టోబర్‌లో 10.48 లక్షల కిలోమీటర్లకు రూ.2.79 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వివరించారు. 

సూర్యాపేట జిల్లాలో..  

లాక్‌డౌన్‌కు ముందు సూర్యాపేట డిపో పరిధిలో ప్రతి రోజూ రూ.14 నుంచి 16లక్షల ఆదాయం రాగా లాక్‌డౌన్‌ అనంతరం మే నెలలో 3,72,058 కిలోమీటర్లకు రూ.67,35,736 ఆదాయం వచ్చింది. జూన్‌లో 11,65,855 కి.మీటర్లకు రూ.2,09,53,568, జూలైలో 8,68,263 కి.మీటర్లకు రూ.1,42,13,370, ఆగస్టులో 8,43,988 కి.మీటర్లకు రూ.1,56,86,226, సెప్టెంబర్‌లో 8,91,165 కి.మీటర్లకు రూ.1,93,53,784, అక్టోబర్‌ 20నాటికి 6,30,442 కి.మీటర్లకు రూ.1,45,11,753 ఆదాయం వచ్చినట్లు డిపో అధికారులు తెలిపారు. అలాగే కోదాడ డిపో పరిధిలో మే నెలలో 2,56,991 కి.మీటర్లకు  రూ.57,53,567 ఆదాయం, జూన్‌లో 8,75,424 కి.మీటర్లకు రూ.1.72కోట్లు, జూలైలో  6,32,511కి.మీటర్లకు రూ.1.08 కోట్లు, ఆగస్టులో 5,74,526 కి.మీటర్లకు రూ.1.24కోట్లు, సెప్టెంబర్‌లో 6,39,852 కి.మీటర్లకు రూ.1.63కోట్లు, అక్టోబర్‌లో 5,26,607కి.మీటర్లకు రూ.1.36 కోట్ల ఆదాయం లభించింది. 

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం  

లాక్‌డౌన్‌ అనంతరం బస్సులు తిరిగి ప్రారంభమైన సమయంలో ప్రయాణికులు కొంత తగ్గినప్పటికీ ప్రస్తుతం వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేటును పెంచడంతోపాటు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నాము. ప్రతిరోజూ బస్సులను శానిటైజర్‌ చేస్తూ  ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పిస్తున్నాం. గతంలో కంటే ప్రస్తుతం సంస్థ ఆదాయం పెరుగుతోంది. సంస్థ ఉద్యోగులు ప్రయాణికులకు సరైన సేవలందిస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణం  సురక్షితమనే విషయాన్ని ప్రయాణికులు గమనించాలి.

- శివరామ కృష్ణ, డీఎం, సూర్యాపేట